– హోం మంత్రి మహమ్మద్ అలీ
– అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం,అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ వేడుకలు
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
మాదకద్రవ్యాలు నియంత్రణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని హోంమంత్రి మహమ్మద్ అలీ, డీజీపీ అంజనీకుమార్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మాదకద్రవ్య నిరోధక విభాగం, వికలాంగులు, సీనియర్ సిటిజన్లు, ట్రాన్స్‌జెండర్ల సాధికారత విభాగం అధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ యూసఫ్‌గూడాలోని మొదటి పోలీస్ బెటాలియన్ శౌర్య కన్వెన్షన్ సెంటర్‌లో మిషన్ పరివర్తన పేరుతో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మాదకద్రవ్యాలు లేకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని, మాదక ద్రవ్యాలు సేవించే వారిని గుర్తించి పోలీసులకు తెలియజేయాలని సూచించారు. అదేవిధంగా డ్రగ్స్ సేవించే వారితో విద్యార్థులు స్నేహం చేయొద్దని చెప్పారు. రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం తక్కువగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశంలో అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉందని, మాదకద్రవ్యాలు పూర్తిగా నిషేధిస్తే రాష్ట్రానికి ఇంకా మంచి పేరు వస్తుందని తెలిపారు.
డీజీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ.. ప్రతి రంగంలోనూ ఎంతో మంది అద్భుతాలు సృష్టిస్తునారని.. కొంత మంది మాత్రమే చెడు మార్గంలో వెళ్తున్నారన్నారు. దేశ వ్యాప్తంగా దాదాపు 11 కోట్ల మంది మాదక ద్రవ్యాలకు అలవాటు పడినట్టు నివేదికలు చెబుతున్నాయన్నారు. చెడు స్నేహం వల్ల యువత ఉజ్వల భవిషత్తు నాశనం చేసుకోవద్దని సూచించారు. ఈ వేడుకల్లో వైష్ణవి డాన్స్ సెంటర్ అధ్వర్యంలో శాస్త్రీయ నృత్యం, ”అభినవ కవి” ప్రణవ్ చాగంటి ఆధ్వర్యంలో రాప్ ప్రదర్శన, ద మహా ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో బ్యాండ్, ప్రముఖ ఫ్లో ఆర్టిస్ట్ కావ్య ఆక్రోబాట్, ప్రముఖ సాండ్ ఆర్టిస్ట్ కంత్రిస ప్రదర్శనలు నిర్వహించారు. అలాగే ఎన్‌డీపీఎస్ పుస్తకావిష్కరణతోపాటు పోస్టర్ ఆవిష్కరణ చేశారు. అనంతరం రాష్ట్రస్థాయి పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. మిషన్ పరివర్తన లఘుచిత్రం, టీఎస్‌ఎన్‌ఏబీ ఆడియో, వీడియో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సీపీ, రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, హెచ్‌ఎఫ్‌ఏసీ డైరెక్టర్ సి.వి. ఆనంద్, సీనియర్ సిటిజన్ల విభాగం ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి భారతి హోలీకేరి, వికలాంగులు, సీనియర్ సిటిజన్లు, లింగ మార్పిడి వ్యక్తుల సాధికారత విభాగం డైరెక్టర్, వికలాంగుల శాఖ రాష్ట్ర కమిషనర్ బి.శైలజ, ప్రముఖ సినీ నటి కృతిశెట్టి, టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్, పోలీస్ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.