– బతుకమ్మ, దసరా కానుకల జోరు
– దీపావళికీ ఇదే తంతు
– నిన్నటి వరకు వినాయక… ప్రస్తుతం దేవి నవరాత్రుల జాతర
– పండుగల పేర పరోక్షంగా ప్రలోభాలు
– ఓటర్లకు వివిధ రూపాల్లో గాలమేస్తోన్న అభ్యర్థులు
– ఈసీ నిఘా కండ్లు కప్పి పంపిణీకి ఏర్పాట్లు
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి (మేకల కృష్ణ)
ప్రతి ఏటా పండుగలు ఆయా సీజన్లలో వస్తుండటం సహజంగా జరిగే ప్రక్రియ.. కానీ.. ఈ సీజన్‌లో ఎన్నికల పండుగకూడా కలిసిరావడం విశేషం. వినాయక, దేవీ నవరాత్రుల ఉత్సవాలు, బతుకమ్మ, దసరా, దీపావళి పండగలన్నీ ఎన్నికల వేళలో రావడంతో పండగే పండగ అన్నట్టుగా జోరు కనిపిస్తోంది. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు అనేక రకాల ఆఫర్లు పెడుతున్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఏదో ఒక రూపంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో లీడర్లున్నారు. నగదు, నగలు, కానుకలు, చీరలు, మద్యం, మాంసం ఇలా అనేకం పంపిణీ చేసేందుకు సిద్దమవుతున్నారు. ఈసీ నిఘా పెట్టి ఎంత తనిఖీ చేసినా అనేక మార్గాల్లో వీటిని తరలిస్తూ పంపిణీ చేస్తుండటం గమనార్హం.
దేవీ నవరాత్రి ఉత్సవాల ఖర్చులు భరిస్తున్న లీడర్లు
సాధారణంగా గణేష్, దేవీ నవరాత్రి ఉత్సవాలను ఆయా కాలనీల అసోషియేషన్లు, యువజన సంఘాలు ఏర్పాటు చేసి వేడుకలు నిర్వహిస్తాయి. వేడుకలకు అయ్యే ఖర్చులు తలా ఇంత చందాల రూపంలో వసూలు చేసి భరిస్తుంటారు. ఈ సారి వినాకయ చవితి సందర్భంగా విగ్రహానికి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు టోక్‌గా కవర్లలో పెట్టి పంపిణీ చేశారు. దుబ్బాక, సంగారెడ్డి, పటాన్‌చెరు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఆశావహులందరూ పోటీ పడి విగ్రహాల ఏర్పాటుకు డబ్బులిచ్చారని తెలిసింది. దేవీ నవరాత్రి ఉత్సవాలకు అభ్యర్థులు డబ్బులిచ్చి యువతను, కాలనీ వాసుల్ని ఆకట్టుకుంటున్నారు. ఫౌండేషన్ల పేరిట డబ్బులు కవర్లలో పెట్టి నిర్వాహకులకు అందజేస్తున్నారు. విగ్రహాల వద్దకు పూజలకు హాజరై పొలిటికల్ మైలేజీ పొందుతున్నారు. అన్నదానం పేరిట జరిగే కార్యక్రమాలకు హాజరవుతూ ఖర్చులు అభ్యర్థులే ఇచ్చిపోతున్నారు.
బతుకమ్మ, దసరా కానుకలు
బతుకమ్మ పండగ ఊరూవాడా జరుగుతోంది. దసరా పండగకు కూడా సన్నధ్దమవుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఖరీదైన చీరలు పంచి మహిళల్ని ఆకర్షించేందుకు ఆయా పార్టీల అభ్యర్థులు పోటీలు పడుతున్నారు. వెండి, బంగారం నగలు పంపిణీ చేసేందుకు నమ్మకమైన ఎస్‌ఎహెచ్ గ్రూపు లీడర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. బతుకమ్మ చీరల పంపిణీ ఆగిపోయినందున ఖరీదైన చీరల్ని కొనుగోలు చేస్తున్నారు. కొందరేమో చీరలు, బట్టలు కొనేందుకు డబ్బులిస్తున్నారు. టిఫిన్ బాక్సులు, గృహాపకరణాలు, టీవీలు, సెల్‌ఫోన్స్, వంట వస్తువుల్ని కూడా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దసరా పండగ రోజున ఇంటింటికీ కిలో మటన్, చికెన్‌తో పాటు మద్యం సీసాలు అందజేసేందుకు బూత్ కమిటీల వారీగా బాధ్యతలు అప్పజెప్పి, సరఫరాకూ అవసరమైన ఏర్పాట్లు చేసినట్టు తెలిసింది. పటాన్‌చెరు, సంగారెడ్డి, జహీరాబాద్, అందోల్, నారాయణఖేడ్, మెదక్, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, నర్సాపూర్ నియోజకవర్గాలతో పాటు సిద్దిపేట నియోజకవర్గంలోనూ తాయిలాలు ఇచ్చేందుకు అభ్యర్థులు సిద్ధం చేసుకుంటున్నారు. దసరాకే కాదు దీపావళి పండుగ కూడా ఎన్నికల వేళ ఉండటంతో తాయిలాలిచ్చి ప్రచారం చేయాలని చూస్తున్నారు.
పలుకుబడిని బట్టి ఎమౌంట్, గిప్టులు
ఎన్నికలొచ్చినందున ఇప్పటి వరకు అసంతృప్తి నాయకుల్ని మచ్చిక చేసుకునేందుకు అభ్యర్థులు బేరసారాలు నడిపారు. రోజువారి ఖర్చులు కూడా చెల్లిస్తున్నారు. ప్రధానమైన రెండు రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో ప్రచారానికి కదలాలంటే ఖర్చులు ఇవ్వాల్సిందే అన్నట్టుగా నడుస్తోంది. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మండల పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులకు ప్రజల్లో ఉన్న పలుకుబడిని బట్టి ఖర్చులకు డబ్బులిస్తున్నారు. దేనికైనా అదనంగా డబ్బులు చెల్లిస్తే తప్ప కదలని పరిస్థితి ఉందని ఓ పార్టీకి చెందిన కీలక నాయకుడు తెలిపారు. కొన్నిచోట్ల రెబల్ అభ్యర్థులు కూడా డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాలైన జహీరాబాద్, అందోల్‌లో కూడా పోటీ పడి ప్రలోభాలకు గురిచేస్తూ భారీ ఎత్తున తాయిలాలిస్తున్నారు.
మహారాష్ట్ర, చత్తీస్‌గడ్, కర్నాటక, ఏపీ, ఒడిశా, బీహార్ ఇతర రాష్ట్రాల నుంచి వలసొచ్చి కంపెనీల్లో ఉపాధి పొందుతున్నారు. పారిశ్రామిక వాడల్లో నివాసముంటున్నందున వీరికి ఓటు హక్కు కల్పించారు. ఓటు హక్కు ఉన్న వలస కార్మికులకు రవాణా ఖర్చులతో పాటు పండగ కోసం నగదు, వస్తువులు కూడా ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయా పార్టీల అభ్యర్థులు నియోజకవర్గాల వారీగా ఓటు హక్కు ఉన్న వలస కార్మికుల్ని పోలింగ్ బూతు వారీగా జాబితా తయారు చేశారు.