గత ప్రభుత్వ హాయంలో అన్ని వర్గాల సంక్షేమానికి కృషి

– మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

– హామీల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం 
– అమీనాపూర్, లక్కోరా లో బిఆర్ఎస్ అభ్యర్థి బాజీరెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం 
నవతెలంగాణ కమ్మర్ పల్లి 
గత ప్రభుత్వ హాయంలో కేసీఆర్ నాయకత్వంలోని బిఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేశామని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. హామీల అమలు చేయటంలో రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలు విఫలం చెందాయన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ కు, బిజెపికి ఈ ఎన్నికల్లో సురుకు పెట్టండని ప్రజలను కోరారు.కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి, బీజేపీ ఎంపీ అరవింద్ ఏనాడు ప్రజల మధ్య లేరు..మన బాగోగులు పట్టించుకోలేదన్నారు. ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుక బాజిరెడ్డిని గెలిపించి పార్లమెంట్ కు పంపించాలని విజ్ఞప్తి చేశారు.శనివారం వేల్పూర్ మండలం అమీనాపూర్, లక్కోరా గ్రామాల్లో ఉపాధి హామీ పని ప్రదేశంలో కూలీలను కలిసి బిఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ….. బాజిరెడ్డి గోవర్ధన్ ఫైటర్, ప్రజల మనిషి, ఎప్పుడు అందుబాటులో ఉంటాడన్నారు.మాకు బలం ఇవ్వండి, ప్రభుత్వం హామీలు అమలు చేసేదాక మీకోసం పోరాటం చేస్తామని తెలిపారు. మార్పు కావాలి, మార్పు రావాలి అంటూ అనేక అలవి కానీ హామీలిచ్చి, ప్రజలకు మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. మార్పు అనేది హామీల అమలులో కాకుండా కరెంట్ కోతల్లో, మోటార్లు కాలడంలో, పంటలు ఎండటంలో, పంటలు కొనుగోలులో, సాగు, త్రాగు నీరు ఇబ్బందులు ఏర్పడటంలో మార్పు వచ్చిందన్నారు.రాష్ట్ర ప్రజలకు మాయ మాటలు చెప్పి గద్దెనెక్కి కూర్చున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వెంటనే డిసెంబర్ 9 నాడు 6 గ్యారంటీలు,13 హ హామీలపై తొలి సంతకం చేసి 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని తెలిపాడన్నారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 100 రోజులు కాదు 150 రోజులు గడిచిన హామీలు అమలు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళలు, రైతులకు, యువతకు ఇచ్చిన  హామీలు మాత్రం అమలు కాలేదని విమర్శించారు. కేసీఆర్ 10 ఏండ్లలో అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు అనేక అభివృద్ధి పనులు చేసిన ప్రజలు కాంగ్రెస్ ఇచ్చిన అబద్ధపు హామీలు నమ్మి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మాకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పుని స్వీకరించి, ప్రజల పక్షాన ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసేదాక పోరాడుతామన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ జిల్లాలో నేను ఒక్కణ్ణే గెలిచాను నాకు తోడుగా బాజిరెడ్డిని ఎంపీగా గెలిపించి ఇవ్వండని,ఇద్దరం కలిసి ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించి హామీలు అమలయ్యేలా చేస్తామన్నారు.కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ గా ఉండి ఏనాడు మన గ్రామాలకు రాలేదని తెలిపారు.ఇప్పుడున్న బిజేపీ ఎంపీ అరవింద్ గత ఎన్నికల్లో 5 రోజుల్లో పసుపు బోర్డు తీసుకొస్తా, యువతకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అని చెప్పి మోసం చేసాడు అన్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలో ఉండి కూడా పసుపు బోర్డు తేలేకపోయాడని,గెలిచిన 5 ఏండ్లలో ఏనాడు మన గ్రామాలకు రాని, గ్రామాల అభివృద్ధికి ఒక్క రూపాయి ఇవ్వని అరవింద్ ని ఈ ఎన్నికల్లో ఓడించాలని  కోరారు. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మీ అందరికి సుపరిచితుడు, ఫైటర్, ఎప్పుడు ప్రజల మధ్యనే ఉంటాడని బాజిరెడ్డిని గెలిపించి నాకు బలం ఇవ్వండని, మేమిద్దరం కలిసి హామీలు అమలు అయ్యేలా మీ పక్షాన పోరాడుతామన్నారు. ప్రచారం సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీల, వివిధ పథకాలను డిసెంబర్ 9న అమలు చేస్తామని ఇచ్చి హామీల ఆడియోను ప్రజలకు వినిపించి, హామీల అమలులో  ప్రభుత్వం చేస్తున్న జాప్యాన్ని ప్రజలకు వివరించారు.బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కు ప్రజలు ఓటు వేసి ఎంపీగా గెలిపించి, ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు. పాల్గొన్నారు