హయ్యర్‌ పెన్షన్‌ సమస్యల పరిష్కారానికి కృషి

హయ్యర్‌ పెన్షన్‌ సమస్యల పరిష్కారానికి కృషి– కేంద్ర పీఎఫ్‌ కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్తాం
– పీఎఫ్‌ సెంట్రల్‌ బోర్డు అఫ్‌ ట్రస్టీ సభ్యులు కరుమలయన్‌ హామీ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
హయ్యర్‌ పెన్షన్‌ నమోదులో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని సీఐటీయూ జాతీయ కార్యదర్శి, పీఎఫ్‌ సెంట్రల్‌ బోర్డు అఫ్‌ ట్రస్టీ సభ్యులు కరుమలయన్‌ హామీ ఇచ్చారు. ఆయా సమస్యలన్నింటినీ పీఎఫ్‌ కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే కార్మికులు పోరాటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆదివారం ఢిల్లీకి వెళ్లిన ఏపీఎస్‌ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్‌ కోశాధికారి జే దివాకర్‌, టీజీఎస్‌ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌డబ్ల్యూఎఫ్‌) ప్రధాన కార్యదర్శి వీఎస్‌ రావు ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌ ప్రధాన కార్యదర్శి ఆర్‌ లక్ష్మయ్యతో పాటు కరుమలయన్‌ను కలిసి సమస్యలు వివరించారు. మొత్తం 14 సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం చేసిన చట్టాలను అమలు చేయడం లేదనీ, ఈపీఎఫ్‌ఓ ఇచ్చిన సర్క్యూలర్స్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదని ఈ సందర్భంగా వారు నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన ఆధారాలను అందచేశారు. ఈ నెల రెండో వారం లోపు కేంద్ర ప్రావిడెంట్‌ ఫండ్‌ కమిషనర్‌ను కలిసి, సమస్యల్ని వారికి వివరిస్తామని వారు హామీ ఇచ్చారు. అవసరమైతే దీనిపై ప్రభుత్వానికి లేఖలు కూడా రాస్తామని చెప్పారు.