న్యూఢిల్లీ : రైల్వే నియామకాల్లో అక్రమాలకు సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) తొలి చార్జిషీట్‌ను బుధవారం కోర్టులో సమర్పించింది. ఈ కేసులో ఆర్‌జెడి చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ భార్య, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, కుమార్తెలు మిసా భారతి, హేమ యాదవ్, కుటుంబ సన్నిహితుడు అమిత్ కత్యాల్‌తో సహా మొత్తం ఏడుగురి పేర్లను నిందితులుగా పేర్కొంది. అనుబంధాలతో సహా 4,700 పేజీలతో ఉన్న ఈ చార్జిషీట్‌ను ఢిల్లీలోని స్పెషల్ ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (పిఎంఎల్‌ఎ) కోర్టులో బుధవారం ఇడి సమర్పించింది. ఇదే రోజున చార్జిషీట్, డ్యాక్యుమెంట్ల ఇ-కాపీని కూడా దాఖలు చేయాలని ఇడిని ప్రత్యేక జడ్జి విశాల్ గోగే ఆదేశించారు. విచారణను ఈ నెల 16కు లిస్ట్ చేశారు. కాగా, ఇదే కేసులో ఇడి ఇప్పటికే గత ఏడాది నవంబర్‌లో కత్యాల్‌ను అరెస్టు చేసింది. లాలూ ప్రసాద్ యాదవ్‌కు సమన్లు పంపినా ఇంకా విచారించలేదు. అయితే లాలూ కుమారుడు తేజస్వీయాదవ్‌ను ఒకసారి విచారించింది. రబ్రీదేవి, మిసా భారతి, చాంద్ యాదవ్, రాగాణి యాదవ్‌లను కూడా విచారించింది. 2004 నుంచి 2009 వరకూ లాలూ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఈ స్కామ్ జరిగిందని ఇడి ఆరోపిస్తోంది. రైల్వేల్లో ఉద్యోగాల కోసం అభ్యర్థుల నుంచి లాలూ కుటుంబ సభ్యులు భూమిని డిమాండ్ చేశారని ఇడి తన చార్జిషీట్‌లో పేర్కొంది.