విద్య, వైద్యం అభివృద్ధికి సంపూర్ణ సహకారం

For the development of education and medicine Perfect collaboration– ప్రముఖ సినీ నటుడు సోనూసూద్‌
– శంషాబాద్‌లో సిద్దురెడ్డి నిర్మించిన స్కూల్‌ భవనం ప్రారంభం
నవతెలంగాణ-శంషాబాద్‌
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్య, వైద్య రంగాల అభివృద్ధికి అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తామని ప్రముఖ సినీ నటుడు సోనూసూద్‌ అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని సిద్ధాంతి గ్రామంలో ప్రముఖ వ్యాపారవేత్త కందకట్ల సిద్దురెడ్డి సుమారు రూ.65 లక్షలతో ప్రభుత్వ పాఠశాల భవనాన్ని నిర్మించారు. ఈ భవనాన్ని చేవెళ్ల ఎంపీ జి.రంజిత్‌ రెడ్డి, రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే టి.ప్రకాష్‌ గౌడ్‌, దాత సిద్దురెడ్డితో కలిసి సోమవారం సోనూసూద్‌ ప్రారంభించారు. స్థానిక కౌన్సిలర్‌ మేకల వెంకటేష్‌ ముదిరాజ్‌ ఆధ్వర్యంలో పాఠశాల వద్ద జరిగిన కార్యక్రమంలో సోనూసూద్‌ మాట్లాడారు. తాను పుట్టి పెరిగింది పంజాబ్‌లో అన్నారు. నార్త్‌లో హీరోగా.. సౌత్‌లో విలన్‌గా నటిస్తూ అక్కడ, ఇక్కడ ప్రజల అభిమానాన్ని సంపాదించానని తెలిపారు. తను నార్త్‌ అయినప్పటికీ తన భార్య తెలుగు అమ్మాయి అని చెప్పారు. దీంతో తెలుగుతో తనకు విడదీయరాని బంధం ఏర్పడిందని తెలిపారు. దేశంలోగానీ రాష్ట్రంలోగానీ ప్రభుత్వ విద్య, వైద్య రంగాలనే బలపడితేనే సామాన్య ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. తద్వారా సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. శంషాబాద్‌లో సిద్దురెడ్డి నిర్మించిన పాఠశాల భవనం గురించి హీరో ఇంద్రసేన ద్వారా తెలుసుకున్నానని చెప్పారు. ఈ విషయంపై సిద్దురెడ్డిని పిలిపించి చర్చించినట్టు తెలిపారు. రాబోవు రోజుల్లో శంషాబాద్‌లో తాను కూడా సొంత నిధులతో ప్రభుత్వ పాఠశాల భవనాల నిర్మాణం చేస్తానని హామీ ఇచ్చారు. త్వరలో ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సిద్దురెడ్డి ద్వారా చర్యలు తీసుకుంటానన్నారు. విద్యార్థులకు బ్యాగులు అందజేశారు. ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. ప్రముఖ నటుడు సోనూసూద్‌ కోవిడ్‌-19 సమయంలో సహాయ, సహకారాలు అందించి ఎంతోమంది జీవితాలను కాపాడారని తెలిపారు. ఆయన స్ఫూర్తితో సిద్దురెడ్డి ప్రభుత్వ పాఠశాల భవనం నిర్మించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.