– రూ.500లకే గ్యాస్, 200యూనిట్ల ఉచిత విద్యుత్
– ప్రారంభానికి ప్రియాంకా గాంధీ హాజరు
– మార్చి 2న మరో ఆరువేల ఉద్యోగాల భర్తీ
– మేడారంలో ముఖ్యమంత్రి రేవంత్ వెల్లడి
– సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్న సీఎం,మంత్రుల ప్రత్యేక పూజలు
– మేడారంపై కేంద్రానికి వివక్ష అంటూ ఆరోపణ
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మరో రెండు పథకాల అమలుకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. రూ.500కే గ్యాస్ సిలిండర్, తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చే పథకాలను ఈ నెల 27వ తేదీన ప్రారంభించనున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ పథకాల ప్రారంభానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ హాజరుకానున్నట్టు తెలిపారు. రూ.2లక్షల రుణమాఫీపై బ్యాంకులతో చర్చిస్తున్నామని, త్వరలోనే రైతులకు శుభవార్త చెబుతామన్నారు. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక చిక్కుముడులను విప్పుకుంటూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలిపారు.
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
శుక్రవారం మేడారంను సందర్శించిన సీఎం.. జాతరలో సమ్మక్క-సారలమ్మలకు నిలువెత్తు బంగారం (బెల్లం), పసుపు, కుంకుమ, గాజులు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని పునరుద్ఘాటించారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.5లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచామన్నారు.
2లక్షల ఖాళీలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చినట్టుగానే అధికారంలోకొచ్చిన 60రోజుల్లోనే 25వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. 6,956 మంది స్టాఫ్ నర్సుల నియామకం, 441 సింగరేణి ఉద్యోగాలు, 15వేల పోలీస్, ఫైర్ డిపార్టుమెంట్ ఉద్యోగాలు భర్తీ చేసినట్టు చెప్పారు. మార్చి 2న మరో 6వేలపైచిలుకు ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామన్నారు. గ్రామీణ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు.. పది స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలిపారు.
సమ్మక్క-సారలమ్మల స్ఫూర్తితో..
సమ్మక్క-సారలమ్మ ఆశీర్వాదంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని రేవంత్ అన్నారు. రాష్ట్రంలో వర్షాలు బాగా పడి పాడిపంటలతో ప్రజలు విలసిల్లాలని, తెలంగాణలోని నాలుగు కోట్ల ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని సమ్మక్క సారలమ్మను వేడుకున్నట్టు తెలిపారు. ఈ ప్రాంతంతో, ఈ ప్రాంత ఎమ్మెల్యే, మంత్రి సీతక్కతో తనకున్న ప్రత్యేక అనుబంధం.. రాజకీయంగా తామిద్దరం కలిసి చేసిన ప్రయాణం అందరికీ తెలుసన్నారు. తాము ఏ ముఖ్య కార్యక్రమం తీసుకున్నా సమ్మక్క-సారలమ్మ ఆశీస్సులతో ఇక్కడి నుంచే మొదలుపెట్టినట్టు చెప్పారు. 2023 ఫిబ్రవరి ఆరో తేదీన ‘హాత్ సే హాత్ జోడో’ను ఇక్కడ నుంచే ప్రారంభించామని గుర్తు చేశారు. ఎన్నికలు పూర్తికాగానే జాతరపై దృష్టి పెట్టి.. మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పనులు చేయించినట్టు తెలిపారు. జాతర సమయంలోనే కాకుండా ఈ ప్రాంత అభివృద్ధిని మంత్రులు సీతక్క, కొండా సురేఖతో కలిసి తాను స్వయంగా పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు. సమ్మక్క-సారలమ్మ అంటేనే పోరాట స్ఫూర్తి అని, ప్రజలపై ఆధిపత్యం చలాయించి.. వారిని పీడించైనా పన్నులు వసూలు చేయాలనుకున్న రాజులపై కలిసికట్టుగా పోరాడారని కొనియాడారు. ఆ స్ఫూర్తితోనే ప్రజా పాలన ద్వారా ప్రజల సమస్యలు పరిష్కరించడానికి తమ ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తున్నదని తెలిపారు. దక్షిణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతరను కేంద్ర ప్రభుత్వం జాతీయ పండగగా గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మేడారం జాతరకు కేంద్రం రూ.3 కోట్లు కేటాయించిందనీ, తెలంగాణను కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందనడానికి జాతర పట్ల వ్యవహరిస్తున్న తీరు నిదర్శనమన్నారు. అయోధ్యలో రాముడిని దర్శించుకోవాలని ప్రధాని మోడీ, మంత్రి అమిత్‌షా చెప్పారని, ఆ మాదిరిగానే మేడారం జాతరను వారిద్దరూ దర్శించుకోవాలని అన్నారు. వారికి అధికారిక హౌదాలో స్వాగతం పలుకుతామన్నారు. జాతీయ హౌదా ఇవ్వలేమని కిషన్‌రెడ్డి ఆదివాసీలను అవమానించారని తెలిపారు.
జర్నలిస్టుల అన్ని సమస్యలు పరిష్కరిస్తాం
తాము అధికారంలోకొచ్చి వంద రోజులు కాలేదని, పదేండ్లు ఓపిక పట్టారని, ఇంకొన్ని రోజుల్లో జర్నలిస్టుల అన్ని సమస్యలు పరిష్కరిస్తామని సీఎం స్పష్టంచేశారు. ప్రభుత్వాన్ని తేవడంతోనే జర్నలిస్టుల పని అయిపోలేదని, కుట్రలు, కుతంత్రాలను తిప్పికొట్టడానికి సహకరించాలని కోరారు. త్వరలోనే ప్రెస్ అకాడమీ చైర్మెన్‌నూ నియమిస్తామని తెలిపారు. గతంలో జర్నలిస్టులను సచివాలయంలోకి రానివ్వలేదని, ఇప్పుడు ప్రతి ఛాంబర్‌కు వెళ్లే అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.
కాళేశ్వరం దోపిడీపై బీజేపీ ఎందుకు స్పందించదు..
కాళేశ్వరం ప్రాజెక్టులో దోపిడీ, అక్రమాలు, నిర్లక్ష్యం కండ్లకు కట్టినట్టు చూపించినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని సీఎం రేవంత్ ప్రశ్నించారు. మేడిగడ్డపై తాము జ్యుడిషియల్ విచారణకు అనుమతిచ్చిన తర్వాత దాన్ని సీబీఐకి అప్పగించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ-బీఆర్‌ఎస్ లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటున్నాయని, పది సీట్లు బీజేపీకి, ఏడు సీట్లు కేసీఆర్‌కు మాట్లాడుకొని ఎన్నికలకు రాబోతున్నారన్నారు.