ఎన్నికల విన్యాసాలు!

ఎన్నికల విన్యాసాలు!లోక్‌సభ ఎన్నికల సందర్భంగా గత వారంలో మూడు పరిణామాలు చోటు చేసుకున్నాయి. అందులో ఒకటి సానుకూలమైనది కాగా, రెండు ప్రతికూలమైనవి.ఇందులో మొదటి పరిణామం-ఎన్నికల బాండ్ల వివరాలను మార్చి 12వ తేదీకల్లా ఎన్నికల కమిషన్‌కు అందచేయాలంటూ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను సుప్రీంకోర్టు ఆదేశించడం. అలాగే మార్చి 15కల్లా ఈ బాండ్ల వివరాలన్నింటినీ ఎన్నికల కమిషన్‌ వెబ్‌సైట్‌లో వుంచాలంటూ ఇ.సి ని కోరడం. బాండ్ల వివరాలను అందచేయడానికి జూన్‌ 30 వరకు నాలుగు మాసాలపాటు గడువు కావాలంటూ ఎస్‌బిఐ కోర్టును కోరిన నేపథ్యంలో ఈ ఆదేశాలు వెలువడ్డాయి.ఎస్‌బిఐ చేసిన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. దీంతో ఎట్టకేలకు బీజేపీకి నిధులను విరాళాలుగా ఇచ్చిన వారెవరో, వారెంత మేరకు అందచేశారో ప్రజలు తెలుసు కోగలుగుతారు. ఈ డేటాను విశ్లేషించినట్లైతే ఇందులో క్విడ్‌ ప్రోకో లాంటిదేమైనా జరిగిందా? అలాగే విరాళాలు అందచేసిన కంపెనీలు ఏవైనా కేంద్ర దర్యాప్తు సంస్థల చర్యలను, దాడులను ఎదుర్కొన్నాయా? అనేది నిర్ధారించ డానికి వీలవుతుంది. దీనివల్ల, దేశాన్ని పాలిస్తున్న హిందూత్వ- కార్పొరేట్‌ అవినీతి బంధాన్ని ఎన్నికల సందర్భంగా మరింత మెరుగ్గా సమీక్షించడానికి దోహదపడుతుంది.
ఇక రెండో పరిణామం-పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) నిబంధనలను నోటిఫై చేస్తూ మోడీ ప్రభుత్వం తీసుకున్న తిరోగమన చర్య. 2019 డిసెంబరులో ఈ చట్టాన్ని ఆమోదించగా, నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు, అది కూడా లోక్‌సభ ఎన్నికలకు కొద్ది రోజులు ముందుగా నిబంధనలను ప్రకటించారు. కొన్ని మతాలకు చెందినవారు మాత్రమే పౌరసత్వాన్ని ఫాస్ట్‌ట్రాక్‌లో అందిపుచ్చు కోగలిగేలా ఈ సిఎఎ నిబంధనలను రూపొందిం చారు.ముస్లింలను మినహాయించారు. సిఎఎకి సంబంధించి రాజ్యాంగ, చట్టపరమైన ప్రధాన అభ్యంతరాల గురించి ఇక్కడ ప్రస్తావించన వసరం లేదు. కానీ, ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకువస్తున్న నిబంధనలను తీవ్రంగా వ్యతిరేకించాల్సి వుంది. ఈ నిబం ధనల వల్ల తలెత్తుతున్న ప్రధాన సమస్య ఏమిటంటే, దీనికి కటాఫ్‌ తేదీని 2014 డిసెంబరు 31గా నిర్ధారించారు. అయితే ఇది అస్సాం ఒప్పంద నిబంధనలను ఉల్లంఘిస్తోంది. అస్సాం ఒప్పం దానికి కటాఫ్‌ సంవత్సరాన్ని 1971గా నిర్ధారిం చారు. సిఎఎను ఆమోదించి నపుడు అస్సాంలో పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తడానికి ఇదే ప్రధాన కారణం.
అదీకాక, పౌరసత్వం కోసం పెట్టుకునే దరఖాస్తు ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి పాత్ర లేకుండా చేసేలా నిబంధనలను రూపొందించారు. రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో ఈ దరఖాస్తుల పరిశీలన కోసం ఏర్పాటు చేసిన సాధికార కమిటీలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ విభాగాల ప్రతినిధులతో నిండిపోయాయి. రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలు రెండింటిలోనూ రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానితులు ఒక్కరు మాత్రమే వున్నారు. తమ రాష్ట్రంలో నివసిస్తున్న వారు పౌరసత్వం కోసం అర్హులా కాదా అనేది గుర్తించే ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి పాత్ర లేకుండా చేసేందుకే ఇదంతా చేశారనేది స్పష్టమైపోతోంది. ఒక విచిత్రమైన లాజిక్‌ ప్రకారం పోస్టల్‌, రైల్వే శాఖలకు చెందిన అధికారులు ఈ పని చేయడానికి సరిపోతారని భావించారు.
ఇక్కడ సిఎఎ రాజ్యాంగ విరుద్ధమని సవాలు చేస్తూ దాఖలైన దాదాపు 200 పిటిషన్లను విచారణకు చేపట్టకుండా, వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా సుప్రీంకోర్టు విస్మరించింది. ఎన్నికల బాండ్ల విషయంలో, 370వ అధికరణను రద్దు చేసిన కేసుల్లో తీర్పు నివ్వడంలో సుప్రీంకోర్టు చేసిన జాప్యం, వైఫల్యాల వల్ల మోడీ ప్రభుత్వం అప్రజాస్వామిక, రాజ్యాంగ విరుద్ధమైన చర్యలు తీసుకోవడానికి వీలు కలిగింది.ఇక మూడవ పరిణామం-భారత ఎన్నికల కమిషన్‌ (ఇసిఐ)కి సంబంధించినది. రాబోయే లోక్‌సభ ఎన్నికల నిర్వహణపై ప్రత్యక్ష ప్రభావం చూపే అంశమిది. గత వారంలో ఎన్నికల కమిషనర్లలో ఒకరు అరుణ్‌ గోయెల్‌ అకస్మాత్తుగా రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో, ఇక ఎన్నికల కమిషన్‌లో మిగిలిన ఏకైక వ్యక్తి ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సిఇసి) రాజీవ్‌ కుమార్‌. ఎన్నికల కమిషన్‌లోని మూడవ సభ్యుడు కొన్ని మాసాల క్రితమే రిటైరయ్యారు.
అరుణ్‌ గోయెల్‌ నియామకం కూడా 2022 నవంబరులో చాలా హడావిడిగా జరిగింది. ఆనాడు ఈ చర్యను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ప్రశ్నించింది. ఎన్నికల కమిషనర్ల నియామకపు ప్రక్రియను తటస్థ స్వతంత్ర కమిటీ చేపట్టాలంటూ దాఖలైన పిటిషన్‌ విచారణ సందర్భంగా రాజ్యాంగ ధర్మాసనం ఈ చర్యను ప్రశ్నించింది.అరుణ్‌ గోయెల్‌ రాజీనామాకు వాస్తవ కారణమేంటన్నది స్పష్టంగా తెలియరాలేదు. కానీ, దీనివల్ల కమిషన్‌లో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ), ప్రధాన మంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత ఈ ముగ్గురితో కూడిన కమిటీ సిఫార్సుల ప్రాతిపదికన సి.ఇ.సిలు, ఇ.సిల నియామకం జరగాలని గతేడాది మార్చిలో సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. ప్రభుత్వం జోక్యం చేసుకోవడం, అలాగే అన్ని రూపాల్లో లొంగదీసుకోవడాలకు దూరంగా వుండడం ద్వారా స్వేచ్ఛగా, సక్రమంగా ఎన్నికలను నిర్వహించే కర్తవ్యాన్ని ఇ.సి.ఐ నిర్వర్తించడానికి వీలుగా ఇది అవసరమని కోర్టు అభిప్రాయపడింది.
అయితే, సుప్రీంకోర్టు రూలింగ్‌ తర్వాత, సి.ఇ.సి, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకాలు, పని పరిస్థితు లకు సంబంధించి మోడీ ప్రభుత్వం పార్లమెంట్‌లో ఒక బిల్లును తీసుకువచ్చింది. ఈ చర్యతో సెలక్షన్‌ కమిటీ నుండి సిజెఐ తొలగించ బడ్డారు. దానికి బదులుగా, ప్రధాని నామినేట్‌ చేసే కేంద్ర మంత్రి కమిటీలో వుంటారు. ఆ రకంగా, ముగ్గురు సభ్యులుగల కమిటీలో ప్రభుత్వానికే మెజారిటీ వుండడంతో సుప్రీంకోర్టు సిఫార్సు ప్రయోజనాన్ని ఇది దెబ్బతీస్తోంది.ఇద్దరు ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేసేందుకు మార్చి 14న త్రిసభ్య కమిటీ సమావేశమైంది. ఊహిం చినట్లుగానే, ప్రభుత్వం సూచించిన ఇద్దరే సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధూ, జ్ఞానేష్‌ కుమార్‌ ఎంపికయ్యారు. సిఇసితో వీరిద్దరు కలిసి త్వరలో ప్రకటించబోయే లోక్‌సభ ఎన్నికలను నిర్వహించనున్నారు. రాజ్యాంగ సంస్థల స్వేచ్ఛా స్వాతంత్య్రాలే ఒక పద్ధతి ప్రకారం తుడిచిపెట్టబడుతున్న నేపథ్యంలో స్వతంత్ర సంస్థగా వుండాల్సిన ఎన్నికల కమిషన్‌ విధ్వంసం అరిష్టమే. ఇది పార్లమెంటరీ ప్రజాస్వా మ్యానికి తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తుం దననడంలో ఎలాంటి సందేహం లేదు.
(మార్చి 14 ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం)