షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు

Elections are as per schedule– రెండు, మూడు నెలల సమయమే ఉంది
– అక్టోబర్‌లో కేంద్ర బృందం రాక
– నిర్వహణకు చురుగ్గా ఏర్పాట్లు
– తొలిదశ ఈవీఎంల తనిఖీ పూర్తి
– రాష్ట్ర ఎన్నికల సీఈఓ వికాస్‌ రాజ్‌
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు. రెండు, మూడు నెలల సమయం మాత్రమే ఉందని వ్యాఖ్యానించారు.బీఆర్‌కే భవన్‌లో సాధారణ ఎన్నికల కోసం ఏర్పాటుచేసిన మీడియా సెంటర్‌ను సీఈవో శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి జిల్లాల్లో అధికారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 15 లక్షల మంది ఓటర్లుగా చేరారని చెప్పారు. ఇందులో ముఖ్యంగా యువత, మహిళా ఓటర్ల నమోదుపై దృష్టి పెట్టినట్టు వివరించారు. కొత్తగా 18 నుంచి 19 ఏండ్ల వయసున్న 6.99 లక్షల మంది యువ ఓటర్లను నమోదు చేయించినట్టు తెలిపారు. మహిళా ఓటర్ల సంఖ్య పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎన్నికల నిర్వహణ పారదర్శకంగా జరుగుతుందనీ, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శాంతిభద్రతల నిర్వహణ జరగనుందని అభిప్రాయపడ్డారు. అక్టోబర్‌ మూడు, నాలుగు, ఐదు తేదీల్లో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో పర్యటించనుందన్నారు. మొదటి దశ ఈవీఎంల తనిఖీ దాదాపు పూర్తయిందన్నారు. తుది ఓటర్ల జాబితా పూర్తయ్యాక జిల్లాల్లో సిబ్బందికి శిక్షణ ఇస్తామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఏజెన్సీలతో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. కేంద్ర, రాష్ట్రాల పరిధిలో 20 ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలు పనిచేయబోతున్నాయని అన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో అడ్రస్‌ మార్పులు, ఇతర సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయన్న ఆయన, ప్రత్యేక క్యాంపుల ద్వారా పరిష్కరిస్తామన్నారు. ఓటర్ల చేర్పింపు కార్యక్రమం త్వరలో పూర్తిచేస్తామన్నారు. వచ్చే నెలలో ఎన్నికలకు అవసరమైన డిస్ట్రీబ్యూషన్‌ కేంద్రాలు, స్ట్రాంగ్‌ రూములు, పోలింగ్‌ స్టేషన్లను పరిశీలిస్తామన్నారు. ప్రిసైడింగ్‌ అధికారులను గుర్తించడం, వారికి శిక్షణ ఇవ్వడం, పోలింగ్‌ స్టేషన్లు పరిశీలించి ఈసీఐ సూచనల ప్రకారం ఆయా ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాలు ఉన్నాయా? లేదా చూస్తామన్నారు. సౌకర్యాలు లేకుంటే ఏర్పాటు చేస్తామన్నారు. కౌంటింగ్‌ కేంద్రాలను గుర్తించడంతోపాటు కేంద్ర బలగాలకు వసతి, రవాణా సౌకర్యం, వారికి విధుల కేటాయింపు తదితర అంశాలపై దృష్టిసారించినట్టు తెలిపారు. బ్యాలెట్‌ పేపర్ల ప్రింటింగ్‌, ఈవీఎంల ర్యాండమైజేషన్‌ తదితర ఏర్పాట్లు, శిక్షణ కొసాగుతున్నాయని తెలిపారు.
అక్టోబరులో కేంద్ర ఎన్నికల బృందం రాక
అక్టోబరు మూడు, నాలుగు, ఐదు తేదీల్లో కేంద్ర ఎన్నికల బృందం రానుందని వికాస్‌రాజ్‌ తెలిపారు కేంద్ర బృందం రాష్ట్రంలోని రాజకీయ నాయకులు, సీఎస్‌, డీజీపీ, కలెక్టర్లతో సమావేశమవుతుందని చెప్పారు. జనవరి నుంచి ఇప్పటి వరకు 15 లక్షల కొత్త ఓటర్లు నమోదయ్యారనీ, 3.38 లక్షల మంది ఓట్లను రద్దుచేసినట్టు తెలిపారు. ఫారం-6, ఫారం-7, ఫారం-8లు 15 వేలకు పైగా వచ్చాయని వివరించారు. ఓట్ల నమోదు ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ఎన్నికల ప్రక్రియ చురుగ్గా సాగుతున్నదన్నారు. మీడియా సమావేశంలో అదనపు ఎన్నికల ప్రధానాధికారి లోకేశ్‌కుమార్‌, ఉప ఎన్నికల ప్రధానాధికారి సర్ఫరాజ్‌ అహ్మద్‌, సంయుక్త ఎన్నికల ప్రధానాధికారి సత్యవేణి, సమాచార శాఖ స్పెషల్‌ కమిషనర్‌ అశోక్‌రెడ్డి, మీడియా సెంటర్‌ ఇన్‌ఛార్జీ పాండురంగారావు పాల్గొన్నారు.