వలసాధిపత్యం లక్ష్యంగా విద్యావిధానం

వలసాధిపత్యం లక్ష్యంగా విద్యావిధానంకేవలం సాయుధ బలంతోనో, లేక ఆర్థిక శక్తితోనో మాత్రమే సామ్రాజ్యవాదం మూడవ ప్రపంచ దేశాల మీద తన పెత్తనాన్ని సాగిస్తుందనుకోవద్దు. భావజాల రంగంలో సైతం తన ఆధిపత్యాన్ని నెలకొల్పి, తద్వారా తాను ఏ విధంగా కోరు కుంటోందో, అదేమాదిరిగా బాధిత దేశాల ప్రజలు ఈ ప్రపంచాన్ని అర్ధం చేసుకునేలా ప్రభావితం చేస్తుంది. అందుచేత మూడవ ప్రపంచ దేశాలలో స్వాతంత్య్రం నెలకొనాలంటే ముందుగా ఆ దేశాల ప్రజల మనసుల మీద ఉన్న వలసాధిపత్యాన్ని వదిలించు కోవాలి. సామ్రాజ్యవాద వక్రీకరణల తెరలను చీల్చుకుని ఆ ప్రజలు వాస్తవం ఏమిటో గ్రహించగలగాలి. వలసవాద వ్యతిరేక పోరాటం ఈ వాస్తవాన్ని గుర్తించింది. నిజానికి ఈ చైతన్యం ఉదయించినప్పుడే ఆ పోరాటం మొదలైంది. ఐతే, రాజకీయ స్వాతంత్య్రం వచ్చినంత మాత్రాన సామ్రాజ్యవాద ఆధిపత్యం అంతటితో ముగిసిందని అనుకోరాదు. కొత్తగా స్వతంత్రం పొందిన దేశాల్లో సామ్రాజ్యవాదపు తప్పుడు భావజాల ప్రభావాన్ని అంతం చేసే విధంగా అక్కడ విద్యా వ్యవస్థ నిరంతరం పాటుపడాల్సి వుంటుంది. ఇది జరగాలంటే మనదేశంలోని విద్యా వ్యవస్థల్లో బోధనాంశాలు, పాఠ్యాంశాలు సామ్రాజ్యవాద దేశాల్లోని విద్యావ్యవస్థల్లో బోధించే వాటికి భిన్నంగా ఉండాలి. సాంఘిక శాస్త్రాలలో, భాష, లలిత కళలు తదితర అంశాలలో మనదేశ వర్తమానాన్ని అర్ధం చేసుకోవాలంటే వలస పాలనలోని మన గతాన్ని, ఆ పాలన ఫలితాలను సక్రమంగా అర్ధం చేసుకోవాల్సిందే.అయితే, సామ్రాజ్యవాద దేశాలలోని విశ్వవిద్యాలయాలు వలస పాలనకు సంబంధించిన గతంతో సంబంధం లేకుండా మన వర్తమానాన్ని వివరించడానికి పూనుకుంటాయి. మన దేశం వెనుకబడిపోడానికి కారణాలు మన సోమరితనమనో, మనకు వ్యాపార దక్షత లేకపోవడమనో, మన మూఢ వివ్వాసాలనో, లేకపోతే మన అధిక జనాభా అనో చెప్తాయి. ఇక ప్రకృతిశాస్త్రాల విషయంలో కూడా మూడో ప్రపంచ దేశాల విశ్వవిద్యాలయాలలోని పాఠ్యాంశాలు సామ్రాజ్యవాద దేశాలలోని పాఠ్యాంశాలు ఒకేమాదిరిగా ఉండకూడదు. ఐన్‌స్టీన్‌ సిద్ధాంతంలోనో,క్వాంటం ఫిజిక్స్‌లోనో సామ్రాజ్య వాద భావజాలం ఉందని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. సామ్రాజ్యవాద దేశాలలో శాస్త్రవిజ్ఞానం ప్రాధాన్యతలు, సవాళ్లువేరు,మూడవ ప్రపంచదేశాలలో ప్రాధాన్యతలు, సవాళ్లువేరు.ఇరవయ్యో శతాబ్దపు ప్రముఖ మార్క్సిస్టు మేధావి, బ్రిటిష్‌ శాస్త్రవేత్త అయిన జెడి బెర్నెల్‌ అభిప్రాయం ఇది.
మూడవప్రపంచ దేశాల విశ్వవిద్యాలయాలలో కోర్సులు, పాఠ్యాంశాలు అచ్చం సామ్రాజ్యవాద దేశాల యూనివర్సి టీలలోని కోర్సుల మాదిరిగానే ఉండాలనుకోవడమే సామ్రాజ్యవాద భావజాలపు ఆధిపత్యానికి నిదర్శనం. నయాఉదారవాద విధానాలకు పూర్వ కాలంలో మన దేశ విద్యావిధాన రూపకర్తలకు ఈ విషయం అవగాహనలో ఉంది. ఆ కాలపు విద్యావ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ, ఆ విధ్యావిధానపు దార్శనికతలో లోపం ఉందని చెప్పలేం. నయా ఉదారవాద విధానాలు మొదల య్యాక పరిస్థితులలో మార్పులు చోటు చేసుకోవడం మొదలైంది. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడితో భారత బడా బూర్జువావర్గం పెనవేసుకుపోవడం మొదలైంది. మనదేశంలోని ఉన్నత మధ్యతరగతి యువతబహుళజాతి కార్పొరేషన్లలో ఉద్యోగాల కోసం వెంపరలాడడం పెరిగిపోయింది. విదేశీ మార్కెట్లకు సరుకులను ఎగుమతి చేయడం మీద, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం మీద అంతకంతకూ మన దేశాభివృద్ధి ఆధారపడడం మొదలైంది. ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు సైతం మళ్ళీ ఈస్ట్‌ఇండియా కంపెనీని మన దేశానికి ఆహ్వానించాలని సూచించేదాకా పోయారు.
నయా ఉదారవాదం అంటే అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఆధిపత్యం. ఈ ఆధిపత్యం ప్రపంచం అంతటా ఒకే విధంగా ఉండే సాంకేతిక యాజమాన్యంతో ముడిపడింది. అందుచేత ప్రపంచవ్యాప్తంగా ఒకేరూపంలో ఉండే విద్యా విధానం కావాలన్న ఒత్తిడిపెరిగింది.ఆ విధమైన విద్యా విధానం ఉంటేనే అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికి కావలసిన సాంకేతిక నిర్వహణాధిపత్యం ప్రపంచమంతటా నెలకొల్పడం సాధ్యపడుతుంది. అటువంటి విద్యా విధానం సామ్రాజ్యవాద దేశాలలో తయారైందే అయివుండాలి.ఇప్పుడు విద్యావిధానం విద్యార్ధుల మెదళ్ళను సామ్రాజ్య వాద ప్రభావం నుండి బైటకు తేవడం అనే లక్ష్యంతో కాకుండా,మళ్ళీ వారిని సామ్రాజ్యవాద బంటుల మాదిరిగా తయారుచేసే లక్ష్యంతో రూపొందుతోంది.
ఈ సంగతిని దృష్టిలో ఉంచుకునే గత యుపిఎ ప్రభుత్వం భారతదేశంలో తమ బ్రాంచిలను నెలకొల్పాలని విదేశీ యూనివర్సిటీల ను ఆహ్వానించింది. మన దేశంలోని కొన్ని యూనివర్సిటీలను దత్తత తీసుకుని వాటిని విదేశీ యూనివర్సిటీల మాదిరిగా తీర్చిదిద్దాలని కోరింది.ఆ విధంగా ఇక్కడికి ఆహ్వానించబడిన ఆక్స్‌ఫర్డ్‌, హార్వార్డ్‌, కేంబ్రిడ్జ్‌ వంటి విదేశీ యూని వర్సిటీలు ఇక్కడి సిలబస్‌ను అనుసరించనవసరం లేదని, తమ తమ దేశాల్లో అమలు చేసే సిలబస్‌నే ఇక్కడ కూడా అమలు చేయాలనికోరింది. భారతీయ యూనివర్సిటీలలో,సామ్రాజ్య వాద దేశాలలోని యూనివర్సిటీలలో ఏకరూప బోధనాంశాలు, సిలబస్‌లు ఉండే విధంగా ఒక ప్రక్రియ మొదలైంది.అంటే వలసవాద భావజాలం నుండి బయట పడడానికి అంతవరకూ జరిగిన కృషిని తిరగదోడే క్రమం మొదలైంది. పార్లమెంటులో మన మానవ వనరుల అభివృద్ధిమంత్రి మన దేశంలో హార్వార్డ్‌ తరహా విద్యను అందించడమే తమప్రభుత్వ లక్ష్యమని,అటువంటి చదువులకోసం భారతీయ విద్యార్ధులు విదేశాలకు పోవలసిన అవసరమే లేకుండా చేస్తామని ప్రకటించారు కూడా.
యుపిఎ ప్రభుత్వం ప్రారంభించిన ఈ ప్రక్రియను ఎన్‌డిఎ ప్రభుత్వం వచ్చాక చాలా వేగంగా కొనసాగించింది. ఈ ప్రభుత్వం తెచ్చిన జాతీయ విద్యావిధానం సామ్రాజ్యవాద దేశాల విద్యావ్యవస్థ మాదిరిగానే ఉండే వ్యవస్థను ఇక్కడ నెలక్పొలడం అనే భావనకు అధికారికంగా ముద్ర వేసింది. అంటే ఉమ్మడి బోధనాంశాలు,కోర్సులు ఇక్కడ నిర్వహించాల్సి వుంటుంది. విదేశీ యూనివర్సిటీల మాదిరిగా ఇక్కడ కూడా యూనివర్సిటీలను నిర్వహించడం కోసం రెండు నిర్ణయాత్మక చర్యలను తీసుకుంది. ఈ దేశంలో సామ్రాజ్యవాద భావజాల ఆధిపత్యానికి ప్రత్యామ్నాయాన్ని పెంపొందిస్తున్న యూనివర్సిటీలను నాశనం చేయడం మొదటి చర్య. ఈ చర్యలు అంతర్జాతీయ ప్రపంచపు దృష్టిలో కూడా పడ్డాయి. జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ, జాదవ్‌పూర్‌ యూనివర్సిటీ వంటివి ఇందుకు ఉదాహరణలుగా మనం చూడవచ్చు.
ఇక రెండవది : యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ ద్వారా ఒత్తిడి చేసి మన దేశంలోని యూనివర్సిటీలు దేనికదే విదేశీ యూనివర్సిటీలతో చర్చలు జరిపి విదేశీ యూనివర్సిటీలలోని కోర్సులనే ఇక్కడ మక్కీకి మక్కీగా అమలు చేయడం. ఒక్కటే తేడా ఏమంటే విదేశీ కోర్సులతోబాటు వేద గణితం వంటి కొన్ని కోర్సులను కూడా చేర్చాలని యుజిసి ఒత్తిడి చేస్తోంది. కొన్ని విదేశీ యూనివర్సిటీలు ఇందుకు ఒప్పుకోవడం లేదు. ఐతే త్వరలోనే ఇటువంటి విషయాల్లో కూడా ఒక అంగీకారం కుదురుతుంది. ఫలితంగా మన యూనివర్సిటీలలో నయా ఉదారవాదంతోబాటు హిందూత్వ భావజాలం కూడా కలగలిపిన కోర్సులు తయా రౌతాయి. మన దేశం ప్రాచీన కాలంలో ఎంత ఘనకీర్తి కలిగివుందో తెలుసుకుంటూనే సామ్రాజ్యవాద భావజాల ఆధిపత్యంలోకి మన యువత మెదళ్లు పోతాయి. అటువంటిదానికి సామ్రాజ్యవాదం పెద్దగా అభ్యంతరం చెప్పదు.
వలసవాద మనస్తత్వాన్ని ఎక్కించుకునే ఈ క్రమంలో మరో ధోరణి కూడా ఉంది. సామాజిక శాస్త్రాలని, భాషా కోర్సులను మొత్తంగానే రద్దు చేయడమో, లేక అప్రధానమైన కోర్సులుగా దిగజార్చడమో చేసి వాటి స్థానంలో పూర్తిగా ఉపాధి సాధన లక్ష్యంతో ఉండే మేనేజిమెంటు, కాస్ట్‌ అకౌంటెన్సీ వంటి కోర్సులను ప్రోత్సహించడం. అందువలన యువత సమాజం గురించి ఏ ప్రశ్నలూ అడగరు. ఈ విషయంలో అటు హిందూత్వ శక్తులకి, ఇటు కార్పొరేట్లకి ఉమ్మడి ప్రయోజనం ఉంది.వాళ్ళకి పూర్తిగా వ్యక్తిగత ప్రయోజనాలే లక్ష్యంగా ఉండే విద్యార్ధులు,సామాజిక పరిణామాల గురించి ఎటువంటి ప్రశ్నలూ అడగనివారు కావాలి. ఈ ధోరణి కూడా ఇప్పుడు వేగంగా బలపడుతోంది.
దేశంలో రాజకీయంగా కార్పొరేట్‌-హిందూత్వ శక్తులు ఏ విధంగా రాజకీయ ఆధిపత్యాన్ని సాధించాయో, దానికి ప్రతిరూపమే ప్రస్తుత విద్యావిధానం. ఇది మళ్ళీ మన ప్రజల మనస్సులను వలసాధిపత్యానికి లోబడేలా చేస్తుంది. కార్పొరేట్లు సరిగ్గా ఇదే కోరుకుంటున్నారు. ఇక హిందూత్వ శక్తుల విషయానికి వస్తే వారేనాడూ స్వాతంత్య్రోద్యమంలో భాగస్వా ములుగా లేరు. దేశ నిర్మాణం అనే విషయం వారికేనాడూ అర్ధం కాలేదు, కాదు కూడా. సామ్రాజ్యవాదం ప్రభావం ఏమిటో, ఆ ప్రభావం నుండి మన ప్రజలను ఎందుకు బయటకు తీసుకురావాలో అది కూడా వాళ్ళకి బోధపడే విషయం కాదు. కేవలం మన ప్రాచీన కాలపు ఘన కీర్తి గురించి కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసే చదువులు ఉంటే చాలు.అందుకే కోర్సులలో సామ్రాజ్య వాద భావజాలం నిండి వున్నా, దానితోబాటు కొంత వైదిక పరిజ్ఞానాన్ని జోడిస్తే చాలు వాళ్ళకి. ప్రస్తుతం మన దేశంలో అమల్లోకి వస్తున్న విద్యావిధానం సరిగ్గా ఇటువంటిదే.
ఈ కార్పొరేట్‌-హిందూత్వ కూటమి అనేది నయా ఉదారవాదంలో తలెత్తిన సంక్షోభం కారణంగా ఏర్పడింది. సంక్షోభం పెరుగుతున్న నేపథ్యంలో తమ ఆధిపత్యం కొనసాగాలంటే అందుకు హిందూత్వ శక్తుల తోడ్పాటు అవసరం అని కార్పొ రేట్లు గుర్తించాయి. అదే మాదిరిగా, ప్రస్తుత జాతీయ విద్యావిధానం కూడా దేశాన్ని ముందుకు తీసుకుపోవడానికి కాకుండా, సంక్షోభకాలంలో తమ భావజాల ఆధిపత్యాన్ని కొనసాగించే లక్ష్యంతో రూపొందింది.అందుచేత ఈ విధానం భావాలను వికసించ నివ్వకుండా నాశనం చేస్తుంది. ప్రశ్నలు లేవనెత్తనివ్వదు. సత్యాన్ని తెలుసుకోనివ్వదు.ఈ విధానం చాలా గొప్పగా చూపి ంచే ”ఉపాధి కల్పన లక్ష్యం ” అనేది కొద్దిమందికి మాత్రమే లాభిస్తుంది.నిజానికి నయాఉదారవాద సంక్షోభం పెరుగుతున్నకొద్దీ ఉపాధి అవకాశాలు తరిగి పోతాయి. దానికి అనుగుణంగానే ప్రస్తుత జాతీయ విద్యా విధానం అంతకంతకూ ఎక్కువమంది యువతను విద్యకు దూరం చేస్తుంది.మత విద్వేష విషంతో వారి మెదళ్ళను నింపి వాస్తవజీవిత సమస్యలపై చర్చ జరగకుండా వారి దృష్టిని మళ్ళిస్తుంది.తమ ఫాసిస్టు గూండా దాడులలో పాల్గొనడానికి చౌకగా దొరికే కూలీలుగా వారిని వాడుకుంటుంది. అందుచేత ఈ విద్యావిధానం చాలా స్వల్పకాలం మాత్రమే ఉనికిలో ఉండగలదు. ఈ దేశపు యువత తాము అనుభవిస్తున్న నిరుద్యోగం గురించి,దుర్భర దారిద్య్రం గురించి, అటువంటి పరిస్థితి ఏర్పడడానికి కారణం గురించి ప్రశ్నలు అడగడం మొదలవగానే ఈ విద్యావిధానం చివరి ఘడియలు మొదలౌతాయి. నయా ఉదారవాద విధానానికి ప్రత్యా మ్నాయంగా ఒక అభివృద్ధి పంధాను అన్వేషించడం మొదలవగానే,దానిలో భాగంగానే ప్రత్యా మ్నాయ విద్యా విధానం ఎలాఉండాలన్న అన్వేషణ కూడా మొదలౌతుంది. సామ్రాజ్యవాద భావజాలం నుండి బయటపడటం అనే ఎజెండా జాతీయోద్యమ కాలంలో వచ్చిన మాదిరిగానే మళ్ళీ ముందుకొస్తుంది.
ప్రభాత్‌ పట్నాయక్‌