భవిష్యత్తును మార్చే ఎన్నికలు

భవిష్యత్తును మార్చే ఎన్నికలు– జగన్‌ నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి
– నెల్లూరు జిల్లా సభల్లో చంద్రబాబు
ఆత్మకూరు : వైసిపి మేనిఫెస్టో అట్టర్‌ ఫ్లాప్‌ అని మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. టిడిపి రిలీజ్‌ చేసిన సూపర్‌ సిక్స్‌ పథకాలు సూపర్‌ హిట్‌ అయ్యాయని పేర్కొన్నారు. వైసిపి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. ఈ ఎన్నికలు రాష్ట్ర ప్రజల భవిష్యత్తును మార్చబోతున్నాయని పేర్కొన్నారు. శనివారం ఆయన నెల్లూరు జిల్లా ఆత్మకూరులోనూ, బుచ్చిరెడ్డిపాలెంలోనూ నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభల్లో ప్రసంగించారు. వైసిపి ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో జగన్‌ రాజీనామా పత్రంలా ఉందని వ్యాఖ్యానించారు. కలెక్టరేట్లను, రైతు బజార్లను తాకట్టు పెట్టి మరీ అప్పులు తెచ్చారని విమర్శించారు. రూ.14 లక్షల కోట్లు అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారని, యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా వారి భవిష్యత్తో ఆడుకున్నారని, విమర్శించారు. ప్రభుత్వోద్యోగులను జగన్‌ బానిసలుగా చూస్తున్నారని, మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులను కాపలా పెట్టారని వివరించారు. ఐదేళ్లలో ఒక్క రహదారైనా వేశారా? అని ప్రశ్నించారు. బటన్‌ అందరూ నొక్కుతారని, బటన్‌ నొక్కడానికి సిఎం కావాలా? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చేది ఎన్‌డిఎ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. కాంగ్రెస్‌, భాజపాతో ఉండనని చెబుతున్న జగన్‌కు కేంద్రంలో ఎవరికి మద్దతిస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. నేరాలు, ఘోరాలు చేయడంలో జగన్‌ పిహెచ్‌డి చేశారని విమర్శించారు. దోచుకోవడం, దాచుకోవడంలో మంచి ఎక్స్‌పర్ట్‌ అని ఆరోపించారు. రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగుతోందని, దాన్ని అంతమొందించాలంటే టిడిపి అధికారంలోకి రావాలన్నారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను జగన్‌ తుంగలో తొక్కారన్నారు. మద్యపాన నిషేధం అమలు చేస్తానని చెప్పి రాష్ట్రంలో విచ్చలవిడిగా జగన్‌ బ్రాండ్‌ మద్యం అమ్మకాలు చేస్తున్నారని, ఆడపడుచుల మంగళ సూత్రాలు తెంచుతున్నారని విమర్శించారు.
ప్రభుత్వోద్యోగులకు సిపిఎస్‌ రద్దు చేసి ఒపిఎస్‌ అమలు చేస్తానని చెప్పి మోసగించారన్నారు. తాము అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగులు ఇస్తామని, ఏటా డిఎస్‌సి ప్రకటన ఇస్తామని, తొలి సంతకం డిఎస్‌సి ప్రకటనపైనే చేస్తానని, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని, అంగన్‌వాడీ కార్యకర్తలు, హోంగార్డుల జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారు.