10న ఎన్నికల షెడ్యూల్‌?

Election schedule on 10?– తెలంగాణతోపాటే రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరంలకు..
– ప్రధాని హడావిడి పర్యటనలు అందుకే
– సీఎం పీఆర్సీ ప్రకటనా ఆ కోవలోనిదే
– వేగాన్నందుకున్న ఎన్నికల సన్నాహాలు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం గంట మోగించనుంది. ఈనెల రెండోవారంలో ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేసింది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈనెల 10న ఐదు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్‌ వెలువడనుంది. ఆ తర్వాతే రాష్ట్రాల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్టు తెలిసింది. కొత్తగా ప్రవేశపెట్టనున్న రాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రక్రియ ఏదైనా మిగిలి ఉంటే, ఈనెల 14లోపు పూర్తిచేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించినట్టు సమాచారం. నిజానికి పాఠశాలల్లో దసరా రోజున ప్రారంభించాలను కున్న ‘సీఎం ఆల్ఫాహార పథకం’ ఈనెల ఆరునే శ్రీకారం చుడుతున్నారు. ఈనేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్‌ 14న రానుందనే ఉహాగానాలు కూడా వస్తున్నాయి. కేంద్రం ఎన్నికల సంఘం చీఫ్‌ కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ బృందం ఇప్పటికే కసరత్తు పూర్తిచేసినట్టు సమాచారం. తెలంగాణ(119 సీట్లు)తోపాటు రాజస్థాన్‌(200), మిజోరం(40), ఛత్తీస్‌గఢ్‌(90), మధ్యప్రదేశ్‌(230)లలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఐదు రాష్ట్రాలకు ఒకేసారి షెడ్యూల్‌ విడుదల చేసేందుకు కేంద్రం ఎన్నికల సంఘం సమాయత్తమైంది. ఈనేపథ్యంలోనే ప్రధాని మోడీ ఆయా రాష్ట్రాల్లో వేగంగా పర్యటిస్తూ హామీలు గుప్పిస్తున్నారు. కొత్త సీసాలో పాతసారా లాగా పాత హామీలను మళ్లీ కొత్తగా ఇస్తున్నారు. గతంలో ప్రకటించినవే మళ్లీ చెప్పడం గమనార్హం. మహబూబ్‌నగర్‌ పర్యటన పూర్తికాగానే వెంటనే పుసుపు బోర్డు మంజూరు పేరుతో నిజామాబాద్‌ జిల్లా పర్యటన పెట్టుకున్నారు. అలాగే తెలంగాణ సీఎం సోమవారం ఉద్యోగులకు ప్రకటించిన పీఆర్సీ, ఐఆర్‌ కూడా ఆకోవలోనిదేనని సమాచారం. పీఆర్సీ ప్రకటనతో సంతోషించిన ఉద్యోగులు, ఐఆర్‌ పై పెదవి విరుస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రం కంటే దారుణంగా ప్రకటించారని అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఐఆర్‌పై ఆసంతృప్తి వ్యక్తం చేశాయి. ఇదిలావుండగా ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన బందం మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకున్నది.
తెలంగాణకు వచ్చిన చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ (సీఈసీ) రాజీవ్‌కుమార్‌ సారథ్యంలోని 17 మంది అధికారుల బందం హోటల్‌ తాజ్‌కష్ణాలో బసచేసింది. అక్కడే సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నది. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో సమావేశం కానుంది. కాగా, సీఈసీ బందం రాకతో అతిత్వరలో ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కానున్నట్టు స్పష్టమైంది. రాష్ట్రానికి విచ్చేసిన ఎన్నికల అధికారుల బందంలో ఎలక్షన్‌ కమిషనర్‌ అనూప్‌చంద్ర పాండే, అరుణ్‌ గోయల్‌, సీనియర్‌ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీశ్‌కుమార్‌ వ్యాస్‌, డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్లు అజరు భాడూ, హిర్దేశ్‌కుమార్‌, ఆర్కే గుప్తా, మనోజ్‌కుమార్‌ సాహూ తదితరులు ఉన్నారు.
సీఈసీ బందంలోని అధికారులు ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు, సన్నద్ధతపై ఎన్నికల నిర్వహణ అధికారులు, సంస్థలతో సమీక్షిస్తారు. జిల్లా ఎన్నికల అధికారులు (డీఈఓలు), ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లతో సమావేశమవుతారు. ప్రభుత్వపరంగా అందిస్తున్న సహకారంపై చర్చించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతోనూ ఈ బందం ప్రత్యేకంగా సమావేశమవుతుంది. పర్యటన చివరిరోజున పత్రికా సమావేశం నిర్వహించి వివరాలు చెప్పనున్నారు. కాగా మొత్తం ఐదు రాష్ట్రాల్లో 619 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల ఎన్నికల గడువు 2014, జనవరి 24తో ముగియనుండగా, ఒక్క మిజోరంలో మాత్రం ఈ ఏడాది డిసెంబరు 17 వరకే ఉంది. అందుకే ఒకేసారి ఐదు రాష్ట్రాల ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తున్నది.
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించండి
– బోగస్‌ ఓట్లు తొలగించాలి : కేంద్ర ఎన్నికల కమిషన్‌కు రాజకీయ పార్టీల విజ్ఞప్తి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో త్వరలో జరిగే శాసనసభ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని వివిధ రాజకీయ పార్టీలు కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కోరాయి. ఎన్నికల్లో నగదు, మద్యం పంపిణీని అరికట్టేలా గట్టి నిఘా ఉంచాలనీ, దొంగ ఓట్ల తొలగింపు, కొత్త ఓట్ల చేర్పు పారదర్శకంగా జరిగేలా అధికారులను అప్రమత్తంచేయాలని ఈసీకి విజ్ఞప్తి చేశాయి. రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ నేతృత్వంలో ఎన్నికల కమిషనర్లు అనుప్‌చంద్ర, అరుణ్‌గోయల్‌, ఇతర అధికారులు మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్‌ చేరుకున్నారు. సీఈసీ బృందం మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనుంది. మొదటి రోజు మంగళవారం నగరంలోని ఓ ప్రముఖ హోటల్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమైంది. గడువు ముగిసేలోగా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు సహకరించాలని సీఈసీి రాజీవ్‌ కుమార్‌ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ చేపట్టిన చర్యలను వివరించారు. అనంతరం రాజకీయ పార్టీల ప్రతినిధులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. క్షేత్రస్థాయిలో సమస్యలను ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు సీఈసీి బృందం దృష్టికి తీసుకెళ్లారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో నిస్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ నాయకులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, శ్రీధర్‌ బాబు, ఫిరోజ్‌ఖాన్‌ ఈసీి బృందానికి సూచించారు. బోగస్‌ ఓట్లు, అధికార దుర్వినియోగం, నగదు, మద్యం పంపిణీ..తదితర అంశాలను ఇప్పటికే ఈసీ దృష్టికి తీసుకెళ్లామనీ, వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తుందని తెలిసి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాలను తీసుకొచ్చి ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తుందని దీన్ని అరికట్టాలని సీఈసీిని కోరారు. హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో ఓటు నమోదు ప్రక్రీయ సరిగా జరగలేదనీ, అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారులపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నదని బీజేపీ ప్రతినిధులు ఓం పాఠక్‌, మర్రి శశిధర్‌ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఇతర రాష్ట్రాల అధికారులకు ఎన్నికల విధులు అప్పగించాలని కోరారు. బోగస్‌ ఓట్లను తొలగించాలనీ, ఎన్నికల పరిశీలకులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈసీకి సూచించారు. ఎన్నికల్లో నగదు ఏరులై పారుతోందని, దాన్ని కట్టడి చేసేందుకు ఈసీ అధిక ప్రాధాన్యతనివ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డీజీ నర్సింహారావు, టి.జ్యోతి, నంద్యాల నర్సింహారెడ్డి ఈసీకిి సూచించారు. హుజూరాబాద్‌, మునుగోడు ఉప ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేశారని గుర్తు చేశారు. దీనిపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు కులం, మతం పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నాయనీ, వాటిపై సీరియస్‌గా వ్యవహరించాలని బీఎస్పీ నేత విజయసూర్య క్షత్రియ విజ్ఞప్తి చేశారు. డ్రగ్‌ మాఫియా, లిక్కర్‌ మాఫియాలపై ఉక్కుపాదం మోపాలన్నారు. బోగస్‌ ఓట్లను కట్టడి చేయాలని ఆప్‌ నేత సుధాకర్‌ కోరారు. ఓటర్ల నమోదులో అవకతవకలను ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. తమపార్టీ ఎన్నికల గుర్తు కారును పోలిన ట్రక్‌ గుర్తుల వల్ల తమకు తీవ్ర నష్టం జరుగుతున్నదనీ, దాన్ని ఎవరికీ కేటాయించొద్దని బీఆర్‌ఎస్‌ నేత వినోద్‌ కుమార్‌ ఈసీని కోరారు. సోషల్‌మీడియాలో వ్యక్తిగత విమర్శలు చేస్తున్నవారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. ఎన్నికల వ్యయాన్ని పెంచాలనీ, రిటర్నింగ్‌ అధికారులకు పూర్తి అధికారాలివ్వాలని కోరారు. బోగస్‌ ఓట్ల తొలగింపులో అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలనీ, స్థానికంగా ఉన్న ఓటర్లకు నష్టం జరగకుండా చూడాలని ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఒవైసీ సీఈసీ బృందాన్ని కోరారు. ఎన్నికలను నిస్పక్షపాతంగా నిర్వహించాలని టీడీపీి, వైఎస్సార్‌టీపీ ప్రతినిధులు ఈసీకి విజ్ఞప్తి చేశాయి.
ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలతో సీఈసీ సమావేశం
రాజకీయ పార్టీలతో సమావేశానంతరం సీఈసీ బృందం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీల అధికారులతో సమావేశమయింది. త్వరలో ఎన్నికల షెడ్యూల్‌ వస్తున్న నేపథ్యంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయా ఏజెన్సీలను సీఈసీ రాజీవ్‌కుమార్‌ ఆదేశించారు. నిస్పక్షపాతంగా నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలని స్పష్టంచేశారు. సమావేశంలో పోలీస్‌, ఎక్సైజ్‌, సీబీడీటీ, ఫైనాన్షియల్‌ ఇంటెలిజెన్స్‌, ఎస్‌ఎల్‌బీసీ, ఆర్‌బీఐ,డీఆర్‌ఐ, ఈడీ, ఆర్‌పీఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, ఎఎఐ, ఏవియేషన్‌ కార్పోరేషన్‌, రవాణా,అటవీ, పోస్టల్‌ శాఖల అధికారులు పాల్గొన్నారు.