– వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్
– పల్లెల్లో కమ్యూనిస్టులకు పూర్వ వైభవం అడుగడుగునా జన హారతులు
నవతెలంగాణ -వేములపల్లి
‘పదేండ్లలో మిర్యాలగూడ నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించిన చరిత్ర మీకుందా.. అది రంగన్నకే సాధ్యం అందుకే ప్రజల పక్షం పోరాడే నాయకున్ని ఎన్నుకోండి’ అని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ అన్నారు. మంగళవారం నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలోని శెట్టిపాలెం, మొల్కపట్నం, రావులపెంట, లక్ష్మీదేవి గూడెం, అమనగల్ గ్రామాల్లో మిర్యాలగూడ సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రతి గ్రామంలోనూ మహిళలు తిలకం దిద్ది, హారతులు పట్టి, పూలమాలలతో స్వాగతం పలికారు. తోపు చర్ల పిర్కాలో ఎన్నికల ప్రచారం కమ్యూనిస్టుల పూర్వ వైభవాన్ని తలపించేలా డప్పు వాయిద్యాలతో కోలాటాలతో ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడ్డాక బీఆర్‌ఎస్ పార్టీ విధానం మీద, ప్రజల సమస్యలపై పోరాటం చేసిన వ్యక్తి రంగన్న అని, అలాంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. నియోజకవర్గంలో ఏం చేయడానికి బీఆర్‌ఎస్ నాయకులు ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. మళ్లీ గెలిచి మరొక రూ.1000 కోట్లు సంపాదించడానికి బరిలో నిలిచారన్నారు. ఎమ్మెల్యేగా అభ్యర్థిగా రంగన్న గెలిచినట్లయితే వారు సంపాదించిన కోట్లను కక్కించి ప్రజలకు పంచుతారన్నారు. స్థానిక కాంగ్రెస్ అభ్యర్థి సేవ ముసుగులో వ్యాపారం చేయడానికి సిద్ధమై ఎన్నికల్లో నిలిచారన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పేరుతో మళ్లీ దొరల పాలన, గడీల పాలన సాగించడానికి సిద్ధమయ్యారని తెలిపారు. రంగన్న నియోజకవర్గంలో ఎన్నో సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడానికి కృషి చేశారన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ మతోన్మాదానికి లొంగి మాట మార్చిందని తెలిపారు. డబ్బు సంచులు, కాంట్రాక్టర్లు ఒకవైపున.. ప్రజల మనిషి రంగన్న మరోవైపున ఉన్నారని.. ప్రజలే ఆలోచించి తమ ఓటు హక్కుని వినియోగించుకుని ప్రజల నాయకున్ని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. చట్ట సభల్లో వెనుక బెంచ్‌లో కూర్చున్న వారికి, సమస్యలపై ప్రశ్నించే దమ్ము లేని వారికి ఎమ్మెల్యే పట్టం కట్టొద్దన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలు చైతన్యవంతులని, పోరాటనాయకుని, ప్రజల నాయకుల్ని ఎన్నుకుంటారని తెలిపారు. ఈ ప్రభుత్వం చేసిన వాగ్దానాలులేవీ అమలు చేయలేదన్నారు. దళిత బంధు, బీసీ బందు, రైతుబంధు కార్యక్రమాలు పెట్టి.. ప్రజా సమస్యల పరిష్కారాన్ని అసలుకే బందు పెట్టారని విమర్శించారు. ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, పార్టీకి పూర్వవైభం వచ్చిందని కమ్యూనిస్టుల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే సీపీఐ(ఎం) పార్టీని గెలిపించాలని కోరారు. ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమ మాట్లాడుతూ.. సేవ పేరుతో నియోజకవర్గాన్ని దోచుకునే మనిషి కావాలో.. బతుకు భరోసానిచ్చే రంగన్న కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు. మోడీ పాలనలో రైతు వ్యతిరేక చట్టాల కోసం పోరాడిన వ్యక్తి రంగన్న అని, రైతాంగం మొత్తం మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. 50 ఏండ్లుగా పోరాటమే మార్గంగా ఎంచుకొని నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల కోసం పోరాడిన వ్యక్తి రంగన్న అని, అలాంటి వ్యక్తిని గెలిపించుకోవాలని కోరారు. ప్రచారంలో సీపీఐ(ఎం) నాయకులు డబ్బికార్ మల్లేష్, గౌతమ్ రెడ్డి, వీరేపల్లి వెంకటేశ్వర్లు, పాదురు శశిధర్ రెడ్డి, గోవర్ధన, రోండి శ్రీనివాస్, పాల్వాయి రామ్ రెడ్డి, రెమిడాల పరశురాములు, పోలబోయిన వరలక్ష్మి, రవి నాయక్ ,వడ్డగాని సైదులు, శీలం బిక్షం, రెమిడాల బిక్షం, తదితరులు పాల్గొన్నారు.