వృద్ద దంపతుల ఆత్మహత్యాయత్నం..

– సూర్యాపేట కలెక్టరేట్ ముందు మందు డబ్బాతో వచ్చిన వృద్ధులు

– అడ్డుకున్న పోలీసు సిబ్బంది..
– పోలీస్ సిబ్బంది కాళ్లు మొక్కుతున్న వృద్ధురాలు
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
జీవనభృతి ఇవ్వకుండా తన కోడలు బొమ్మనపల్లి రజిని తమను ఇబ్బందులకు గురి చేస్తుందని మునగాల మండల కేంద్రానికి చెందిన వృద్ద దంపతులు పిడమర్లి ఎలిషమ్మ, వెంకన్నలు సోమవారం కలెక్టరేట్‌ ముందు ఆత్మహత్యాహత్నం చేశారు. వృద్ద దంపతుల వద్ద పురుగుల మందు డబ్బాను గుర్తించిన పోలీసులు అడ్డు్డకోవడంతో ప్రమాదం తప్పింది.సోమవారం సూర్యాపేట కలెక్టరేట్‌ ముందు ఈ సంఘటన చోటుచేసుకున్నది. ఈ సందర్బంగా బాధితురాలు మాట్లాడుతూ తన కుమారుడు పిడమర్తి చిరంజీవి మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్‌ వద్ద ఇంటలిజెన్స్‌ కానిస్టేబుల్‌గా పనిచేసేవాడని, రజినిని కులాంతర వివాహం చేసుకున్నాడని తెలిపారు. విది నిర్వహణలో 2022 జూన్‌ 6 రోడ్డు ప్రమాదంలో మరణించాడని, దీంతో డిజిపి కార్యాలయంలో రజినికి జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం ఇచ్చారని తెలిపారు. తమ పోషనకోసం 2023 ఆగష్టులో కోదాడ ఆర్‌డివోను సంప్రదించగా నెలకు రజిని ఆమె వేతనం నుంచి రూ. 5 వేలు ఇచ్చేలా నిర్ణయించారని, కాని ఆమె ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని, కులం పేరుతో దూషిస్తుందని తెలిపారు. అందుకే ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిపారు. అనంతరం అదనపు కలెక్టర్‌ లతను కలసి వినతీపత్రం అందించారు.