– ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి దామెర కిరణ్
నవతెలంగాణ-కెరమెరి
విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి దామెర కిరణ్ అన్నారు. శుక్రవారం మండలంలోని నీంగూడ గ్రామంలో ఏర్పాటు చేసిన ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ సమావేశానికి ముఖ్యాతిథిగా హాజరై మాట్లాడారు. పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించకపోవడంతో విద్యార్థులే తరగతులను పరిశుభ్రం చేసుకోవాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దోమ తెరలు పంపిణీ చేసి విద్యార్థులు వ్యాధుల బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వసతి గృహాల్లో మెనూ పాటించడం లేదని పేర్కొన్నారు. దీంతో పేద విద్యార్థులు పౌష్టికాహారానికి దూరమవుతున్నారని తెలిపారు. జిల్లాలో అనేక పాఠశాలల్లో ఏకోపాధ్యాయులే ఉండడంతో విద్యావ్యవస్థ కుంటుపడుతుందని వాపోయారు. పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు నియమించి న్యాయం చేయాలన్నారు. ఉన్నత విద్య కోసం పేద విద్యార్థుల సౌకర్యార్థం జిల్లాకు పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు వసాకే సాయికుమార్, కార్యదర్శి చాపిలే సాయికృష్ణ, ఉపాధ్యక్షులు సతీష్, సహాయ కార్యదర్శి జాఫర్, తుమ్మిడి భీమేష్, నాయకులు నితీష్, అయూబ్‌ఖాన్, సాయి, రాజేందర్, నవీన్, కార్తీక్, భీంరావు పాల్గొన్నారు.