విద్యకే అధిక ప్రాధాన్యం: ఎమ్మెల్యే జారే 

నవతెలంగాణ – అశ్వారావుపేట
ఉపాద్యాయ వృత్తి నుండి వచ్చిన తనకు విద్య యొక్క ప్రాధాన్యత తెలుసని,విద్య ద్వారానే సమాజంలో ఎవరైనా సమగ్ర అభివృద్ధి చెందుతారని, అందుకే విద్యాభివృద్ధి,నాణ్యమైన విద్య అందించేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నానని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చెప్పారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను చదువును మధ్యలో మాన్పించే  విధంగా కాకుండా ఉన్నత విద్య కొనసాగించాలా ప్రోత్సహించాలని కోరారు. పాఠశాలలు పునఃప్రారంభం సందర్భంగా బుధవారం స్థానిక ఉన్నత పాఠశాలలో జరిగిన ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథి గా హజరయ్యారు. ముందుగా పాఠశాల ప్రాంగణంలో ఉన్న ప్రొ. జయశంకర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ చదువు భవిష్యత్ ఉన్నతికి ఎంతో దోహదపడుతుందని,చదువును నిర్లక్ష్యం చేయకుండా విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.పదో తరగతి విద్యార్థుల ఐదేళ్ళ రికార్డును ఉపాద్యాయులు నమోదు చేయాలని,ఉన్నత చదువు మానేయకుండా వారి పట్ల శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. విద్యా ప్రాముఖ్యత గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఆ దశకు సంస్కరణలు తీసుకుంటుందని,పాఠశాలల పునః ప్రారంభం రోజే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు అందించటమే ఇందుకు నిదర్శనమని ఉదాహరించారు. అనంతరం మైనార్టీ గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్ధులకు మనో వికాసం పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మి,ఎం.పి.టి.సీ లు భారతి,తిరుమల బాలగంగాధర్, ఎంపీడీవో జి.శ్రీనివాసరావు, సెర్ప్ ఏపీఎం వెంకటేశ్వరరెడ్డి, కాంగ్రెస్ నాయకులు జూపల్లి రమేష్, మొగళ్ళపు చెన్నకేశవరావు, తుమ్మ రాంబాబు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.