– ప్రభుత్వ సమాచారం బ్రెయిలీ లిపిలో అందుబాటులో ఉంచాలి : ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కె. వెంకటేశ్, ఎం.అడవయ్య
నవతెలంగాణ- సంగారెడ్డి/కాప్రా
అంధుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని, ప్రభుత్వ సమాచారాన్ని బ్రెయిలీ లిపిలో అందుబాటులో ఉంచాలని ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు కె. వెంకటేశ్; ఎం.అడివయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం అంధుల అక్షర ప్రధాత లూయిస్ బ్రెయిలీ 215వ జయంతి సందర్భంగా సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో జరిగిన కార్యక్రమాల్లో వారు పాల్గొని లూయిస్ బ్రెయిలీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు.
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కేవల్ కిషన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.అడివయ్య మాట్లాడారు. లూయిస్ బ్రెయిలీ తన బాల్యంలో ప్రమాదవశాత్తు రెండు కండ్లు కోల్పోయి అంధుడిగా మారాడని దాంతో 1784లో పారిస్‌లో వాలెంటైన్ హ్యూ ప్రారంభించిన అంధుల పాఠశాలలో ఆయన చదువుకున్నారన్నారు. అంధుల కోసం ప్రత్యేక లిపి అవసరమని భావించి.. బ్రెయిలీ లిపిని కనుగొని అంధులకు అక్షర ప్రధాతగా నిలిచాడని తెలిపారు. కాగా మన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంధుల కోసం ప్రత్యేక విద్యాసంస్థలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని రకాల అంధత్వం కలిగిన వారికి వైకల్య ధృవీకరణ పత్రాలు జారీ చేయాలని కోరారు. సామూహిక ప్రాంతాల్లో బ్రెయిలీ లిపి అందుబాటులో ఉంచాలని, ప్రభుత్వ సమాచారం, జీవోలు, చట్టాలు బ్రెయిలీ లిపిలో ముద్రించి అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. అంధత్వం కలిగిన వారికి పౌష్టిక ఆహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, వారికి అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించి ప్రోత్సాహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్‌పీఆర్‌డీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యం. బస్వారాజు, తలారి గోపాల్, రాష్ట్ర కమిటీ సభ్యులు ఇస్మాయిల్, జయలక్ష్మి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ టి. మల్లేశం, ప్రచార కార్యదర్శి మన్నే పోచయ్య, జిల్లా సహాయ కార్యదర్శి డాక్టర్ బాలరాజు, కిష్టయ్య, రాంచందర్, ఉపాధ్యక్షులు తుకారాం, కొణింటి నర్సిములు, శివకుమార్, రాజు, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఈసీఐఎల్ కమలానగర్‌లోని భాస్కరరావు భవనంలో ఎన్‌పీఆర్‌డీ మేడ్చల్ జిల్లా కన్వీనర్ కె. నాగలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో కె. వెంకటేశ్ మాట్లాడారు.
2020 నాటికి అంధత్వాన్ని నివారించాలని డబ్ల్యూహెచ్‌ఓ ప్రారంభించిన విజన్ 2020లో భారత ప్రభుత్వం చేరిందని గుర్తుచేశారు. ప్రపంచంలోనే అత్యధిక అంధులు ఉన్న దేశం ఇండియా అని, పిల్లల్లో అంధత్వం పెరుగుదలకు నివసిస్తున్న ప్రాంతం, కుటుంబ సామాజిక, ఆర్థిక పరిస్థితి కారణమవుతుందని చెప్పారు. మన దేశంలో 15 మిలియన్ల మంది అంధులున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంధుల కోసం ప్రత్యేకంగా విద్యాసంస్థలు ఏర్పాటు చేయాలని కోరారు. కె. నాగలక్ష్మి మాట్లాడుతూ.. అంధత్వం కలిగిన వారిని అన్ని రంగాల్లో సమాన అవకాశలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు షేన్ బేగం, బాలయ్య, రమేష్, మోతి భారు, బుచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు.