– భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు : సీఎస్ శాంతికుమారి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్న మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. మేడారం జాతర నిర్వహణ ఏర్పాట్లపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో శనివారం బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుంచి టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. జాతరకు ముందుగానే పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారనీ, జాతర ప్రారంభం కాగానే భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఏవిధమైన ఇబ్బందులు లేకుండా తగు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మేడారానికి వచ్చే ప్రతీ ఒక్కరు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా అమ్మవార్ల దర్శనం పూర్తి చేసుకుని సంతోషంతో తిరిగి వెళ్లేలా ఏర్పాట్లు చేయాలన్నారు. జాతరలో ఏవిధమైన అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా విస్తృత స్థాయిలో పోలీస్ బందోబస్తును, చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని తెలిపారు. జాతరలో సుమారు 4,800 సీసీి కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆరు వేల బస్సులను మేడారానికి నడుపుతున్నామనీ, మేడారంలో 55 ఎకరాల విస్తీర్ణంలో తాత్కాలిక బస్ స్టేషన్‌ను కూడా ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 18వ నుంచి 26 వరకు బస్సులను నడుపుతున్నామనీ, ఇందుకు దాదాపు 9,000 బస్ డ్రైవర్లను నియమించామని వివరించారు. జాతరలో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామనీ, ఇందుకుగాను ప్రత్యేకంగా 4000మంది పారిశుధ్య కార్మికులను నియమించామని తెలిపారు. మేడారాన్ని మొత్తం 8 జోన్లుగా విభజించి పారిశుధ్య కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. 5,600 మరుగుదొడ్లను ఏర్పాటు చేయటంతో పాటు వాటి నిర్వహణకు వెయ్యి మందిని నియమించామని తెలిపారు. జాతర సందర్భంగా విద్యుత్ సరఫరాకు ఏవిధమైన అంతరాయం కలుగకుండా ప్రత్యేకంగా సబ్ స్టేషన్ ఏర్పాటు చేశామని చెప్పారు. మేడారం గద్దెలను దర్శించుకునే వారికి క్యూ-లైన్ల ఏర్పాటు పూర్తయిందనీ, అక్కడ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు తెలిపారు. జాతర వివరాలను అందించడానికి మేడారంలో ప్రత్యేకంగా మీడియా సెంటర్‌తో పాటు ఫోటో ప్రదర్శన కూడా ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. జాతరలో ఏవిధమైన ఆహార కల్తీ కాకుండా ఎప్పటికప్పుడు ఆహార పదార్థాలను పరీక్షించడానికి ఫుడ్ చెకింగ్ ఇన్‌స్పెక్టర్లను నియమించామన్నారు. జాతర సజావుగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పర్యవేక్షించేందుకు గాను ప్రత్యేకంగా ఐదుగురు ఐఏఎస్ అధికారులను హైదరాబాద్ నుంచి నియమిస్తున్నామని వెల్లడించారు. జాతరకు హాజరయ్యే ప్రతీ ఒక్కరు ప్రభుత్వం సూచించే నియమ, నిబంధనలను పాటించి జాతర సజావుగా జరిగేలా సహకరించాలని సీఎస్ విజ్ఞప్తి చేశారు. టెలి కాన్ఫరెన్స్‌లో డీజీపీి రవిగుప్తా, ఎండోమెంట్స్, ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, ముఖ్య కార్యదర్శులు శ్రీనివాస రాజు, సందీప్ కుమార్ సుల్తానియా, రిజ్వీ, వాణీ ప్రసాద్, , ఫైర్ సర్వీసెస్ డీజీ నాగిరెడ్డి, కార్యదర్శులు రాహుల్ బొజ్జా, క్రిస్టినా జెడ్ చోంగ్తు, శరత్, సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమీషనర్ హన్మంతరావు, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, పంచాయత్ రాజ్ కమిషనర్ అనితా రామచంద్రన్, ఎక్సైజ్ కమీషనర్ శ్రీధర్, జిల్లా కలెక్టర్లు, భూపాలపల్లి, హన్మకొండ, మహబూబాబాద్, వరంగల్, జిల్లా ఎస్పీలు ములుగు, టూరిజం ఎండీ రమేష్ నాయుడు, సీఎం జాయింట్ సెక్రటరీ సంగీత సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.