– కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
నవతెలంగాణ-ఆసిఫాబాద్
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు అందరం సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తుకారం భట్‌తో కలిసి సీజనల్ వ్యాధుల నియంత్రణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధులలో ముఖ్యంగా మలేరియా, డయేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, టైఫాయిడ్ వ్యాధులు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నందున, ఈ వ్యాధుల నియంత్రణకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపరు. గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలలో ప్రయివేటు ఆస్పత్రులలో చికిత్సకు వచ్చే వ్యక్తులకు అవసరం మేరకు రక్త నమూనాలను పరీక్షించి వారిలో ఎవరికైనా పాజిటివ్‌గా రిపోర్టు వస్తే వారి వివరాలను ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయానికి నిర్ణీత ప్రొఫార్మాలో పంపించాలన్నారు. గ్రామాలలో ప్రజల సౌకర్యార్థం వైద్య శిబిరాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, దోమల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, గ్రామీణ ప్రాంతాలలో నిరంతరాయంగా పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్నాయన్నారు. ప్రయివేట్ ఆస్పత్రులలో వైద్యులు, సిబ్బంది వివరాలు అందించాలని, ఆయా ఆస్పత్రులలో అందించే వైద్య సేవల ధరల పట్టికను ప్రదర్శించాలని తెలిపారు. ప్రజారోగ్యం విషయంలో అందరం సమిష్టిగా కృషి చేద్దామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఆస్పత్రి పర్యవేక్షకులు చెన్నకేశవ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉపవైద్యాధికారి సీతారాం, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు, ప్రయివేట్ ఆస్పత్రుల వైద్యులు పాల్గొన్నారు.
వర్షాలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు
జిల్లాలో వర్షపాత తీరును బట్టి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే వివరించారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వివిధ ప్రభుత్వ పథకాలపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్ కార్యాలయం నుండి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) దాసరి వేణు, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ ఆర్డీఓలు లోకేశ్వర్ రావు, కాసబోయిన సురేష్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే నాలుగు రోజులలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జన జీవనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తు రక్షణ చర్యలు తీసుకుంటున్నామని, చెరువులు, కాలువలు దెబ్బతినకుండా జాగ్రత్త చర్యలు చేపడతామని, రహదారులు, వంతెనలు, కాజ్ వేలు, వాగుల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. విద్యుత్ స్తంభాలు, వ్యవసాయ, ఉద్యానవన పంటలు దెబ్బతినకుండా చర్యలు చేపడతామని, ిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ భవనాలు, నివాస గృహాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, వ్యాధుల వ్యాప్తిని నియంత్రించడంలో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నూతన ఆర్‌ఓఆర్ రెవెన్యూ చట్టంపై రైతులు, మేధావులు, నిపుణులతో వర్క్ షాప్ నిర్వహించి అభిప్రాయ సేకరణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి లక్ష్మీనారాయణ, ఆసిఫాబాద్ మున్సిపల్ కమిషనర్ భుజంగరావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఆదిమ గిరిజనుల అభివృద్ధికి చర్యలు
దేశంలోని ఆదిమ గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ సంచాలకులు వైభవ్ గోయల్ అన్నారు. మంగళవారం న్యూఢిల్లీ నుండి ఇతర ఉన్నత అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రధానమంత్రి జన్‌మన్ పథకం నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తుకారం, జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి రమాదేవితో కలిసి హాజరయ్యారు. ప్రధానమంత్రి జన్‌మన్ పథకం కింద ఆదిమ గిరిజనుల(పీవీటీజీ)ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో 3,615 గృహాల నిర్మాణానికి గుర్తించామని, గిరిజన గ్రామాలను జిల్లా కేంద్రానికి అనుసంధానం చేస్తూ రహదారుల నిర్మాణం, ఆదిమ గిరిజనుల ఆవాసాలకు సురక్షితమైన తాగునీటిని అందించడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్లాట్ల క్రమబద్ధీకరణ దరఖాస్తుల పరిశీలన
జిల్లాలోని లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం ఎల్‌ఆర్‌ఎస్ 2020 పథకంలో భాగంగా ఆగస్టు 26, 2020లోపు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను పరిశీలించడం జరుగుతుందని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల భారీగా దరఖాస్తుల పరిశీలన, క్రమబద్ధీకరణకు సాంకేతిక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ బృందాలు ఆయా లే అవుట్లలోని ప్లాట్లను పరిశీలన జరిపి క్రమబద్ధీకరణకు సిఫారసు చేయడం జరుగుతుందని తెలిపారు. లే అవుట్ క్రమబద్ధీకరణ దరఖాస్తుదారుల సహాయం కోసం జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, వివరాలకు 8919243616 నంబర్‌లో సంప్రదించాలన్నారు. దరఖాస్తుదారులు ప్లాట్ల క్రమబద్ధీకరణ, అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉంటే ఆన్‌లైన్ ద్వారా సమర్పించాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.