వరద సహాయ చర్యల్లో సమర్థవంతంగా సేవలు

– ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీకి గవర్నర్‌ అభినందనలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
వరద సహాయక చర్యలను సమర్థవంతంగా నిర్వహించినందుకు ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ సభ్యులను గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై అభినందించారు. ఆమె ఆదేశాల మేరకు వైద్య శిబిరాలు నిర్వహించడంతోపాటు, ఆరోగ్య పరిశుభ్రత కిట్లు, కిరాణా సామాగ్రి, టార్పాలిన్లు, దుప్పట్లు, బెడ్‌షీట్లు తదితరాలను సోసైటీ తరుపున పంపిణీ చేసినట్టు వివరించారు. తద్వారా వరద బాధితులకు తక్షణ సహాయక చర్యలు చేపట్టామంటూ ఈ సందర్భంగా ఐఆర్‌సీఎస్‌ అధికారులు గవర్నర్‌కు వివరించారు. గురువారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో జయ శంకర్‌- భూపాలపల్లి, వరంగల్‌ జిల్లాలకు చెందిన ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీకి చెందిన జేఆర్‌సీ, వైఆర్‌సీ వాలంటీర్లతో వరద సహాయక చర్యలపై గవర్నర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా జిల్లాల్లో వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన గ్రామాల్లో చేపట్టిన సహాయక చర్యలపై తీసుకున్న చర్యలను సొసైటీ జిల్లాబృందాలు గవర్నర్‌కు వివరించారు.ఈ సందర్భంగా జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌ జెడ్‌పీహెచ్‌ఎస్‌ స్కూల్‌కు చెందిన జేఆర్‌సీ సభ్యుల ‘కొత్త కోడ్‌ లాంగ్వేజ్‌’ ప్రదర్శనను మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలకు చెందిన ఎస్‌. దేవిక, మల్లిక, మాస్టర్‌ ఎం శివ నవదీప్‌, ఏ.రాజ శేఖర్‌ను గవర్నర్‌ అభినందించారు.మరొక కొత్త బ్లడ్‌ బ్యాంక్‌, జన్‌ఔషధి సెంటర్‌, తల్లి పాల బ్యాంకు, న్యూట్రిషన్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌, కంప్యూటర్‌ సెంటర్‌ ఫర్‌ స్కీల్‌ డెవలప్‌మెంట్‌, సీపీఆర్‌, ఫిజియోథెరపీ యూనిట్లను ప్రారంభించేందుకు కొత్త భవనానికి శంకుస్థాపన చేయాలని గవర్నర్‌ ఆదేశించారు. ఐఆర్‌సీఎస్‌ తెలంగాణ రాష్ట్ర శాఖ గౌరవాధ్యక్షులు అజరు మిశ్రా, ఐఏఎస్‌ (రిటైర్డ్‌.) కె. సురేంద్రమోహన్‌, ఐఏఎస్‌, గవర్నర్‌ కార్యదర్శి, గవర్నర్‌ జాయింట్‌ సెక్రటరీలు, ఐఆర్‌సీఎస్‌ ఇతర సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.