నవతెలంగాణ – మల్హర్ రావు
గురు పౌర్ణమి వేడుకలు పురస్కరించుకుని మండలంలోని ఎడ్లపల్లి గ్రామంలో షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి,ఆదివారం గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. షిర్డీ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన పూలతో బాబాను ముస్తాబు చేశారు. ఉదయం నుంచే సందర్శకులు అధిక సంఖ్యలో హాజరై బాబాను దర్శించుకొని ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు.సాయిబాబా దేవాలయ ప్రాంగణంలో దత్తాత్రేయ, విఘ్నేశ్వర, సరస్వతి దేవతలకు విశేష పూజలు చేసి గురుపూజోత్సవం నిర్వహించారు.అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సందర్శకులకు అన్నదానం నిర్వహించారు.ఉత్సవమూర్తిని అత్యంత భక్తిశ్రద్ధలతో పురవీధుల్లో ఊరేగించారు. భారీ వర్షాల్లోనూ ఎడ్లపల్లి గ్రామంలోని షిర్డీ సాయిబాబా ఆలయ ప్రాంగణమంతా సాయినామస్మరణతో మార్మోగింది.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు,అధిక సంఖ్యలో సందర్శకులు పాల్గొన్నారు.