
– మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు..
నవతెలంగాణ – వేములవాడ
జర్మని సహకారం తో సెస్ ను సోలార్ హబ్బుగా మార్చడానికి కృషి..భారత జర్మని సహకార పరిధిలో సిరిసిల్ల సెస్ (సహకార విద్యుత్ సరఫరా సంఘం) ను 100% సోలార్ కేంద్రంగా చేసి తద్వారా దాని స్థిరీకరణకు పాటుపడటానికి మాజి శాసనసభ్యులు, డా. చెన్నమనేని రమేష్ జర్మనీలో పలు సంస్థలతో చర్చలు జరిపినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. డా. చెన్నమనేని రమేష్ చైర్మన్ గా, డా. డీటర్ క్యున్స్ట్లింగ్, డా. మార్టిన్ ష్నైడర్, (జర్మని అంతర్జాతీయ సహకార సంస్థ) డా. రఘు చలిగంటి సమన్వయ బృంద సభ్యులు శుక్రవారం బెర్లిన్ లో సమావేశమై తదుపరి కార్యాచరణ నిర్ణయించారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ..దీర్ఘకాలిక ప్రణాళిక ఉద్దేశం అంచెలంచెలుగా 2.98 లక్షల విద్యుత్ వినియోగదారులను విద్యుత్ ఉత్పత్తి దారుల పునర్వ్యవస్థీకరించడం జరుగుతుందని తెలిపారు. దీని ద్వారా సెస్ ఆర్థిక స్వావలంబన స్థిరీకరణ తో పాటు, వినియోగదారుల ఆర్థిక ఆదాయం విద్యుత్ అమ్మకదారులవుతారు, పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుంది అని అన్నారు.
ఇందుకోసం జూన్ మాసంలో సమగ్ర నివేదిక రూపొందించి ఆగస్టు మాసంలో హైదరాబాద్ రానున్న జర్మని బృందం తో సెస్, రాష్ట్ర ప్రభుత్వం, ఇతర ప్రభుత్వ ప్రైవేటు రంగ నిర్వాహకులతో చర్చలు జరపాలని నిర్ణయించినట్లుగా తెలిపారు. ఈ దిశగా సంభందిత మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తో గత నెల మార్చి 27 నాడు ప్రాథమిక చర్చలు జరిపినట్లు వెల్లడించారు. డా. చెన్నమనేని రమేష్ 54 సంవత్సరాల క్రితం ఫోర్డ్ సంస్థ సహకారంతో ఏర్పడిన సెస్ మొదటి విప్లవాత్మకమైన కార్యక్రమంగా 1969 నుంచే ఈ ప్రాంతంలో ఒకేసారి వంద శాతం అన్ని గ్రామాలకు విద్యుత్ నిచ్చి చరిత్ర పుటల్లోకి ఎక్కిందని, ప్రస్తుతం సెస్ సభ్యుల సహకారంతో ఈ వినూతన విద్యుత్తు వినియోగదారులు, ఉత్పత్తిదారులుగా మారే కార్యక్రమం రెండో విప్లవాత్మక మార్పుగా నిలిచే అవకాశాలున్నాయని, దీనికి అందరూ సహకరించాలని కోరారు.