”నారాయణ” అని స్మరిస్తూ, ఆదిశేషుడిపై నిద్రావస్థలో ఉన్న శ్రీహరికి నమస్కరించాడు నారదుడు. కాని శ్రీహరి గాఢనిద్రలో ఉన్నట్లుంది! నారదుడిని చూడలేదు. మరోసారి నమస్కరిం చాడు. అయినా ఫలితం లేదు.దాంతో శ్రీహరి పాదములు ఒత్తుతున్న లక్ష్మీదేవి వంక చేశాడు. గొంతు పెంచమని సైగ చేసింది లక్ష్మీదేవి.
”నారాయణ! నారాయణ!” అంటూ సౌండు పెంచాడు నారదుడు. దాంతో శ్రీహరి కండ్లు తెరిచి, నారదుడిని చూశాడు.
”ఏమి నారదా? బహుకాల దర్శనము! కుశలమేనా?” అంటూ పలకరించాడు శ్రీహరి.
”స్వామీ మీరు జగన్నాటక సూత్రధారులు! అన్నీ మీకు తెలుసు! నాకేదైనా ధర్మ సందేహం కలిగిన ప్పుడు. నివృత్తి కోసం, మీ దర్శనం చేసుకుంటాను!” అన్నాడు నారదుడు.
”ధర్మ సందేహాల సంగతి ఎట్లున్ననూ, నీ కలహ ప్రియత్వము సర్వ లోకములు ఎరిగినదే కదా!” అన్నాడు శ్రీహరి.
”ఇప్పుడు మాత్రం నాకొచ్చిన ధర్మ సందేహం నివృత్తి కోసమే మీ దర్శనం చేసుకొన్నాను స్వామీ!” అన్నాడు నారదుడు.
”ఆలస్యమెందుకు? ఏమి నీ సందేహము?” అడిగాడు శ్రీహరి.
”ఎలక్టోరల్ బాండ్స్! అనిన ఏమి స్వామి?” తన ధర్మ సందేహం వెలిబుచ్చాడు నారదుడు.
”ఎలక్టోరల్ బాండ్స్ గురించి అడుగు తున్నావు! ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్నావా?” చిరునవ్వుతో అడిగాడు శ్రీహరి.
”నాకు అంత సీన్ లేదు స్వామి!” ముందు ఎన్నికల బాండ్స్ గురించి వివరించండి!” అన్నాడు నారదుడు.
”ఒక సంస్థ గాని, వ్యక్తి గాని బ్యాంకులో బాండు కొని తనకు నచ్చిన రాజకీయ పార్టీకి ఇవ్వటం, లేదా బాండును ఆయా పార్టీలకు చెందేలా కొనుగోలు చేయటం ద్వారా ఎన్నికలకు అవసరమైన నిధులను ఆయా పార్టీలకు సమకూర్చటానికి ఏర్పాటు చేసిన బాండ్లే ఎన్నికల బాండ్లు” వివరించాడు శ్రీహరి.
”ఇందులో తప్పు ఏమున్నది? ఎన్నికల్లో ఖర్చు చేయటానికి, రాజకీయ పార్టీలకు నిధులు అవసరం కదా! మరి సుప్రీంకోర్టు ఎందుకు తప్పు పట్టింది? అడిగాడు నారదుడు.
”రాజకీయ పార్టీకి నిధులు ఇవ్వటాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టలేదు! ఇప్పటి వరకు ఎవరు ఏ పార్టీకి బాండ్ల ద్వారా ఎన్ని నిధులు ఇచ్చారో తెలియకుండా రహస్యంగా ఉంచారు! ఈ రహస్య విధానాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది! పారదర్శకంగా ఉండాలన్నదే సుప్రీంకోర్టు తీర్పు సారాంశం!” వివరించాడు శ్రీహరి.
”డబ్బులున్నవాడు అవసరం ఉన్న రాజకీయ పార్టీకి బాండు ద్వారా నిధులిచ్చారు! ఇందులో పారదర్శకత అవసరమేమి ఉన్నది స్వామీ! పైగా, గుప్తంగా దానాలు చేయవలెనని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నవి కదా!” అన్నాడు నారదుడు.
”నీవు, ఎంతో ప్రయాసపడి సందేహ నివృత్తికై వైకుంఠము దాకా ఎందుకు వచ్చితివి?” ప్రశ్నించాడు శ్రీహరి.
”ధర్మ సందేహాల నివృత్తికై ఎన్ని కష్ట, నష్టాలనైనా భరించెదను స్వామీ! అది నా హక్కు!” అన్నాడు నారదుడు దృఢంగా.
” ఎన్నికల బాండ్ల ద్వారా చలామణి అయ్యేది పూర్తిగా ప్రజల డబ్బు! ప్రజల డబ్బు ఇస్తున్నది కంపెనీలు, తీసుకుంటున్నది రాజకీయ పార్టీలు! తమ డబ్బు ఏ కంపెనీ, ఏ పార్టీకి ఎందుకు ఇస్తున్నదీ తెలుసుకునే హక్కు ప్రజలకున్నది! అందువల్ల ఆ వివరాలన్నీ బయట పెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది!” వివరించా డు శ్రీహరి.
”ఈ ప్రజలు నిజంగా పిచ్చివాళ్లు స్వామీ! ఏ కంపెనీ ఏపార్టీ ఎంత నిధిని బాండ్ల ద్వారా ఇచ్చిందో తెలుసుకుని ఏమి చేసుకుంటారు?” అన్నాడు నారదుడు నిర్లక్ష్యంగా.
”నీవు కూడా పిచ్చివాడవే కదా!” అన్నాడు శ్రీహరి నవ్వుతూ దాంతో లక్ష్మీదేవి కూడా నవ్వింది.
”స్వామీ! మీ పరిహాసం నాకు అర్థమైంది! సందేహాన్ని నివృత్తి చేసుకోవటం ద్వారా నేను జ్ఞానాన్ని సంపాదించి. ఇతరులకు కూడా అందచేస్తాను అది లోకకల్యాణానికి తోడ్పడు తుంది!” అన్నాడు నారదుడు రోషంతో.
”భేష్! నారదా! ఇప్పుడు అసలు విషయానికి వచ్చావు! విషయ పారదర్శకత జ్ఞానాన్ని కల్గిస్తుం ది! ఆ జ్ఞానం లోకకల్యాణానికి తోడ్పడు తుంది. ఇదే కదా నీవు చెప్పినది!” అన్నాడు శ్రీహరి.
”ముమ్మాటికీ అంతే స్వామీ! అదే నిత్య సత్యం కూడా!” అన్నాడు నారదుడు మరింద ధృఢంగా.
”ఎన్నికల బాండ్లకు సంబంధించిన విషయాలు బయటకు తెలిసిన తర్వాత ప్రజలకు సరికొత్త జ్ఞానం అందింది! మచ్చుకి కొన్ని తెలుపుతాను విను! లాటరీలు నిర్వహించే ఒక కంపెనీ, తన ఆదాయానికి రెండింతలు అంటే వెయ్యికోట్ల రూపాయల బాండ్లు కొనుగోలు చేసింది. మరొక ఔషధ కంపెనీ, ముందు ఐదు లక్షల విలువైన బాండు కొనుగోలు చేసింది. కొతకాలం తర్వాత 30 కోట్ల బాండ్లు కొనుగోలు చేసి, అధికార పార్టీకి అప్పచెప్పింది. ఇప్పుడు కేజ్రీవాల్ అవినీతి పరుడని సాక్ష్యం చెప్పిన శరత్ చంద్రారెడ్డి కూడా అధికార పార్టీకి ఎన్నికల బాండ్ ఇచ్చాడు! మేఘా కంపెనీ కూడా అధికార పార్టీకి బాండ్ల నజరానా సమర్పిం చింది!” వివరించాడు శ్రీహరి.
”ఇందులో కొత్తగా వచ్చిన జ్ఞానమేమున్నది?” ప్రశ్నించాడు నారదుడు.
”పైన చెప్పిన కంపెనీలు ఏవీ స్వచ్చందంగా బాండ్లు కొనుగోలు చేయలేదు! ఆయా కంపెనీలపై ఈడి దాడులు చేసి కేసులు పెట్టింది! ఆ తర్వాతే ఆయా కంపెనీలు బాండ్లు కొనుగోలు చేసి, అధికారపార్టీకి అప్ప చెప్పాయి! అందుకే ఉత్తరాఖండ్‌లో కూలిపోయిన టన్నెల్ నిర్మించిన కంపెనీ మీదగాని, బీటలు వారిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన మేఘా కంపెనీపైన గాని ప్రభుత్వం చర్యలు తీసుకోవటం లేదు! సారాంశం ఏమిటంటే అధికారపార్టీకి నిధులివ్వక పోతే ఈడి ద్వారా దాడులు చేయిస్తారు! నిధులు ఇస్తే, కేసులు ఎత్తి వేస్తారు! ఎంత అవినీతి జరిగినా పట్టించు కోరు అంటే నీవు ఎంతైనా సంపాదించుకో! నాకు కొంతైనా సమర్పించుకో!” అని అర్థం!” వివరించా డు శ్రీహరి.
”దివ్యంగా సెలవిచ్చారు! స్వామీ! కానీ మీ కృష్ణావతారంలోని కుచేలోపాఖ్యానమే ఎలక్టోరల్ బాండ్లకు స్పూర్తి అనీ, తాము చేసింది కూడా అదేనని కుచేలుడి వద్ద మీరు అటుకులు తీసుకున్నట్లు, తాము కూడా కార్పోరేట్ కంపెనీల వద్ద ఎలక్టోరల్ బాండ్లు తీసుకున్నామని! మీకు అటుకులు ఇచ్చిన కుచేలుడికి, మీరు కూడా అంతులేని సంపదలు అనుగ్రహించితిరి కదా! అందువల్ల తాము చేసినది మాత్రమే తప్పెలా అవుతుందని ప్రధాని అంటున్నారు!” అన్నాడు నారదుడు.
”నారదా! కుచేలుడు నాకు అటుకులు ఇచ్చుట, నేను అతనికి సంపదలు నొసగుట మాత్రమే చూస్తే ఎలా! అందులోని ధర్మ సూక్ష్మ మును గ్రహించవలెను! కుచేలుడు నిరుపేద వాడు! నేను అప్పుడు అనగా కృష్ణావతారములో రాజును! అందుకే కుచేలుడికి సంపదలు అనుగ్రహించితిని. ప్రధాని కూడా కుచెలురైెన పేదలకు సంపదలు అనుగ్రహింప వచ్చును. అవకాశము, అధికారము రెండూ ప్రధానికి ఉన్నవి. కాని ఆ రెండింటిని వినియోగించి అదే పేద ప్రజలను దోచుకుంటున్న కార్పోరేట్ కంపెనీ లకు సంపదలను అనుగ్రహించు చున్నారు. నా కృష్ణావతారము పేరు చెప్పి ప్రజలను మరోసారి మోసగించుచున్నారు!
ఈ ధర్మ సూక్ష్మమును నీవు ప్రజలకు వివరించిన లోక కల్యాణము జరుగును!” అన్నాడు శ్రీహరి.
”ఆవశ్యము స్వామీ! మీరు చెప్పిన ఈ ధర్మ సూక్ష్మమును ప్రజలకు వివరించెదను లేనిచో లోక కల్యాణము సంగతి తర్వాత ముందుగా లోక నాశనము జరుగును” అన్నాడు నారదుడు ఆందోళనగా.
నారదుడి వంక లక్ష్మీదేవి ఆశ్చర్యంగా చూసింది!
”మీకు తెలియంది ఏమున్నది తల్లీ! ఎలక్టోరల్ బాండ్ల ప్రభావం వైకుంఠము దాకా ప్రసరించింది! బాండ్ ఇవ్వనిదే జయవిజయులు నన్ను కూడా లోపలికి రానివ్వలేదు!” అన్నాడు నారదుడు చేతులు జోడించి
దాంతో లక్ష్మీదేవి అంతర్థానమై పోయింది.
– ఉషాకిరణ్