– అన్ని కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన
– జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే ప్రక్రియ సజావుగా కొనసాగేలా సంబంధిత అధికారులు, కేంద్రాల నిర్వాహకులు అంకితభావంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు సూచించారు.మంగళ వారం జిల్లా కలెక్టర్లతో యాసంగి పంటకు సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, సి.ఎం.ఆర్ పై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో కలసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి నిర్వహించిన వీడియో కన్ఫెరెన్సు లో కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు పాల్గొన్నారు.జిల్లాలో ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా నిర్దిష్ట ప్రణాళికతో ముందుకెళ్లాలని అన్నారు. కొనుగోలు కేంద్రాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అలాగే అన్ని కేంద్రాలు ఏప్రిల్ 1 నుండి ప్రారంభం కావాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుండి ధాన్యం రాకుండా అన్ని చెక్ పోస్టుల్లో గట్టి నిఘా ఉంచాలని సూచించారు. తదుపరి జిల్లాల వారీగా సి.ఎం.ఆర్ రైస్ పెండింగ్, వేసవి దృష్ట్యా త్రాగునీటి ఎద్దడి నివారణకు తీసుకోవలసిన చర్యలపై జిల్లాల వారీగా సమీక్షించారు.తదుపరి జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ మాట్లాడుతూ యాసంగి వరి ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఏప్రిల్ 01 వ తేదీ నుండి 18 వరకు ఐ కె పి ద్వారా 158, pacs ద్వారా 63 మొత్తం జిల్లాలో 221 వరి కొనుగోలు కేంద్రాలను రైతులకు అందుబాటులో ఉంచేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లాలో కొనుగోలు కేంద్రాలను దాదాపు 3.55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. పంట విక్రయం విషయంలో రైతులు ఇబ్బందులకు గురికాకుండా, పూర్తి పారదర్శకంగా ధాన్యం సేకరణ జరగాలన్నారు. సరిపడా సంఖ్యలో తేమ కొలిచే యంత్రాలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. రైతులకు నష్టం వాటిల్లకుండా తూకం, తరుగు వంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలని, ధాన్యం సేకరణ ముగిసేంత వరకు పకడ్బందీ పర్యవేక్షణ కొనసాగించాలని అలాగే గన్ని సంచులు అందుబాటులో ఉంచాలని సూచించారు. నాణ్యతా ప్రమాణాలకు లోబడి ధాన్యం తీసుకువచ్చే రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మేరకు పూర్తి స్థాయి మద్దతు ధర అందేలా చూడాల్సిన గురుతర బాధ్యత అధికారులపై ఉందని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులందరూ సమిష్టిగా, సమన్వయంతో పనిచేస్తూ ధాన్యం సేకరణ ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు. రైతుల నుండి ఏ చిన్న ఫిర్యాదు సైతం రాకుండా చూసుకోవాలని అన్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని వెంట వెంట రైస్ మిల్లులకు తరలించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తేవాలన్నారు.ఈ కార్యక్రమం లో డీఎస్ఓ మోహన్ బాబు, సి.పి.ఓ అప్పారావు, డిఆర్డీఓ మధుసూదన్ రాజు, సివిల్ సప్లయిస్ డీ.ఎం రాములు, జిల్లా మార్కెటింగ్ అధికారి శర్మ, తదితరులు పాల్గొన్నారు.