మనకు పనికి వచ్చే నాయకులను ఎన్నుకోండి

– సంతలో ఓట్లు కోనేందుకు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కుట్రలు
– మీ కోసం పోరాడుతా… నన్ను గెలిపించండి
– సీపీఐ(ఎం) మిర్యాలగూడ అభ్యర్థి జూలకంటిరంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
భవిష్యత్‌లో మనకు పనికొచ్చే నాయకులను ఎన్నుకోవాలని సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి కోరారు.మంగళవారం పట్టణంలోని ప్రకాష్‌నగర్‌, గణేష్‌నగర్‌, రవీంద్రనగర్‌ కాలనీ, హనుమాన్‌పేట, అశోక్‌నగర్‌, సంతోష్‌నగర్‌, కష్ణకాలనీ, శాంతినగర్‌, సీతారాంపురం, చాకలిబజార్‌ ప్రాంతాలలో విస్తత ప్రచారం చేశారు. ఆయా ప్రాంతాలలో మహిళలు పూలమాలతో హారతులు పట్టి స్వాగతం పలికారు.డప్పు వాయిద్యాలు నడుమ అన్ని ప్రాంతాలలో పెద్దఎత్తున జనాలతో ఇంటింటి ప్రచారం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం పనిచేసే నాయకులను ఎన్నుకునేందుకు మంచి అవకాశం వచ్చిందన్నారు.తాను నిరంతరం ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేస్తున్నానన్నారు.ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కషి చేస్తున్నానని, ఏనాడూ స్వార్థం కోసం ఆలోచించలేదని చెప్పారు.పదేండ్లకాలం పాటు అధికారంలో ఉన్న ఎమ్మెల్యే భాస్కరరావు రియల్‌ ఎస్టేట్‌ పేరిట కోట్ల రూపాయలు సంపాదించారని, ,ఏనాడూ నియోజవర్గ అభివద్ధికి పాటుపడలేదన్నారు.తన హయాంలో చేసిన అభివద్ధిని అతను చేసినట్టుగా చెప్పుకుంటున్నాడని విమర్శించారు.కాంగ్రెస్‌ అభ్యర్థి సేవ ముసుగులో శవ రాజకీయాలు చేస్తున్నారని, తాను చేసిన సేవకు ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరుతున్నాడని విమర్శించారు. సీపీఐ(ఎం) మద్దతుతో రవీంద్రనగర్‌లో కౌన్సిలర్‌గా గెలిపిస్తే ఆ వార్డు అభివద్ధి పట్ల పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.వార్డు అభివద్ధిని చేయలేని వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిస్తే ఏం చేస్తాడని ప్రశ్నించారు.వాళ్లు గెలిస్తే అసెంబ్లీలో చివరి బెంచిలో కూర్చుంటారని అదే తనను గెలిపిస్తే ముందు బెంచీలో కూర్చొని ప్రజాసమస్యలపై ప్రభుత్వపై ఒత్తిడి తీసుకొస్తానన్నారు.డబ్బు, మద్యం ప్రలోభాలకు గురికాకుండా ప్రజల కోసం పనిచేసే నాయకులకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్‌ మల్లేశ్‌, టూ టౌన్‌ కార్యదర్శి భావండ్ల పాండు, దేశీరాంనాయక్‌, మల్సూర్‌, నిరంజన్‌, జగన్‌నాయక్‌, పాషా, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.