ధాన్యం కొనుగోలు సాఫీగా సాగేలా కృషి చేయాలి..

Efforts should be made to make grain purchase smooth.– ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్…
నవతెలంగాణ – డిచ్ పల్లి
ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి స్థాయి లక్ష్యానికి అనుగుణంగా సాఫీగా సాగేలా కృషి చేయాలని, ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ఇందల్ వాయి మండలం లోని ఇందల్ వాయి గ్రామంలో,  ఎల్లారెడ్డిపల్లి గ్రామాల్లో సహకార సంఘాల ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ శనివారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తో కలిసి పరిశీలించారు. రైతుల సౌకర్యార్థం కేంద్రాలలో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు. కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చిన రైతులను పలకరించి, కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని ఆరా తీశారు. ధాన్యం విక్రయించిన రైతులకు త్వరితగతిన బిల్లుల చెల్లింపుల కోసం ట్యాబ్ లో వెంటదివెంట వివరాలు నమోదు చేయాలని సూచించారు. కొత్తగా ట్యాబ్ లు కేటాయించబడిన కేంద్రాల నిర్వాహకులు తక్షణమే డివైస్ మ్యాపింగ్ చేసుకోవాలని అన్నారు. ఎలాంటి గందరగోళం, పొరపాట్లకు తావులేకుండా ధాన్యం సేకరణ ప్రక్రియను సజావుగా జరిగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే సరిచేసుకోవాలని సూచించారు. అకాల వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి స్థాయి లక్ష్యానికి అనుగుణంగా సాఫీగా సాగేలా కృషి చేయాలని అన్నారు. రైతులు ధాన్యం తెచ్చిన వెంటనే తూకం వేయించి, లారీలలో లోడ్ చేసి నిర్దేశిత రైస్ మిల్లులకు పంపించాలని, కొనుగోలు కేంద్రాలతో పాటు మిల్లుల వద్ద ధాన్యం లోడింగ్, అన్ లోడింగ్ వెంటదివెంట జరిగేలా పర్యవేక్షణ జరపాలన్నారు. అన్ని కేంద్రాలకు సరిపడా గన్నీ బ్యాగులు సమ కూర్చాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్, డీఎస్ఓ అరవింద్ రెడ్డి, సివిల్ సప్లైస్ డీ.ఎం అంబదాస్ రాజేశ్వర్, డీసీఓ శ్రీనివాస్, సోసైటి చైర్మన్ చింతల పల్లి గోవర్ధన్ రెడ్డి, సిఈఓ ఉప్పల్ వాయి రతన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోత్కురి నవీన్ గౌడ్, తదితరులు ఉన్నారు.