– ఇబ్బందుల్లో ‘సంక్షేమ’, గురుకుల, కెజీబీవీ విద్యార్థులు
– ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగర ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం సమస్యలతో సతమతమవుతున్నదని, ప్రధానంగా సంక్షేమ వసతిగృహాలు, గురుకుల, కెేజీబీవీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎస్‌ఎఫ్‌ఐ ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు సమర్పించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఎస్‌ఎఫ్‌ఐ హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు వినతిపత్రం అందించారు. అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు లెనిన్ గువేరా మాట్లాడుతూ.. గత ప్రభుత్వం మెస్ చార్జీలు పెంచి నట్టు ప్రకటించినా అమలు కావడం లేదన్నారు. ఏడాది నుంచి హాస్టల్స్ మెస్ బిల్లులు పెండింగ్ ఉన్నాయన్నారు. రాష్ట్రంలో అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకులాలు, కేజీబీవీ, సంక్షేమ వసతిగృహాలకు సొంత భవనాలు నిర్మించాలని కోరారు. నాలుగేండ్ల నుంచి సుమారు రూ.7,792కోట్ల స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్‌మెంట్స్ విడుదల చేయలేదని, హాస్టల్స్ విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీల ఊసేలేదని అన్నారు. మహాలక్ష్మీ పథకంలో భాగంగా విద్యార్థులందరికీ ఉచిత బస్ సౌకర్యం కల్పించాలన్నారు. రాష్ట్రంలో పేద విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చొరవ చూపాలని ఎమ్మెల్యేలను కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమటీ సభ్యులు రమ్య, జిల్లా ఉపాధ్యక్షుడు స్టాలిన్, జిల్లా సహాయ కార్యదర్శి ప్రశాంత్, నాయకులు విగేష్, రాజేష్, భగత్ హస్మీ, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.