నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించేందుకు కృషి చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ సుంకేట అన్వేష్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా అధికారులు ఆయనకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.వ్యవసాయ విస్తరణ అధికారులతో స్థానికంగా రైతులు వ్యవసాయానికి వాడుతున్న వివిధ రకాల విత్తనాలు దిగుబడులు నష్టపోయిన రైతుల వివరాలు రానున్న కాలంలో సాగులో ఏ విత్తనాలను వినియోగించేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారో.. తదితర అంశాలపై సమీక్షించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.
రైతుల ఆర్ధికాభివృద్ధికి కాంగ్రెస్ కృషి
ప్రస్తుత శీతాకాలం సాగులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శనగ పంట పండించేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇలాంటి సందర్భంలో రైతులు ప్రైవేట్ వ్యాపారస్తుల కొత్త కొత్త ఆకర్షణీయ ప్యాకెట్లతో మోసపూరిత మాటలతో మోసపోకుండా తమ ప్రభుత్వ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా నాణ్యమైన విత్తనాలు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. గతంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించి వారి ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు ఆ ప్రభుత్వంలోని సీడ్స్ కార్పొరేషన్ కు ప్రత్యేక గుర్తింపు ఉందని తెలియజేశారు. రానున్న రోజుల్లోనూ రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రైవేటు వ్యాపారస్తుల మాయమాటలతో మోసపోకుండా మంచి దిగుబడి ఇచ్చే అన్ని రకాల పంటలకు సంబంధించిన విత్తనాలను తమ కార్పొరేషన్ ద్వారానే అందించడానికి శతవిధాల కృషి చేస్తున్నామని తెలియజేశారు. ఇదే విషయంపై సంస్థను మళ్లీ యధా స్థానంలోకి తీసుకువచ్చేందుకు సహకార సొసైటీల ద్వారా సిఓలు, డిఈఓ లతో సమావేశం నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. గడిచిన పదేళ్లలో తెలంగాణ ప్రభుత్వ రంగ విత్తనాభివృద్ధి సంస్థ గుర్తింపును కోల్పోయిందని కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఈ సంస్థకు ఎంతో గుర్తింపు పొంది రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించిన ఘనతను మరొకసారి చాటుకోవాలన్నదే తమ ప్రధాన లక్ష్యమని వెల్లడించారు.
రైతులను ఆదుకునేందుకు సిద్ధం
రానున్న శనగ పంట సాగులో రైతులు నష్టపోకుండా నాణ్యమైన విత్తనాలను అందించి ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో ప్రైవేటు వ్యాపారస్తుల మాయలో పడి కొనుగోలు చేసిన విత్తనాలతో నష్టపోయిన రైతులకు నేటికీ నష్టపరిహారం రాని పరిస్థితిని గుర్తించామని ఆ పరిస్థితి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత తమ సహకార సంఘాల చైర్మన్ లు, అధికారులు చూసుకుంటారన్నారు. సమావేశంలో డిసిసిబి చైర్మన్ అడ్డి బోజరెడ్డి, డిసిఓ బి.మోహన్ , బ్యాంక్ ఎడిసిసిబి సీఈవో శ్రీధర్ రెడ్డి, ఏడిఓ శ్రీధర్ స్వామి, పిఎసిఎస్ అధ్యక్షులు సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్టార్ నవీనకళ, డిటి ఆత్మారం, హారతి, రజినీకాంత్, సంతోష్ పాల్గొన్నారు.