పర్యవేక్షణ లేని అనాథ శాఖగా.. విద్యాశాఖ

– బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షఁలు వేముల రామకృష్ణ
నవతెలంగాణ – ముషీరాబాద్‌
పర్యవేక్షణ లేని అనాథ శాఖగా రాష్ట్రంలో విద్యాశాఖ తయారైందని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణ అన్నారు. శనివారం విద్యానగర్‌ బీసీ భవన్‌ లో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శిగా అనిల్‌ను నియమించి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీ ఆర్‌ కృష్ణయ్య చేతుల మీదగా నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం వేముల రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడగానే మద్యానికి మంత్రి ఉన్నారు గాని విద్యా శాఖకు మంత్రి లేరన్నారు. పర్యవేక్షణ లేని అనాథశాఖగా విద్యాశాఖ మారిందన్నారు. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే పేదలకు చదువు ఎంతో అవసరమన్న సోయి రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడం శోచనీయ మన్నారు. పేద పిల్లలకు చదువు చెప్పే శాఖ లేకపోవడంతో పేద విద్యార్థులకు చదువును దూరం చేయడం అవుతుందన్నారు. ప్రభుత్వ టెక్స్ట్‌ బుక్స్‌ ప్రింటింగ్‌ సమయంలో పర్యవేక్షణ లేక రాష్ట్ర ఖజానాపై అదనకు భారం పడుతుందని తెలిపారు. రాష్ట్రంలో 2,667 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 33 జిల్లాలకు 26 జిల్లాలలో డీఈవోలు లేరని.. ఇది చూస్తే మన విద్యా వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టిందో అర్థం అవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ ప్రతిష్టంగా ఉండాలంటే గ్రూప్‌ వన్‌ ఆఫీసర్‌ను డీఈఓగా నియమించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్‌ స్కాలర్‌ షిప్స్‌ బకాయిలు వెంటనే చెల్లించాలని, సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం నాయకులు ప్రీతం, అనిల్‌, ప్రవీణ్‌, సాయి వర్ధన్‌ తదితర నాయకులు పాల్గొన్నారు.