మోడీపై ఎన్నికల కమిషన్‌ చర్య తీసుకోవాలి

– ఆయనది బాధ్యతారాహిత్యం
– ప్రధాని హోదాలో మత వైషమ్యాలు సృష్టించే కుట్ర
– ఆవాజ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్‌ అబ్బాస్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ప్రధాని మోడీపై ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకోవాలని ఆవాజ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ అబ్బాస్‌ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ఆయన వ్యాఖ్యలు అత్యంత బాధ్యతారహితమైనవని పేర్కొన్నారు. ప్రధాని హోదాలో ఇలాంటి వ్యాఖ్యలు చేయటం మూలంగా మత వైషమ్యాలు సృష్టించేందుకు కుట్ర చేస్తున్నారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రజల సంపదంతా మైనారిటీలైన ముస్లింలకు పంచుతుందని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించటం ఆక్షేపణీయమని తెలిపారు. రాజస్థాన్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు అత్యంత విద్వేష, విషపూరితమైనవని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రే స్వయంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి మాట్లాడటమేంటని ప్రశ్నించారు. తద్వారా ఇక నుంచి వారి పరివారమంతా ఇదే తరహా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయటానికి అవకాశం కల్పించారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన మోడీపై ఎన్నికల కమిషన్‌ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తద్వారా ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా అరికట్టాలని కోరారు. అత్యంత కీలకమైన పదవిలో ఉన్న వ్యక్తి దేశ ప్రజల మధ్య సామరస్యం, సౌభ్రాతృత్వం పెంపొందించేలా ఉండాలని హితవు పలికారు. కానీ.. ప్రతీ సారి ఎన్నికల సమయంలో వైషమ్యాలు, భావోద్వేగాలు రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్దిపొందాలనే యావతో మోడీ వ్యాఖ్యానిస్తారని గుర్తు చేశారు. ఇది దేశ ఐక్యతకు విఘాతమని తెలిపారు. పదేండ్లపాటు అధికారంలో ఉన్న బీజేపీ దేశానికి తాను చేసిన మంచి పనులేంటో ప్రజలకు వివరించి ఓట్లు అడగాలని సూచించారు. ప్రస్తుత మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. బీజేపీని ఓడించటం ద్వారా దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు.