– హేమంత్ సొరెన్ మనీలాండరింగ్ కేసులోనే విచారణ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహూకు కేంద్ర ఏజెన్సీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు పంపింది. జార్ఖండ్ మాజీ సీఎం హేమత్ సొరెన్ అరెస్టయిన మనీలాండరింగ్ కేసులో ప్రశ్నించటానికే ఆయనకు పిలుపందిందని ఈడీ వర్గాలు తెలిపాయి. జార్ఖండ్‌కు చెందిన ధీరజ్ సాహూ కంపెనీలపై గతేడాది డిసెంబర్‌లో ఐటీ శాఖ చేసిన దాడుల్లో వందల కోట్ల రూపాయలు బయటపడటంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా వినిపించిన విషయం విదితమే. ఇప్పుడు హేమంత్ సొరెన్ కేసులో ఆయనను ఈడీ పిలవటం ప్రాధాన్యతను సంతరించుకున్నది. హేమంత్ సొరెన్, ఢిల్లీలో గతనెల 29న ఆయన ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న బీఎండబ్ల్యూ ఎస్‌యూవీ విషయంలో ధీరజ్ సాహూకు సంబంధాలున్నాయన్న ఆరోపణలపై ఈడీ విచారించాలనుకుంటున్నట్టు తెలిసింది. ఆయనను ప్రశ్నించి, వాంగ్మూలాన్ని రికార్డు చేయాలనుకుంటున్నట్టు సమాచారం.