– స్టేట్‌మెంట్ ఇవ్వాలని అప్రూవర్లపై ఒత్తిడి : సింఘ్వీ
– సీఎంను అవమానించడమే ఈడీ లక్ష్యం
– కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై ఈడీ అభ్యంతరం
– ఢిల్లీ హైకోర్టులో ముగిసిన వాదనలు… తీర్పు రిజర్వ్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో సీఎం కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలని ఈడీ అప్రూవర్లుగా మారిన నిందితులను బలవంత పెట్టిందని కేజ్రీవాల్ తరపు సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ ఢిల్లీ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఎంపీ మాంగుట శ్రీనివాసులు, ఆయన కుమారుడు రాఘవ, శరత్ చంద్రా రెడ్డిలు ఇచ్చిన వాంగ్మూలాలను ఈడీ ప్రధానంగా చూపిస్తోందని చెప్పారు. అయితే ఇందులో అప్రూవర్లుగా మారిన ఇద్దరు నిందితులు కేంద్రంలోని అధికార పార్టీతో లింక్ లు ఉన్నాయని పేర్కొన్నారు. లిక్కర్ స్కాంలో తన అరెస్ట్ సవాల్ చేస్తూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను బుధవారం జస్టిస్ స్వర్ణకాంత శర్మతో కూడిన ఏకసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. దాదాపు మూడు గంటల పాటు ఈడీ, కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. కేజ్రీవాల్ తరపు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, విక్రమ్ చౌదరీలు, ఈడీ తరపు అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీరాజు లు వాదనలు వినిపించారు. ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ ను అవమానించడానికి, నైరాశ్య పరచడానికి అరెస్ట్ చేశారని కోర్టుకు వివరించారు. ఎన్నికలు జరిగే సమయంలో కేజ్రీవాల్ అరెస్ట్ సరికాదన్నారు. ఈ కేసు ఎన్నికల సమయ సమస్యలతో కూడుకున్నదని వివరించారు. అందువల్ల కేజ్రీవాల్ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనలేరని, ఎన్నికలకు ముందే పార్టీని కూల్చివేయ డానికి జరుగుతున్న ప్రయత్నంగా ఆరోపించారు. ఈ కేసులో కేజ్రీవాల్ కి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవన్నారు. మాగుంట రాఘవ, శరత్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి మొదట ఇచ్చిన స్టేట్‌మెంట్ లలో కేజ్రీవాల్ గురించి వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. ఇందులో మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కూటమిలో ఒక పార్టీ అభ్యర్థిగా ఉన్నారని, శరత్ చంద్రా రెడ్డి బీజేపీకి ఎలక్టోరల్ బాండ్స్ కొన్నారని కోర్టుకు నివేదించారు. ఈడీ పూర్తిగా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందని చెప్పారు. మాగుంట రాఘవ మొదట ఇచ్చిన వాంగ్మూలాలు బయట పెట్టకపోవడం ఇందులో భాగమని పేర్కొన్నారు. కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్ ఇచ్చేంత వరకు స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేస్తూనే ఉంటామని ఈడీ చెప్పిందని సింఘ్వి వాదించారు. ఈ రెండేండ్ల పాటు జరిపిన దర్యాప్తు లో ఈడీ ఏమి కనుగోనలేకపోయిం దని, ఈ స్టేట్‌మెంట్‌లలో కూడా ఏమీ లేదని అన్నారు. లంచ్ బ్రేక్ తర్వాత ఈడీ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. చట్టం ముందు సీఎం అయినా, ఏవరైనా ఒక్కటే అన్నారు. కేజ్రీవాల్ తన అరెస్ట్ పై సవాల్ చేస్తూ బెయిల్ కోరారని, ఆ ప్రక్రియ ముగిసి ప్రస్తుతం జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారని గుర్తు చేశారు. లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్ కింగ్ పిన్ గా ఉన్నారని మరోసారి ఆరోపించారు. కేజ్రీవాల్ తన పార్టీ పేరును తెలివిగా ఆమ్ ఆద్మీ అని పెట్టకున్నారని అన్నారు. ఆమ్ ఆద్మీ (సామాన్య వ్యక్తి) నేరం చేస్తే కటకటాల్లోకి వెళ్లాలన్నారు. కానీ సీఎం అయినందున అరెస్ట్ చేయకూడదనడం సరికాదన్నారు. మీరు దేశాన్ని దోచుకోవచ్చు, కానీ ఎన్నికలు వస్తున్నాయని ఎవరు మిమ్మల్ని ముట్టుకోవద్దని అంటే ఎలా అని ప్రశ్నించారు. ఈ పిటిషన్ పై ఇరువైపు వాదనలను ముగించినట్లు పేర్కొన్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ… తీర్పు రిజర్వ్ చేస్తున్నట్టు వెల్లడించారు.
ప్రమాదంలో కేజ్రీవాల్ ఆరోగ్యం
ఢిల్లీ మంత్రి, ఆప్ కీలక నాయకురాలు అతిషి.. జైలులో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంపై సమాచారాన్ని వెల్లడించారు. కేజ్రీవాల్ అరెస్టయినప్పటి నుంచి ఆయన దాదాపు 4.5 కిలోల బరువు తగ్గారని అతిషి ‘ఎక్స్’ వేదికగా ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు. బీజేపీ.. ఆప్ అధినేతను జైలులో పెట్టడం ద్వారా ఆయన ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో మార్చి 22న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన విషయం విదితమే. ఢిల్లీ కోర్టు తీర్పు మేరకు కేజ్రీవాల్‌ను ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీకి తరలించిన తర్వాత సోమవారం తీహార్ జైలుకు తరలించారు.కేజ్రీవాల్ తీవ్రమైన మధుమేహ వ్యాధిగ్రస్తుడనీ, ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ దేశానికి సేవ చేసేందుకు 24 గంటలు పని చేసేవారని అతిషి తన పోస్ట్‌లో వివరించారు. అరవింద్ కేజ్రీవాల్‌కు ఏదైనా జరిగితే దేవుడు కూడా బీజేపీని క్షమించడని పేర్కొన్నారు. ”అరవింద్ కేజ్రీవాల్ తీవ్రమైన మధుమేహ వ్యాధిగ్రస్తులు. ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ, అతను రోజుకు 24 గంటలు పని చేస్తూ దేశానికి సేవ చేసేవాడు. అరెస్టు చేసినప్పటి నుంచి అరవింద్ కేజ్రీవాల్ 4.5 కిలోల బరువు తగ్గాడు. ఇది చాలా ఆందోళన కలిగిస్తున్నది. ఈ రోజు బీజేపీ కేజ్రీవాల్‌ను జైలులో పెట్టటం ద్వారా ఆయన ఆరోగ్యం ప్రమాదంలో పడింది. కేజ్రీవాల్‌కు ఏదైనా జరిగితే.. దేశం మొత్తాన్ని మరచిపోండి, దేవుడు కూడా బీజేపీని క్షమించడు” అని అతిషి హిందీలో తన పోస్ట్‌లో పేర్కొన్నారు. కేజ్రీవాల్ ఆరోగ్యంపై అతిషి చేసిన ఆరోపణలను తీహార్ జైలు అధికారులు ఖండించారు. ఢిల్లీ సీఎం ఆరోగ్యం సాధారణంగానే ఉన్నదని తీహార్ జైలు వర్గాలు తెలిపాయి. అరవింద్ కేజ్రీవాల్ షుగర్ లెవెల్ తక్కువగా ఉన్నదని, షుగర్ లెవల్స్ హెచ్చుతగ్గులకు లోనవుతున్నందున జైలు వైద్యుల పర్యవేక్షణలో ఉంచామని వివరించాయి. ఆప్ చీఫ్ తన సెల్‌లో యోగా, మెడిటేషన్ చేశారనీ, బుధవారం ఉదయం తన బ్యారక్‌లో నడిచారని తెలిపాయి. అతని సెల్‌లోని సీసీటీవీ కెమెరాల ద్వారా 24 గంటల నిఘా ఉంచారు. జైలు నంబర్ 2 లోపల ఉన్న కేజ్రీవాల్ మంగళవారం కూడా ఆయన భార్య సునీతా కేజ్రీవాల్‌తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. తీహార్ జైలులో తన న్యాయవాదిని కలిశారు. జైలు లోపల ఇంట్లో వండిన ఆహారాన్ని కేజ్రీవాల్‌కు అనుమతించినట్టు ఒక అధికారి తెలిపారు.