ఎండల్లో ఎన్నికలు

Elections in the sun– భానుడి భగభగల మధ్య నిర్వహణ ఎలా..?
– గరిష్ట ఉష్ణోగ్రతలు తప్పవంటున్న వాతావరణ విభాగం
– వడగాలుల తీవ్రతా అధికమే
– ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం
– స్పందించని ఈసీ అడ్వైజరీలతో కాలక్షేపం చేస్తున్న ఐఎండీ, ఎన్‌డీఎంఏ
మండు వేసవిలోనూ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారంలో తలమునకలై పోతున్నారు. ఓటర్లు సైతం ఎండను లెక్కచేయకుండా పెద్ద సంఖ్యలో రాజకీయ ర్యాలీలు, సభలకు హాజరవుతున్నారు. ఓటింగ్‌ రోజు అయితే పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరడం తప్పనిసరి. ఇవన్నీ ప్రమాదంతో కూడుకున్నవే. తీవ్రమైన వేసవి పరిస్థితుల్లో మన దేశం ఎన్నికలకు సిద్ధంగా ఉన్నదా అనేదే ఇక్కడ ప్రశ్న.
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ నెల19తో ప్రారంభమయ్యే ఓట్ల పండుగ జూన్‌ 1వ తేదీ వరకూ కొనసాగుతుంది. లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడూ వేసవిలోనే వస్తుంటాయి. అయితే ఈ ఏడాది సగటు ఉష్ణోగ్రతల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఈ కాలంలో 10 నుండి 20 రోజుల పాటు వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రతి వేసవిలో నాలుగు నుండి ఎనిమిది రోజుల పాటు మాత్రమే వడగాలులు వీస్తుంటాయి. ఈసారి ఆ ప్రమాదం మరింత అధికంగా ఉంది. వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఎన్నికల కమిషన్‌ మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఎవరేమైతే నాకేమిటంటూ ఎన్నికల నిర్వహణకు సిద్ధ పడుతోంది. వాతావరణ శాఖ, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ మాత్రం అడ్వైజరీలు జారీ చేస్తూ కాలక్షేపం చేస్తున్నాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ అయితే ఆ పని కూడా చేయడం లేదు.
వేసవి ప్రభావం తప్పదు
ఈ నెల 19న తొలి దశలో, 26న రెండో దశలో పోలింగ్‌ జరుగుతుంది. ఈ రెండు దశలపై వేసవి ప్రభావం తప్పదని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ రెండు దశల్లోనూ ఉత్తర, పశ్చిమ, మధ్య భారతంలోని పలు నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరగాల్సి ఉంది. పోలింగ్‌ తేదీ నాడు ఈ ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని అంచనా. ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌ కేవలం అడ్వైజరీలు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నాయి. ఈ నెల 19న 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతాయి. వీటిలో నాలుగు రాష్ట్రాల్లో ఆ రోజు ఉష్ణోగ్రతలు 38-40 డిగ్రీల మధ్య ఉండవచ్చునని వాతావరణ శాఖ చెబుతోంది. మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, పుదుచ్చేరి, రాజస్థాన్‌ రాష్ట్రాలలోని కొన్ని నియోజకవర్గాల్లో తొలి దశలో పోలింగ్‌ జరుగుతుంది. ఈ రాష్ట్రాల్లో ఈ నెల 5వ తేదీ నుండి మే 2 వరకూ…అంటే సుమారు నెల రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయట.
పోలింగుకు వారం ముందు నుండే…
తొలి దశ పోలింగుకు ముందు వారం రోజుల పాటు ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేస్తాయి. తొలి దశ పోలింగ్‌ జరిగే రోజు కొన్ని నియోజకవర్గాల్లో 38-40 డిగ్రీలు, మరికొన్ని చోట్ల 34-38 డిగ్రీలు, ఇంకొన్ని స్థానాల్లో 34-36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చు. పశ్చిమ ప్రాంతంలో మాత్రం 34 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతే నమోదవుతుందట. ఇక రెండో దశ పోలింగ్‌ జరిగే 26వ తేదీన దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటతాయి. వీటిలో మధ్య, తూర్పు, ఉత్తర ప్రాంతాలు ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం 32 డిగ్రీల కంటే తక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అంటోంది.
ఆరోగ్యంపై ప్రభావం
అధిక ఉష్ణోగ్రతలు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరించారు. ముఖ్యంగా ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యే రాజకీయ ర్యాలీలలో ఈ ప్రమాదం అధికంగా ఉంటుంది. ఎందుకంటే వారు గంటల తరబడి తమ నాయకుల కోసం మండుటెండలో ఎదురు చూస్తుంటారు. గత సంవత్సరం మహారాష్ట్రలో జరిగిన ఓ భారీ ర్యాలీ సందర్భంగా వేలాది మంది ప్రజలు ఎండలోనే ఆరేడు గంటల పాటు సభాస్థలిలో కూర్చోవాల్సి వచ్చింది. ఫలితంగా వడదెబ్బకు గురై 14 మంది ప్రాణాలు కోల్పోయారు. వడగాల్పుల ప్రభావం ప్రత్యక్షంగానే కాదు…పరోక్షంగా కూడా ఉంటుంది. ఎండలో కూర్చోకపోయినా వృద్ధులు వడదెబ్బ కారణంగా అస్వస్థతకు గురవుతారు. డీహైడ్రేషన్‌ కారణంగా గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం ఉంది.
గాలిలో తేమ ఉంటే…
ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే తక్కువ ఉన్నప్పటికీ మన ఆరోగ్యం గాలిలో తేమపై ఆధారపడి ఉంటుంది. గాలిలో తేమ ఎక్కువగా ఉంటే శరీరం నుండి చమట త్వరగా విడుదల కాదు. శరీరం చల్లబడకుండా అది అడ్డుకుంటుంది. దీనివల్ల గుండెపోటు రావచ్చు. వాతావరణం చల్లగా ఉండే సమయంలో పోలింగ్‌ నిర్వహించాలని, పోలింగ్‌ కేంద్రాల వద్ద హైడ్రేషన్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ వేసవిలో పగటి ఉష్ణోగ్రతలతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు కూడా సాధారణ స్థాయి కంటే అధికంగానే ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాత్రి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటే శరీరాన్ని చల్లబడనివ్వవని, దీనివల్ల మరునాడు ఉదయం శరీరంపై ఒత్తిడి ఏర్పడుతుందని వారు చెప్పారు.
అడ్వైజరీలతో సరి
వాతావరణ అంచనాలపై ఎన్నికల కమిషన్‌కు ఐఎండీ, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఏ) అడ్వైజరీలు పంపాయి. మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకూ బయటకు రావద్దని సూచించాయి. అయితే ఎన్నికల సన్నాహాలపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎలాంటి సూచనలు అందజేయలేదు. వేసవి తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ఉదయం, సాయంత్రం మాత్రమే ప్రచారం నిర్వహిస్తే బాగుంటుందని పార్టీల కార్యకర్తలు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ నాయకులు సైతం ఉదయం, సాయంత్రం మాత్రమే ప్రచార సభలు నిర్వహిస్తున్నారు.