విద్య నైపుణ్యాల అభివృద్ధితో ఉన్నత స్థానాలకు

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి రెడ్డి సుబ్రహ్మణ్యం
నవతెలంగాణ-ధూల్‌పేట్‌
విద్యా నైపుణ్యాల అభివృద్ధితోనే ఉన్నత స్థానాలను అధిరోహిస్తామని కేంద్ర ప్రభుత్వ పూర్వ కార్యదర్శి, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. ప్రభుత్వ సిటీ కళాశాలలో గతేడాది రిటైల్‌ సెక్టార్‌ సంస్థల సహకారంతో తొలిసారిగా ప్రవేశపెట్టిన ‘బిబిఏ రిటైలింగ్‌ కోర్సు’ మొదటి ఏడాది పూర్తయిన సందర్బంగా కోర్సు క్షేత్ర స్థాయి పరిశీలన, విద్యార్థుల అనుభవాలను తెలుసుకో వటం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యతో పాటే ఉపాధి కల్పన నూతన విద్యా విధానమన్నారు. ఆ విధాన ఫలాలను తొలి ఏడాది నుంచి చూస్తున్నామని అన్నారు. బిబిఏ రిటైలింగ్‌ కోర్సు విద్యా ర్థులు వారంలో మూడు రోజులు తరగతులకు హాజరై, మిగిలిన మూడు రోజులు రిలయన్స్‌ ట్రెండ్స్‌, స్టార్‌ బక్స్‌, స్మార్ట్‌ వంటి రిటైల్‌ మార్కెట్‌లో పని చేస్తున్నారని గుర్తు చేశారు. నూతన విద్యా విధానంలో నైపుణ్యం చాలా కీలక మనీ, నైపుణ్యంతో పాటు ఉన్నత విద్యార్జనకు ప్రాముఖ్యత ఉందన్నారు. పని చేస్తూ చదువుకోవడం ద్వారా రెండింటి విలువను విద్యార్థులు గుర్తిస్తారని తెలిపారు. అతిథులు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి, సెక్టర్‌ కౌన్సిల్‌ ప్రతినిధి సుబ్బారావు, ఏజీవో డాక్టర్‌.డిటి.చారి, ప్రిన్సిపాల్‌ ఆచార్య పి.బాల భాస్కర్‌, రిటైల్‌ రంగ ప్రతినిధి చందా వడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులతో వారి విద్య, ఉపాధి సంబంధిత విషయాలపై చర్చించారు. ఆచార్య లింబాద్రి మాట్లాడుతూ సిటీ కళాశాలలో ఇలాంటి కోర్సులు ప్రవేశపెట్టడం వల్ల గ్రామీణ ప్రాంతాల విద్యార్థలకు విద్యతోపాటు ఉపాధి అందుతుందన్నారు. 2023-24 విద్యా సంవత్సరానికి మరికొన్ని కళాశాలల్లో ఇలాంటి విన్నూత కోర్సులను ప్రవేశపెడతామని తెలిపారు. సెక్టర్‌ కౌన్సిల్‌ ప్రతినిధి సుబ్బారావు మాట్లాడుతూ స్కిల్‌ ఆధారిత కోర్సుల ద్వారానే విద్యార్థులు ఉపాధి అవకాశాలను సాధించగలుగుతారని తెలిపారు. కళాశాల విద్య ఏజీవో డా.డిటి.చారి మాట్లాడుతూ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ సూచనలు, సలహా మేరకు సిటీ కళాశాలలో ఈ ఏడాది మరో రెండు స్కిల్‌ ఆధారిత కోర్సులను ప్రవేశపెట్టామని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ ఉపాధి, నైపు ణ్యాన్ని అందించే కొత్త కోర్సులను ప్రవేశపెట్టడానికి ప్రభుత్వ సిటీ కళాశాల సిద్ధంగా ఉంటుందని తెలిపారు. ఈ క్షేత్ర స్థాయి పరిశీలనలో బిబిఎ విద్యార్థులు శివ, దీప్తి మాట్లాడుతూ చదువుకుంటూ, ఉద్యోగం చేయటం వల్ల స్కిల్స్‌ తో పాటు నాయకత్వ లక్షణాలు ఏర్పడతాయన్నారు. స్టార్‌ బక్స్‌ లాంటి అంతర్జాతీయ సంస్థల్లో పని చేయటంతో వినియోగదారుని అవసరాలు, క్రమశిక్షణ లాంటివి మెరుగ వుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌.రత్న ప్రభా కర్‌, గజేంద్రబాబు, డాక్టర్‌.మల్లికార్జున్‌, డాక్టర్‌ ఝాన్సీ రాణి, డాక్టర్‌.రవీంద్రబాబు పాల్గొన్నారు.