ఎలక్షన్‌ సబ్సిడీ

ఎలక్షన్‌ సబ్సిడీ

– వంట గ్యాస్‌ ధర రూ.100 తగ్గింపు
– ఎన్నికల ఎత్తుగడే అంటున్న ప్రతిపక్షం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎల్పీజీ సిలిండర్ల ధరను రూ. 100 తగ్గించినట్టు ప్రధాని మోడీ ప్రకటన చేశారు. దీనిపై ప్రతిపక్షాలు ఘాటుగా స్పందించాయి. మహిళా దినోత్సవం సందర్భంగా నారీ శక్తిని బలపరిచే క్రమంలో వంట గ్యాస్‌ ధరను సిలిండర్‌కు రూ.100 చొప్పున తగ్గించాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ప్రధాని మోడీ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. అయితే కేంద్రం నిర్ణయంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తూ ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయ ఎత్తుగడేనని, ఇది మోడీ సర్కార్‌ మోసపూరిత చర్యని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే ఆక్షేపించారు. గత తొమ్మిదేండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ గతంలో ఇలా ఎందుకు ఆలోచించలేదని ఆమె ప్రశ్నించారు. ఎన్నికలు ముంచుకొచ్చినప్పుడే వారికి గ్యాస్‌ ధరల భారం గుర్తుకువచ్చిందా? అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వ హయాంలో గ్యాస్‌ సిలిండర్‌ కేవలం రూ. 430 కే లభించేదని గుర్తు చేశారు. గత ఏడు నెలలుగా గ్యాస్‌ ధరలను ఎందుకు తగ్గించలేదని, ఎన్నికలకు ముందు ఇప్పుడే ఇలా ఎందుకు చేశారని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ సాకేత్‌ గోఖలే కేంద్రాన్ని నిలదీశారు.బీజేపీ తెలివైన పార్టీ అని, వారు రూ. 395 విలువైన సిలిండర్లను రూ. 1000కి విక్రయిస్తూ ఇప్పుడు ప్రధాని మోడీ దాన్ని రూ. 100 తగ్గించినట్లు ఆర్భాటంగా ప్రకటించారని కాంగ్రెస్‌ ప్రతినిధి సురేంద్ర రాజ్‌పుట్‌ వ్యాఖ్యానించారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యురాలు సాఘరికా ఘోష్‌ సైతం గ్యాస్‌ ధరల తగ్గింపు ప్రకటించిన సమయాన్ని తప్పుపట్టారు. గత కొన్ని నెలలుగా మహిళలు వంట గ్యాస్‌ భారాన్ని మోయలేకున్నారని, గ్లోబల్‌ మార్కెట్‌లో ధర తగ్గినా దేశీ మార్కెట్‌లో తగ్గించలేదని, ఇప్పుడు ఎన్నికల ముందు రూ.100 తగ్గించారని ఆమె పేర్కొన్నారు. భారత్‌కు ప్రధాన మంత్రి అవసరమని, ఎన్నికల మంత్రి అవసరం లేదని ఆమె దుయ్యబట్టారు.