– పలు పత్రాల స్వాధీనం
– మరో 5 శాతం షేర్ పతనం
న్యూఢిల్లీ : మనీలాండరింగ్, ఆర్థిక అవకతవకల ఆరోపణలు ఎదుర్కొంటున్న పేటియం మాతృసంస్థ అయినా వన్97 కమ్యూనికేషన్ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు విచారించారని సమాచారం. ఆ సంస్థపై ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో వారి నుంచి కొన్ని పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఇటీవల ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో పేటియంపై విచారణ చేయాలా వద్దా అనే దానిపై.. ఈ పత్రాలను పరిశీలించి ఈడీ నిర్ణయం తీసుకోనుంది. ఫెమా చట్టంలోని నిబంధనలను ఏమైనా ఉల్లంఘించారేమో అని ఆరా తీస్తున్నట్టు ఓ అధికారి పేర్కొన్నారు. ఈడీ అధికారులు కోరిన సమాచారం, పత్రాలను పేటియం ఇప్పటికే అందించినట్టు తెలుస్తోంది. వచ్చే వారంలోగా మరిన్ని వివరాలు అందజేయాలని ఇది ఆదేశించినట్టుగా సమాచారం. కాగా పేటియంపై చర్యల నేపథ్యంలో ఆర్బిఐ వద్ద ఉన్న సమాచారాన్ని ఇప్పటికే ఇడి, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) కోరాయి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ ఫిబ్రవరి 29 నుంచి డిపాజిట్లను స్వీకరించొద్దని ఆర్బీఐ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.
రూ.27వేల కోట్ల సంపద ఆవిరి..
పేటియంపై ఆర్బీఐ చర్యల నేపథ్యంలో ఆ సంస్థ షేర్ వరుసగా పడిపోతోంది. గురువారం మరో 5 శాతం క్షీణించి రూ.325.30 ఆల్‌టైం కనిష్ట స్థాయి వద్ద ముగిసింది. పేటీయంపై అవకతవకల ఆరోపణలపై ఈడీ విచారణకు దిగిందనే వార్తలు ఆ కంపెనీ షేర్‌ను మరింత ఒత్తిడికి గురి చేస్తున్నాయి. ఆర్బీఐ ఆంక్షలు విధించినప్పటి నుంచి 11 రోజులలో పేటియం ఇన్వెస్టర్లు సుమారు రూ.27 వేల కోట్ల సంపదను నష్టపోయారు. 2023 అక్టోబర్‌లో ఆల్ టైం గరిష్ట స్థాయి రూ.998 వద్ద నమోదయిన విలువతో పోల్చితే గురువారం నాటికి 66 శాతం పైగా పతనమైంది. కాగా లిస్టింగ్ సమయంలో దాదాపు రూ.1800 పైగా పెట్టి కొనుగోలు చేసిన ఈ స్టాక్స్ మదుపర్లు ఇప్పుడు లబోదిబోమంటున్నారు.
ె