– తమకే కావాలని ఎమ్మెల్యేల పట్టు
– రెండో మాటగా మహేశ్వర్‌రెడ్డి వైపే ఎక్కువ మంది మొగ్గు!
– అభిప్రాయాలు సేకరించిన కిషన్‌రెడ్డి, తరుణ్‌చుగ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గత అసెంబ్లీలోనే కాదు..ఈసారీ ఎల్పీ నేత ఎన్నిక బీజేపీ నాయకత్వానికి కత్తిమీద సాముగా మారింది. ఆయా సామాజిక, రాజకీయ అంశాలను పరిగణనలోకి తమకే ఆ పదవి ఇవ్వాలని ఎమ్మెల్యేలు ఎవ్వరికి వారు ఫైరవీలు చేసుకుంటుండటంతో ఎన్నిక ఆ పార్టీకి మరింత తలనొప్పిగా మారింది. కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల గడుస్తున్నా..అన్ని పార్టీలూ తమ ఎల్పీనేతను ప్రకటించినా బీజేపీ మాత్రం ఇంకా నాన్చుడు ధోరణినే అవలంబిస్తున్నది. ఈ అంశం సాగదీసే కొద్దీ మరింత జఠిలమవుతున్నది. ఎమ్మెల్యేల ఒత్తిడితో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వారితో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి, రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్‌చుగ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్యేల నుంచి విడివిడిగా ఎవరుంటే బాగుంటుంది? వారే ఎందుకు? ఫలానా నేత అయితే ఎలా ఉంటుంది? అనే పద్ధతిలో సమాచారాన్ని సేకరించారు. అందులోనూ ఆ పార్టీకి స్పష్టత రాలేదని తెలిసింది. నేత ఎన్నికపై ఒక్కో ఎమ్మెల్యే ఒక్కో అభిప్రాయం చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. అయితే, ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మహేశ్వర్‌రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. వెంకట రమణారెడ్డిని చేస్తే ఎలా ఉంటుంది? అని తరుణ్‌చుగ్ అడగ్గా ఎమ్మెల్యేలు సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. బీసీ కేటగిరీలో తనకు అవకాశమివ్వాలని పాయల్ శంకర్ కోరినట్టు తెలిసింది. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో చర్చించిన తర్వాత ఎల్పీ లీడర్‌ను ప్రకటిస్తామని ఎమ్మెల్యేలకు తరుణ్‌చుగ్ నచ్చజెప్పినట్టు సమాచారం. మొదట రాజాసింగ్‌ను శాసనసభా పక్షనేతగా చేయాలని అధిష్టానం భావించినప్పటికీ ఆయన దూకుడు, తెలుగు భాషపై పట్టులేకపోవడం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని వెనక్కి తగ్గినట్టు తెలిసింది. దీనిపై రాజాసింగ్ అభిమానులు పార్టీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ రాజాసింగ్ సూచించిన వారికి కాకుండా ఆయనకు వ్యతిరేకంగా పనిచేసేవారిని కార్పొరేటర్ అభ్యర్థులుగా నిలిపారనీ, ఇప్పుడు ఆయనకు ఎల్పీ నేత పదవి దక్కకుండా పార్టీలోని పెద్ద తలకాయలు అడ్డుపడుతున్నాయని వారు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.