”వసంత రుతువు వచ్చిందో లేదో ఆ కోకిల కంఠం ఎలా పేలిపోతోందో చూడు – మాటలు, పాటలు నినాద మైదానాల మీద రాళ్లై, చెప్పులై రాలుతున్నాయి, మిత్రమా! ఒక్క క్షణం మర్చిపోదాం ప్రజల కన్నీళ్లు. వసంతాలు వస్తున్నాయ్, వసంతాలు పోతున్నాయ్. ఒక్క పువ్వెడు వసంతం కోసం చెట్లు ఆకులన్నీ రాల్చుకుంటున్నాయి” ఇది వసంతంపై శేషేంద్ర కవితాభాగం. పువ్వెడు వసంతం కోసం చెట్లన్నీ అకులు రాల్చుకున్నట్లుగానే, ఇక్కడ ప్రజలు ఆశల్ని రాల్చు కుంటున్నారు. నిజంగా బతుకు చెట్టుపైకి వసంతం వస్తుందా! వసంతం బతుకులోకి వచ్చినా రాకున్నా రుతువు మాత్రం వచ్చిపోతుంది. కోయిలలు ఎదురుచూసే చిగుర్లకాలం వచ్చేస్తోంది. ఇక రాగమెత్తేందుకు గొంతులు సవరించుకోవాల్సిందే. వసంత రుతువు తోడుగానే మన దేశంలో ఎన్నికల రుతువూ సమీపిస్తున్నది. మరి రానున్న ఎన్నికల రుతువులో నాయక కోయిలలు ఏ రాగం ఎత్తుకుంటాయి! ఏ పాటలు పాడి వినిపిస్తాయి? చూడాలి.
పాత ఆకులు రాలి కొత్త చివుళ్లు పుట్టుకొచ్చినట్లుగానే, మనుషుల్లోనూ కొత్త ఆశలు తలెత్తు తాయి. కోర్కెలు విచ్చుకుంటాయి. దు:ఖపు కన్నీటితడిని తుడిచే చేయి ఏదైనా దరి చేరుతుం దనే ఎదురుచూపు, ఎన్నికల రుతువులో జనంలో మొలకెత్తుతుంది. అయితే నాయకుల రాగాలా పనలు సరిగా అర్థం చేసుకోకపోతే, ఏ రాగం వెనుక ఎవరి ప్రయోజనాలున్నాయో అవగాహన కాకపోతే, రుతువంతా అధికారం చుట్టే తిరిగిపోతుంది. రాలిన ఆశలతో జనం మిగులుతారు. వసంతం తర్వాత వచ్చే రుతువు గ్రీష్మమే. ఎండలు మండుతాయి. పచ్చదనపు సంపద సమంగా సరిగా విరియకపోతే గ్రీష్మాన్ని తట్టుకోవడం కష్టమైపోతుంది. చురుకుమని, కాలు నేలపై పెట్టనీయనితనంలా గ్రీష్మ ప్రతాపం ఉంటుంది. మన దేశపు ప్రజాస్వామ్య ఎన్నికల వసంత రుతువు ఆరంభాన ఎలాంటి అడుగులు పడతాయో అనేదాన్ని బట్టి, గ్రీష్మాన్ని ఎంత భరించాల్సి ఉంటుందో తెలుస్తుంది.
ఎన్నికల రుతుస్వామ్య గీతాలాపనలో మనం మేనుమరిచి, చిగురులపై భ్రమల పా టల తాదాత్మ్యంలో పడి కలలను ధారపోస్తే, ఇక మన భవిత గ్రీష్మం చండ్రనిప్పులు కురి పించడం ఖాయం. వసంతం రాకుండానే గ్రీష్మ ప్రతా పాన్ని గురించి ఇప్పుడెందుకు చర్చ అని సాధారణంగా అనుకుంటాం, కానీ అప్పుడే ఎన్నికలలో భ్రమల గీతాల సీతా రామం మొదలయ్యింది. జాగ్రత్తగా గమనించాలి. లేకుంటే ఎన్నికలానంతరం వడ్డింపుల మంట లకు విలవిల్లాడి పోతాము. ఇప్పుడు ఎన్నికల కోయిల చెట్ల (ప్రజల)పై నుండి గొంతెత్త డంలేదు. రాముని కోవెలపై నుండి మాత్రమే రాగమెత్తుతున్నది. పచ్చదనం, చిగుర్లు అవ సరంలేని దివ్యామృత సేవనంతో మునిగిపోయి మనల్నీ మునగ మంటున్నది. అమృతం మనకిస్తే గ్రోలుదాం సరే. మరి ఆకలి సంగతేమిటి? ఆలోచించాలి!
కొన్ని సత్యాలను కోవెలకీవల పరిశీలన చేయాలి. లేకుంటే మైకంలో వాస్తవాలు మరుగున పడిపోతాయి. ప్రపంచంలోనే అత్యధికమంది పేదలు భారతదేశంలో వున్నా రన్నది ఆక్స్‌ఫాం నివేదిక చెప్పిన సత్యం. వివరంగా చెప్పు కుంటే 2018 నుండి 2022 మధ్య పేదల సంఖ్య 190 మిలియన్ల నుంచి 350 మిలియన్లకు పెరిగింది. పేదల ఆకలి పెరిగింది. కేవలం 2022లో మరణించిన బాలలలో 65 శాతం మంది పేదరికం, పోషకా హారలోపం, ఆకలితో మరణించారని ఆ నివేదిక స్పష్టపరుస్తోంది. అదేమీ ప్రతిపక్షాల సం స్థ కాదు, అంతర్జాతీయసంస్థ. అది చెప్పిందేమంటే భారతదేశంలో ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరిగాయని, ఈ దేశ సంపదలో 60 శాతం సంపద కేవలం ఐదు శాతం మంది సంపన్నుల చేతులలో కేంద్రీకృతమై ఉన్నదని తేల్చి చెప్పింది. ఇక 50 శాతం మంది చేతుల్లో కేవలం, మూడుశాతం సంపద మాత్రమే ఉందన్నది. కరోనా కాలంలోనూ మన దేశంలోని లక్షల కోట్లాధీశులు పెరిగారు. ఇంకోవైపు పేదరికం పెరిగింది. మరి మన పాలక కోయిలలు ఎవరిపాట పాడుతున్నట్లు! లాభాలు దండుకున్న వారు కడుతున్న పన్నులకంటే, ప్రభుత్వానికి పేదలు, ఇతర ప్రజలు కడుతున్న పన్నులే అత్యధికమని నివేదిక చెబుతున్న వివరాలు.
ఈ దేశపు వృక్షంపై పచ్చదనానికి కారకులెవ్వరు? ఆ చివుళ్లను తిని రాగాలెత్తుతున్న కో యిల ఎవరికోసం గొంతెత్తుతున్నది? ఇది బాగా అర్థం చేసుకోవాలి. అందుకనే నాయక కోకిల చెట్లనొదిలి, గోపురంపై వాలింది. మన చూపులూ, ఆశలు, కలలు, అభ్యర్థనలు అన్ని గుడిగం టల హోరులోకి వెళ్లాలనేది వారి వ్యూహం. ఇక తమ శ్రీమంతుల పాటకు ఆటంకాలు రావనేది వారి ఆలోచన. అశేష జనవాహిని ఆ భ్రమాత్మక ఎన్నికల పాటల్ని అర్థంచేసుకుని, గొంతుకలెత్తాలి!