విద్యారంగం విస్మరణ తగదు

విద్యారంగం విస్మరణ తగదు– కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి మొండిచేయి
– విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన
నవతెలంగాణ-నిజామాబాద్‌సిటీ/కామారెడ్డి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని విస్మరిస్తున్నా యని విద్యార్థి సంఘాలు, పలువురు విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేశారు. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో విద్యారంగానికి మొండిచేయి చూపాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటాయింపులు సవరించి విద్యారంగానికి అదనపు కేటాయింపులు చేయాలని డిమాండ్‌ చేస్తూ పలుచోట్ల నిరసన వ్యక్తం చేశారు.
యూఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం
యూఎస్‌ఎఫ్‌ఐ నిజామాబాద్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్‌ చౌరస్తాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మ దహనం చేశారు. బడ్జెట్‌లో విద్యారంగానికి అరకొర నిధులు కేటాయించడం అమానవీయం అని యూఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పెద్ది సూరి మండిపడ్డారు. కొఠారి కమిషన్‌ నిబంధనల ప్రకారం కేంద్ర బడ్జెట్లో 10 శాతం, రాష్ట్ర బడ్జెట్లో 30 శాతం విద్యా రంగానికి కేటాయించాల్సిన అవసరం ఉందని, కానీ 48 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్లో కేవలం 2.6 శాతం, రాష్ట్ర బడ్జెట్‌ 2.90 లక్షల కోట్ల బడ్జెట్లో కేవలం 7.3 శాతం అరకొర నిధులను కేటాయించి విద్యారంగం పట్ల తమ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించాయని మండిపడ్డారు. కేటాయించిన బడ్జెట్‌ పని చేస్తున్న సిబ్బంది వేతనాలకే సరిపోయే పరిస్థితి ఉందని అన్నారు. ప్రభుత్వ విద్యా రంగ సంస్థలు ఇప్పటికే శిథిలావస్థలో ఉన్నాయి మౌలిక సదుపాయాలు లేక కొట్టుమిట్టాలాడుతున్నటువంటి దీనస్థితిలో ఉన్నాయని, కేటాయించినటువంటి ఈ బడ్జెట్‌ తో ఏ విధంగా ప్రగతిని సాధిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే తమ వైఖరి మార్చుకొని కొఠారి కమిషన్‌ నిబంధన ప్రకారం కేటాయింపులు చేయాలని, లేకుంటే పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని స్పష్టంచేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వేణుగోపాల్‌ గణేష్‌ జిల్లా సహాయ కార్యదర్శి సాయినాథ్‌ మారుతి సందీప్‌ నాయకులు పాల్గొన్నారు.
విద్యారంగానికి శూన్య హస్తం : ఏబీవీపీ
విద్యారంగానికి ప్రభుత్వం సూన్య హస్తాన్ని చూపిస్తుందని ఏబీవీపీ ఇందూర్‌ జిల్లా కన్వీనర్‌ దామ సునీల్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘విద్యారంగాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేసిన గత ప్రభుత్వాన్ని గద్దె దించడానికి తెలంగాణ యువత, విద్యార్థి, నిరుద్యోగులు కథనబేరీతోపాటు అనేక ఉద్యమాలు నిర్వహించారు. అదే అదనుగా శుష్కవాగ్దానాలు చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్‌ సర్కార్‌ ఇప్పుడు శూన్య హస్తాలు చూపిస్తున్నది. 8 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్యారంగ సమస్యలని పరిష్కరిం చకపోగా విద్యారంగాన్ని మరింత అద్వాన్న స్థితిలోకి నెట్టి వేస్తున్నది. వెంటనే విద్యారంగ సమస్యలన్నింటినీ పరిష్క రించి పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్సెమెంట్‌ విడుదల చేయాలని’ ఏబీవీపీ డిమాండ్‌ డిమాండ్‌ చేస్తున్నది.
విద్య రంగాన్ని విస్మరించిన ప్రభుత్వం : ఏఐఎస్‌ఎఫ్‌
విద్యారంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనేదని బడ్జెట్‌లో కేటాయింపులు చూస్తే స్పష్టమవుతుం దని ఇది ముమ్మాటికి విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వం మేనని ఏఐఎస్‌ఎఫ్‌ జాతీయ కౌన్సిల్‌ సభ్యులు రఘురాం అన్నారు. నిజామాబాద్‌ లో రైల్వే స్టేషన్‌ దగ్గర ఏఐఎస్‌ఎఫ్‌ కార్యాలయంలో ముఖ్య కార్యకర్త సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 7.3 శాతం నిధులు కేటాయించడంలోనే విద్యారంగం పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తు శుద్ధి ఉందని తెలిసిందన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధిక నిధులు కేటాయించి విద్యారంగా అభివృద్ధికి పేద విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని ఆయన కోరారు. లేనియెడల ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు అంజలి, నాయకులు టోకు,సాయి, సుమన్‌ విట్టల్‌ తదితరులు పాల్గొన్నారు.
పేదలను విద్యకు దూరం చేయడమే : బీవీఎం
కామారెడ్డి : విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించడం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులను చదువుకు దూరం చేయడమే అని భారతీయ విద్యార్థి మోర్చ (బీవీఎం) రాష్ట్ర కార్యదర్శి విఠల్‌ అన్నారు. శుక్రవారం కామారెడ్డి పట్టణంలో బడ్జెట్‌ కాగితాల దహనంను చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించడం సిగ్గుచేటన్నారు. నాలుగేండ్లు రూ.8వేల కోట్లకు పైగా స్కాలర్‌షిప్స్‌, ఫీజు రియంబర్స్‌మెంట్స్‌ పెండింగ్‌లో ఉన్నాయనీ, వాటిని వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.ఈ కార్యక్రమంలో భారతీయ విద్యార్థి మోర్చా జిల్లా నాయకులు యోగేష్‌, సాయి, తేజ, పట్టణ నాయకులు చరణ్‌, శ్రావణ్‌ తదితరులు పాల్గొన్నారు.