ఆదివాసుల అభ్యున్నతి కోసం ప్రభుత్వాల కృషి

Efforts of Governments for the upliftment of Adivasisనవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్‌
ఆదివాసుల అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయని, వాటిని సక్రమంగా అమలు చేసేలా అధికారులు కూడా కృషి చేస్తున్నారని జిల్లా కలెక్టర్‌ రాజర్షిషా అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని హీరసుక జాగృతి సమితి ఆధ్వర్యంలో బస్టాండ్‌ ఎదుట నిర్వహించిన వేడుకల్లో ఎస్పీ గౌస్‌ ఆలంతో కలిసి పాల్గొన్నారు. ముందుగా హీరసుక దేవునికి పూజలు చేశారు. అనంతరం జెండాను ఆవిష్కరించి కుమురంభీం, రాంజీగోండ్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సమితి ఆధ్వర్యంలో కలెక్టర్‌, ఎస్పీలతో పాటు సంఘం నాయకులను సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ రాజర్షిషా మాట్లాడుతూ ఆదిలాబాద్‌ జిల్లాలో ఆదివాసులు ఎక్కువగా ఉన్నారన్నారు. ప్రభుత్వం వారి మార్పుకోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని తెలిపారు. ఐటీడీఏను మరింత బలోపేతం చేస్తామని డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క పిప్రిసభలో హామీ ఇచ్చారన్నారు. ఆదివాసీ సంస్కృతి, సాంప్రదాయాలు ఎంతో గొప్పవని వాటిన భవితరాలకు అందించడంతో ఇలాంటి ఆదివాసీ దినోత్సవం ఎంతో దోహదం చేస్తుందన్నారు. మంత్రి సీతక్క సూచన మేరకు ఆదివాసులతో మమేకం అవుతూ వారి సమస్యల పరిష్కరం దిశగా పని చేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో ఏటీడీఓ నిహారిక, హీరసుఖ జాగృతి సమితి అధ్యక్షుడు సిడాం రాంకిషాన్‌, నాయకులు మేస్రం కృష్ణ, బాపురావ్‌, ఆత్రం, అనసూయ పాల్గొన్నారు.
తలమడుగు : ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా మండల కేంద్రంతో పాటు వివిధ గిరిజన గ్రామాల్లో శుక్రవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలో కుమురంభీం చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గిరిజన నాయకులు జ్ఞానేశ్వర్‌ మాట్లాడుతూ ఆదివాసుల హక్కుల కోసం పోరాటాలు చేసి మహనీయుడు కుమురంభీం అని తెలిపారు. కార్యక్రమంలో గిరిజన నాయకులు దర్ము, గంగారాం, శంకర్‌, గోపాల్‌, సీతారాం, మాల సంక్షేమ సంఘం నాయకులు నేతుల గంగన్న, దిలీప్‌, మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు.