విద్యకు ప్రాధాన్యతేది?

Editorial‘దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది’ అని పెద్దలంటారు. కానీ పాలకులకు దీని అభివృద్ధి పట్టదు. నాణ్యమైన విద్యను అందిస్తామని హామీనిచ్చిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ మాటను ఎప్పుడో మర్చిపోయింది. బడ్జెట్‌లో విద్యకు చేస్తున్న కేటాయింపులు ప్రపంచ దేశాలతో పోల్చితే చాలా తక్కువ. సోషలిస్టు క్యూబాతోనే కాదు అనేక పశ్చిమ, యూరోపియన్‌ దేశాలు, ఇతర అభివృద్ధి చెందుతున్న బ్రెజిల్‌, దక్షిణాఫ్రికా, కెన్యా లాంటి దేశాల కంటే చాలా తక్కువ కేటాయింపులు జరుగుతున్నాయి. విద్యారంగం మీద ప్రాధాన్యం మేరకు ఖర్చు చేస్తున్న దేశాలు అభివృద్ధి సాధిస్తున్నాయి. ఈ విషయంలో ఎంతోమంది అనేక రకాల సూచనలు చేసినా, ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీలూ నివేదికల రూపంలో అందించినా అవి బుట్టదాఖలే. యూపీఏ హయాంలో విద్యారంగం నాశనమైందని, తాము వస్తే నాణ్యమైన విద్యనందించే విధంగా బడ్జెట్లో అత్యధిక నిధులు కేటాయి స్తామని బీజేపీ చెప్పింది. కానీ 2013- 14 నుంచి 2024-25 వరకు విద్యకు కేటాయిం చిన నిధులు నామమాత్రమే. తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్లోనూ అదే పరిస్థితి. ”ఇండియన్‌ నాలెడ్జ్‌ సిస్టమ్స్‌” పేరుతో వేద విద్యకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడమంటే విద్యలోకి మతాన్ని జొప్పించడమే.
బీజేపీ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది 2013-14 బడ్జెట్‌లో 3.16 శాతం నిధులను విద్యకు కేటాయించగా, 2024-25లో అది 1.53 శాతానికి తగ్గిపోయింది. ఉన్నతవిద్యకు కేటాయింపులు 2013-14లో 1.6 శాతం ఉండగా 2024-25లో ఒక శాతానికి పడిపోయాయి. 2025-26 బడ్జెట్‌లో 2.53 శాతం నిధులను మాత్రమే విద్యకు కేటాయించారు. అందులో పాఠశాల విద్యకు 1.5 శాతం, ఉన్నత విద్యకు 0.98 శాతం నిధులు దక్కాయి. ఈ మాత్రం నిధులతో దేశంలోని లక్షా 50వేల ఉన్నత పాఠశాలల్లోని పదివేల బడుల్లో అటల్‌ టింకరింగ్‌ ప్రయోగశాలలను అభివృద్ధి చేస్తామని, వచ్చే నాలుగేండ్లలో నలభైవేల పాఠశాలలకు విస్తరిస్తామని ప్రతిపాదించారు. పాఠశాలలకు ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పిస్తామని, రూ.500 కోట్లతో ఏఐ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఆర్థికమంత్రి సెలవిచ్చారు. గతం కంటే ఎక్కువ కేటాయింపులు చేశామని చెప్పుకున్నా ఆ తర్వాత సవరించిన అంచనాల్లో తగ్గడం గ్యారంటీ. గతేడాది సీఎం పోషణ కింద ( మధ్యాహ్న భోజనం పథకం కోసం) రూ.12 వేల కోట్లు కేటాయింపులు జరిగినా సవరించిన అంచనాల్లో పది వేల కోట్లు వరకు పరిమితమైంది. ప్రయోగశాలల అభివృద్ధిలోనూ మార్పులేదు.
ఉన్నత విద్యను మెరుగుపరిచేందుకు భారీగా నిధులు అవసరం. అయితే, ఆ మేరకు నిధుల కేటాయింపు జరగడం లేదు. కానీ ప్రస్తుత బడ్జెట్‌లో ఈ అంశం పట్టించుకోలేదు. ప్రభుత్వ విశ్వవిద్యా లయాలు, ఐఐటీలు, నిట్‌లు, ఇతర కేంద్ర-రాష్ట్ర విశ్వవిద్యాలయాలు నాణ్యమైన విద్యనందించడంలో కష్టాలను ఎదుర్కొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ 200 విశ్వవిద్యాలయాల్లో భారతీయ యూనివర్సిటీలు మూడు మాత్రమే ఉన్నాయి. దీనకంతటికీ సరైన నిధుల కేటాయింపులేకపోవడమే. నిధుల కేటాయింపు లేకుండా భారతీయ సంస్థలు అంతర్జాతీయంగా పోటీపడలేని పరిస్థితి. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు కూడా బడ్జెట్‌ ప్రాధాన్యం ఇవ్వలేదు. పరిశోధనారంగాన్ని ఈ పదేండ్లలో నిర్లక్ష్యం చేశారు. దేశ అభివృద్ధికి ఉపయోగపడే ఒక్క పరిశోధన కూడా జరగలేదు. ఉపాధిని పెంపొందించడానికి బలమైన వృత్తి శిక్షణ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల కోసం సిఫారసులు చేసినప్పటికీ ఆ దృష్టి లేకుండా పోయింది.
ఇటీవలి కాలంలో ప్రభుత్వ విద్యాసంస్థల ప్రాముఖ్యత తగ్గించి, ప్రయివేట్‌ రంగాన్ని ప్రోత్సహించే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. విద్యాసంస్థలు ఆర్థికంగా స్వయం పోషితమవ్వాలనే పేరుతో వాటి ఫీజులను పెంచడం, కార్పొరేట్‌ విద్యాసంస్థలకు ప్రాధాన్యతనివ్వడం, ప్రభుత్వ సహాయాన్ని తగ్గించడం, ఉపాధ్యాయ నియామకాలను తగ్గించడం వంటివి ప్రభుత్వ విధానాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. నూతన జాతీయ విద్యావిధానంలో పేదలకు ఉన్నత విద్య నిరాకరించబడుతోంది. ఈ ప్రయివేటీకరణ ధోరణితో సామాన్యులకు ఉన్నత విద్య మరింత ఖరీదైనదిగా మారుతోంది. విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉండగా, ప్రభుత్వం బడ్జెట్లో అతి తక్కువ నిధులు కేటాయిస్తూ మౌలిక సౌకర్యాల విషయంలో శ్రద్ధ వహించడం లేదు. ఇది ప్రయివేటు విద్యాలయాల వైపు విద్యార్థులను ప్రోత్సహించ డంలో భాగమే. వాస్తవానికి కొఠారి కమిషన్‌ ఆరుశాతం స్థూల జాతీయ ఆదాయాన్ని విద్యారంగానికి కేటాయించాలని సూచించింది. ఆ రకంగా విద్యా బడ్జెట్‌ను పెంచి, సామాన్యులకు నాణ్యమైన విద్యనందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. విద్యావ్యవస్థ అభివృద్ధి చెందాలంటే, ప్రజలు, విద్యార్థులు, విద్యావేత్తలు అందరూ కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి.