జిల్లా అధికారులు పోలింగ్ కు  సిద్ధంగా ఉండాలి: ఎన్నికల అధికారి వికాస్ రాజ్

– వేసవి దృష్ట్యా అన్ని ఏర్పాట్లు చేయాలి 
– డబ్బు  పంపిణీ  పై ప్రత్యేక నిఘా ఉంచాలి
– పోలింగ్ రోజు కేంద్రాల పరిధిలో 144వ సెక్షన్ విధింపు
– ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
పార్లమెంట్  ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతున్నందున జిల్లా ఎన్నికల అధికారులు పోలింగ్ కు సిద్దంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. శుక్రవారం అయన హైదరాబాద్ నుండి పార్లమెంట్ ఎన్నికలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ కు 78 గంటల ముందు,48 గంటల ముందు చేయవలసిన అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలపై దృష్టి సారించాలన్నారు. పార్లమెంటు ఎన్నికలలో స్ట్రాంగ్ రూమ్ ల సీలింగ్, రిపోర్టులను సకాలంలో పంపించడం పై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని తెలిపారు. చివరి నిమిషంలో వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని, ఎప్పటికప్పుడే వాటికి తీసుకున్న చర్యలపై సమాధానాలు పంపించాలని, అలాగే 1950 టోల్ ఫ్రీ నెంబర్ కు వచ్చే ఫిర్యాదులపై సైతం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.వేసవిని దృష్టిలో ఉంచుకుని పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు, టాయిలెట్లు, సిబ్బందికి భోజనం సైతం ఏర్పాటు చేయాలన్నారు. చివరి సమయంలో పార్టీలు, అభ్యర్థులు మద్యం డబ్బు వంటివి పంపిణీ చేయకుండా  వాటిపై ప్రత్యేక నిఘా ఉంచాలని, పోలింగ్ కేంద్రాలలో కనీస సౌకర్యాలు, పోలింగ్ రోజు కేంద్రాల పరిధిలో  144వ సెక్షన్ విధింపు , 48 గంటల ముందునుండి ఎలాంటి లౌడ్ స్పీకర్లకు అనుమతించవద్దని, ఎం సి ఎం సి ద్వారా మంజూరు చేసే రాజకీయ ప్రకటనల అనుమతులు తక్షణం జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, మోడల్ పోలింగ్ కేంద్రాలు, వుమెన్ పోలింగ్ కేంద్రాలు తదితర అంశాలకు సంబంధించిన ఫోటోలను శనివారం నాటికి పంపించాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అడిషనల్ సీఈవోలు సర్ఫరాజ్   అహ్మద్,లోకేష్ కుమార్ లు  పలు అంశాలపై సూచనలు ఇవ్వగా, జిల్లా నుండి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన,రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్పెషల్ కలెక్టర్, పార్లమెంట్ ఎన్నికల డిప్యూటీఆర్ఓ నటరాజ్, డిఆర్ఓ రాజ్యలక్ష్మి, ఆర్డీవో రవికుమార్, జిల్లా పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి శ్రీదేవి, మాన్ పవర్  మేనేజ్మెంట్ నోడల్ అధికారి డిఆర్డిఓ నాగిరెడ్డి, జిల్లా ఇన్ఫర్మేటిక్ అధికారి గణపతిరావు తదితరులు పాల్గొన్నారు.