గుడ్ పోలీసింగ్ ను నెలకొల్పేందుకు కృషి

Efforts to establish good policing– పోలీసుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం
– రక్తదానం చేసిన ఎస్పీ, సిబ్బంది
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
ప్రజల భద్రతతో పాటు అదే సమయంలో సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా గుడ్ పోలీసింగ్ ను నెలకొల్పేందుకు కృషి చేస్తున్నామని జిల్లా ఎస్పీ గౌస్ ఆలం అన్నారు. పోలీసు అమరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శనివారం స్థానిక ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో మెగా రక్తదాన శిభిరాన్ని నిర్వహించారు. ఎస్పీ గౌస్ ఆలం, డీఎంహెచ్ఓ కృష్ణతో కలిసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అంతకుముందు పోలీసు అమరులకు నివాలులర్పించి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన యుజవన సంఘాలు ఎస్పీ గౌస్ ఆలం ను సత్కరించి స్వామి వివేకానంద చిత్రాన్ని బహూకరించారు. ఎస్పీతో పాటు ఆయన సోదరుడు డా.జిలాని, స్నేహితుడు ఐఆర్ఎస్ అదికారి వికాస్ లు సైతం రక్తధానం చేసి దాతృత్వాన్ని చాటారు. ఆదిలాబాద్, బోథ్, ఇచ్చోడ, ఉట్నూర్ లో నిర్వహించిన రక్తదాన శిబిరాల ద్వారా దాతల ద్వారా 260 యూనిట్ల రక్తాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు సురేందర్రెడ్డి, జీవన్రెడ్డి, సీఐలు, ఆర, ఎస్ఐలు, వివిధ విభాగాల పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
పోలీసులు సమాజం కోసం నిరంతరం పరిచేస్తుంటారు
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా వారం రోజులుగా వివిధ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలోని నాలుగు చోట్ల నిర్వహించిన శిబిరాల ద్వారా 260 మంది రక్తదానం చేసినట్లు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ లో విదుల్లో భాగంగా 59 మంది పోలీసులు అమరులయ్యారని, వారి త్యాగాల ఫలితంగానే నేటి స్వేచ్చాయుత పరిస్థితులని వివరించారు. అయితే గతంలో ఉన్న పరిస్థితులు వేరని, ఇప్పుడు అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధిని సాధించామన్నారు. వైద్యులు. పోలీసులు సమాజం కోసం నిరంతరం పరిచేస్తుంటారని ప్రశంసించారు.