– దేశ వ్యాప్తంగా అమలు చేయాలి
– ఏపీలో 28 బీసీ కులాలను కేంద్ర ఓబీసీలోకి చేర్చాలి : ఎన్సీబీసీ చైర్మెన్ హన్సరాజ్‌కు ఎంపీ ఆర్. కృష్ణయ్య విజ్ఞప్తి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగా దేశ వ్యాప్తంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేయాలని నేషనల్ బీసీ కమిషన్ (ఎన్సీబీసీి)ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, ఎంపీ ఆర్ .కృష్ణయ్య కోరారు. ఈ నిర్ణయంతో పేద, బడుగు బలహీన వర్గాలు ఉన్నత చదువులు చదివేందుకు దోహదపడుతుందన్నారు. బుధవారం ఢిల్లీలో ఎన్సీబీసీ చైర్మెన్ హన్సరాజ్ గంగరాం ఆహీర్‌ను ఆర్. కృష్ణయ్య నేతృత్వంలో బీసీ సంఘాలు భేటీ అయ్యాయి. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో బీసీలకు సంబంధించిన పలు సమస్యల పరిష్కారంపై చర్చించారు. ఏపీలో 28 బీసీ కులాలను కేంద్ర ఓబీసీలోకి చేర్చాలని కోరారు.
అలాగే కేంద్ర ప్రభుత్వం బీసీల సంక్షేమానికి రూ. 2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించి, వెనకబడిన వర్గాల ఆర్థిక, విద్య, ఉద్యోగ, శిక్షణ, అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. యాంత్రిక వినియోగం పెరగడం, పరిశ్రమల రాకతో కులవృత్తులు, చేతివృత్తులు దెబ్బతిన్నాయన్నారు. దీంతో ఈ కుల వృత్తులపై ఆధారపడి జీవించే వారు ఆకలి చావులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వెనకబడిన వర్గాలకు ఆర్థికంగా చేయూతనిచ్చేలా… ప్రతి కుటుంబానికి రూ. 10 లక్షల నుండి 50 లక్షల వరకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని కోరారు. అలాగే రాజీవ్ ఫెలో షిప్ స్కీం కింద అర్హులైన పీహెచ్‌డీ స్కాలర్స్ కు స్టైఫండ్ మంజూరు చేయాలని, గురుకుల పాఠశాల, హాస్టల్ భవనాల నిర్మాణాలకు బడ్జెట్ కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కాగా తమ విజ్ఞప్తులపై ఎన్సీబీసీ చైర్మెన్ సానుకూలంగా స్పందించారని, తమ డిమాండ్లను కేంద్రానికి పంపిస్తానని హన్సరాజ్ హామీ ఇచ్చినట్లు కృష్ణయ్య వెల్లడించారు.