– తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ
– ఐదు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కీలక ఆదేశాలు జారీ
న్యూఢిల్లీ : తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. ఈ మేరకు శుక్రవారం 5 రాష్ట్రాల (తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం)ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ రాష్ట్రాల్లో మూడేండ్లు దాటిన ప్రభుత్వ అధికారులను బదిలీ చేయాలని ఆదేశించింది. కీలక స్థానాల్లో వున్న పోలీస్, రెవెన్యూ అధికారులను బదిలీ చేయాలని సూచించింది. ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్స్‌పెక్టర్లకు వారి సొంత జిల్లాల్లో పోస్టింగ్ ఇవ్వొద్దని సీఈసీ ఆదేశించింది. జూలై 31 లోపు బదిలీల ప్రక్రియ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని సూచించింది.
స్థానికంగా పోటీచేస్తున్న అభ్యర్ధులతో అధికారులకు బంధుత్వాలు లేవని డిక్లరేషన్ తీసుకోవాలని.. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ఉద్యోగులను ఎన్నికల విధులకు దూరంగా వుంచాలని ఈసీ ఆదేశించింది. గతంలో ఈసీ చర్యలు తీసుకున్న వ్యక్తులను కూడా విధులకు దూరంగా వుంచాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.