రుణమాఫీ, రైతు భరోసా పై కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీలను నిలబెట్టుకోవాలి…

–  తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాటూరి బాలరాజు గౌడ్
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల్లో రైతాంగానికి  రైతు భరోసా ఏటా ఎకరాకు రూ”15 వేలు ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాటూరి బాలరాజు గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం రోజున భువనగిరి మండలం బస్వాపురంలో రైతు సంఘం సభ్యత్వం చేర్పింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న మాటూరి బాలరాజు గౌడ్ మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించకపోవడం పెరుగుతున్న ఎరువుల పురుగు మందుల ధరలు , అప్పుల భారంతో రైతుల ఆత్మహత్యలకు కారణం అవుతుందని  ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ కమిషన్ పంట ఉత్పత్తి ఖర్చుకు 50% అదనంగా కలిపి కనీస మద్దతు ధరల చట్టం చేయాలని సిఫారసు చేశారని రైతుల ఆత్మహత్యల నివారణకు అప్పటి బి ఆర్ ఎస్ ప్రభుత్వం రైతుబంధు అమలు చేసిందని పేర్కొన్నారు. రైతుల ఓట్లు కొల్లగొట్టడానికి కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో రైతుబంధు పేరు మార్చి రైతు భరోసా ఎకరానికి ఏటా రూ”15వేలు ఇస్తామని వాగ్దానం చేసిందన్నారు. కాంగ్రెస్ సర్కార్ గద్దెనెక్కి ఏడాది గడిచినా వానాకాలం సీజన్ దాటిపోయిందని 2 పంటలకు ఎకరాకు ఏటా రూ”15వేలు వెంటనే రైతులకు అందించి చిత్తశుద్ధినిరూపించుకోవాలని కోరారు. రుణమాఫీ ఏటా 2లక్షలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం  4 విడతలుగా  25,32,067 మంది రైతులకు రూ.20,616,22 కోట్లు విడుదల చేశారు. 31 వేల కోట్లు అవసరమని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటికి 60 శాతం మాత్రమే విడుదల చేశారని ఇంకా 18 లక్షలమంది రైతులకు 10వేల కోట్లు రైతు రుణమాఫీ నిధులు విడుదల చేసి,  రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.  రైతులకు పంటల బోనస్ క్వింటాకు వరికి రూ.500  మొక్కజొన్న రూ.330 కందులకు రూ.400 సోయాబీన్ రూ.350 పత్తి రూ.475 , జొన్నలు రూ.292 బోనస్ ప్రభుత్వం ప్రకటించిన విధంగా అమలు చేయాలని కోరారు. రైతుల హక్కుల సాధనకు రైతు సంఘంలో చేరి పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మాజీ డివిజన్ కార్యదర్శి రాసాల వెంకటేశం జిల్లా నాయకులు మచ్చ భాస్కర్ పులి లక్ష్మీనరసయ్య, ఉడుత రామచంద్రయ్య, రాసాల పెంటయ్య, ఉడుత రాఘవులు, ఉడుత వెంకటేశం, బొజ్జ అంజయ్య, రాసాల రాజ మల్లయ్య, వనగంటి బాల నరసింహ, రాసాల బిక్షపతి, పులి రాంచందర్, కస్తూరి సత్తయ్య, రాంపల్లి రమేష్ , రాంపల్లి సత్తయ్య లు పాల్గొన్నారు.