– ప్రత్యర్థులపై దర్యాప్తు ఏజెన్సీలను ఉసిగొల్పుతున్న కేంద్రం
– సొంత నేతలపై ఆరోపణలు ఉన్నా చర్యలు సున్నా
– సార్వత్రిక పోరుకు మోడీ బృందం పాలి’ట్రిక్స్’
బీజేపీ నేతలు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని అక్రమాలకు పాల్పడినా వారి జోలికి ఏ దర్యాప్తు సంస్థ వెళ్లదు. యడ్యూరప్ప రూ.45 వేల కోట్ల నిధులు గోల్‌మాల్ చేశారని స్వయానా ఆ పార్టీ ఎమ్మెల్యే ఆరోపించినా విచారణ జరపరు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన నేతల్ని పల్లెత్తు మాట అనరు. రైతులను కారుతో తొక్కించి ప్రాణాలు తీసినా ఎలాంటి చర్యలు తీసుకోరు. అదే ప్రత్యర్థి పార్టీల వారైతే? దర్యాప్తు ఏజెన్సీలను పురమాయించి పాలి’ట్రిక్స్’ చేయటానికి మోడీ బృందం రెడీ అయిపోతుంది. ఇంతకీ ఎన్నికలకు ముందు ఎవర్ని జైలుకు పంపుతారు..? దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులేమిటి? ఓసారి పరిశీలిద్దాం..
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దర్యాప్తు సంస్థల దాడులు మరోసారి తెరపైకి రాబోతున్నాయని కేంద్రంలోని బీజేపీ సర్కార్ సంకేతాలిస్తోంది. నెహ్రూ-గాంధీ, లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబాలను, పలువురు ప్రతిపక్ష నేతలను వెంటాడి వేధిస్తున్నారు. వారిలో కొందరికి జైలు జీవితం తప్పదని లీకులు ఇస్తునారు. జార్ఖండ్, ఢిల్లీ ముఖ్యమంత్రులు హేమంత్ సొరెన్, అరవింద్ కేజ్రీవాల్‌పై కూడా ఏజెన్సీల ఉచ్చు వేగంగా బిగుసుకుంటోంది. దర్యాప్తు సంస్థల డేగకన్ను పడిన నేతల్లో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కూడా ఉన్నారు.
లాలూ కుటుంబంపై…
ఉద్యోగానికి బదులుగా భూమి కేసులో లాలూతో పాటు ఆయన కుమారుడు తేజస్వి యాదవ్, భార్య రబ్రీదేవిపై సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. తండ్రీ కొడుకులకు ఈడీ తాజాగా సమన్లు సైతం జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి లాలూ ప్రసాద్ కుటుంబానికి చెందిన రూ.6 కోట్ల విలువైన ఆస్తులను ఇటీవలే జప్తు చేసింది. ఈ కేసులో సీబీఐ కూడా త్వరలోనే మరో ఛార్జిషీటు దాఖలు చేస్తుందని సమాచారం. ఐఆర్‌సీటీసీ ఉదంతంలో కూడా లాలూ కుటుంబంపై కేసు బనాయించారు. అయితే న్యాయమూర్తి బదిలీ కావడంతో విచారణ ఇంకా ప్రారంభం కాలేదు. ఈ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై గత మార్చిలో లాలూ కుటుంబ సభ్యుల నివాసాలపై ఈడీ దాడులు చేసింది. 2017 జూలైలో ఐఆర్‌సీటీసీ హోటళ్ల టెండర్ నిబంధనలను మార్చారంటూ లాలూ కుటుంబంపై సీబీఐ కేసు నమోదు చేసింది.
వీరిపై కూడా…
బీఆర్‌ఎస్ నేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కుమార్తె కవితను ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ ఇప్పటికే మూడుసార్లు ప్రశ్నించింది. కాగా ఉపాధ్యాయుల నియామక కుంభకోణం, బొగ్గు అక్రమ రవాణా కేసులలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ, ఆయన భార్య రుజీనా బెనర్జీలను ఈడీ ప్రశ్నించింది. ఇక లోక్‌సభ నుండి ఇటీవలే సస్పెన్షన్‌కు గురైన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌ను మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు వెంటాడుతోంది. బఘేల్ సీఎంగా ఉన్న సమయంలో గత సెప్టెంబరులో ఆయన రాజకీయ సలహాదారు వినోద్ వర్మ
కుటుంబ సభ్యు లను ఈడీ విచారిం చింది. ఇక అక్రమ మైనింగ్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలకు సంబంధించి జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌పై కూడా కేసు నమోదైంది. అక్రమ ఆస్తుల కేసులో జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహుకు శిక్ష పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్‌లో అక్రమాలకు సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణలపై రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో అబ్దుల్లా ఆస్తులను అటాచ్ చేశారు.
కేజ్రీవాల్ జైలుకు వెళతారా?
ఎక్సైజ్ పాలసీ కేసులో ఆప్‌కు చెందిన ఇద్దరు సీనియర్ నేతలు… ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఇప్పటికే జైలులో ఉన్నారు. తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీ వాల్‌కు కూడా ఈడీ మూడుసార్లు సమన్లు జారీ చేసింది. అయితే ఆయన విచారణకు హాజరయ్యేందుకు నిరాకరించారు. తనకు ఇచ్చిన సమన్లు రాజకీయ ప్రేరేపితం, చట్టవిరుద్ధం అని విమర్శించారు. అమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని కూడా ఈ కేసులో ఇరికించాలని దర్యాప్తు సంస్థలు భావిస్తే ఆ పార్టీ నేతలకు మరిన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఈ కేసులో ఆప్‌ని కూడా నిందితుడిగా చేర్చాలని దర్యాప్తు సంస్థలు యోచిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ దాఖలు చేసిన అనుబంధ ఛార్జి షీట్‌ను స్థానిక కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
పంజరంలో చిలుకలు
పంజరంలో చిలుకలుగా మారిన దర్యాప్తు సంస్థలను మోడీ ప్రభుత్వం రాజకీయ అవసరాలకు వాడుకుంటోం దన్న విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. ఓ వైపు తమ నేతలంతా మిస్టర్ క్లీన్‌లే అన్నట్టు ఫోజులిస్తూ మరోవైపు ప్రత్యర్థి పార్టీల నాయ కులను లక్ష్యంగా చేసు కొని వారిని వివిధ కేసుల్లో ఇరికించి వేధిం చాలని మోడీ బృందం భావిస్తోంది. అయితే బీజేపీ మత రాజకీయాలు, రాజకీయ ప్రత్యర్థులపై జరుపుతున్న వేధిం పులను విజ్ఞులైన ప్రజలు గమనిస్తూనే ఉన్నారని పరిశీలకులు వ్యాఖ్యానించారు.
ఇబ్బందుల్లో గాంధీ కుటుంబం
కాంగ్రెస్ యాజ మాన్యంలోని యంగ్ ఇండియా లిమిటెడ్ నడిపిన నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణలపై విచారణ జరుపుతున్న ఈడీ, రూ.751.9 కోట్ల ఆస్తులను తాత్కాలికంగా అటాచ్ చేసింది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీని గత జూన్, జులై నెలల్లో మూడుసార్లు దాదాపు 12 గంటల పాటు విచారించింది. అంతకుముందే రాహుల్ గాంధీని కూడా జూలైలో ఐదు సందర్భాలలో 50 గంటలకు పైగా ప్రశ్నించింది. ఈ కేసులో బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి ఫిర్యాదు మేరకు 2013లో ఆదాయ పన్ను శాఖ విచారణ ప్రారంభించింది. బికనీర్ భూముల కొనుగోలు కేసులో సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాపై విచారణ కొనసాగుతోంది. వాద్రా, అతని తల్లిని దర్యాప్తు సంస్థ 2019లో ప్రశ్నించింది. తాజాగా ప్రియాంక గాంధీపై కూడా ఈడీ కేసు నమోదు చేసింది.