ఐఏఎస్‌ అమోయ్ కుమార్‌ను రెండో రోజు విచారించిన ఈడీ

– అబ్దుల్లాపూర్‌మెట్‌ భూవివాదాలపై ప్రశ్నించిన అధికారులు
– నేడూ కొనసాగనున్న విచారణ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి :
భూముల కేటాయింపులు జరిగిన భారీ అక్రమాలకు సంబంధించి రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల మాజీ కలెక్టర్‌, ప్రస్తుత పశు సంవర్ధక శాఖ జాయింట్‌ సెక్రెటరీ అమోయ్ కుమార్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు గురువారం రెండో రోజు కూడా విచారించారు. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల కలెక్టర్‌గా ఉన్న సమయంలో ప్రభుత్వ భూముల కేటాయింపులకు సంబంధించి అమోయ్ కుమార్‌.. స్వార్థ లాభాపేక్షతో వ్యవహారం నడిపించారని ఆరోపణలున్నాయి. దీనిపై మొదటి రోజు విచారణ పూర్తి చేసిన ఈడీ అధికారులు.. రెండో రోజు కూడా అమోరును సుదీర్ఘంగా ప్రశ్నించారని తెలిసింది. ముఖ్యంగా, అబ్దుల్లాపూర్‌మెట్‌లోని సర్వే నెంబర్‌.17కు చెందిన భూములకు సంబంధించి తమను బెదిరించి మరీ భూములను లాక్కొన్నారని బాధితులతో పాటు రెవెన్యూ అధికారులు కూడా ఈడీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకొని తమ వద్ద ఉన్న కొన్ని ఆధారాలనుబట్టి ఈడీ అధికారులు అమోరుకుమార్‌పై ప్రశ్నల వర్షం కురిపించినట్టు సమాచారం. మొదటి రోజు కొంత వివరాలు సేకరించిన అధికారులు.. రెండో రోజు విచారణలో సైతం మరికొంత సమాచారాన్ని అక్రమాలకు సంబంధించి సేకరించినట్టు తెలిసింది. కాగా, ఇంకా విచారణ పూర్తి కానందున శుక్రవారం మూడో రోజు కూడా తమ ఎదుట హాజరు కావాలని అమోరుకుమార్‌ను ఈడీ అధికారులు ఆదేశించినట్టు సమాచారం.