భారత సర్వోన్నత న్యాయస్థానం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించిన ఎన్నికల బాండ్ల పథకం, నల్లడబ్బుతో ఎన్నికలకు నిధులు సమకూర్చే విధానానికి అంతం పలుకుతుందని అందరూ భావించారు. ఇదే జరిగి ఉండి ఉంటే, దేశానికి గొప్ప ప్రయోజనాలు కలిగే విధంగా భారత రాజకీయాలు మార్పు చెంది ఉండేవి. అన్నిటినీ మించి, అక్రమంగా నిధులను సమకూర్చే విధానం ఫలితంగా రాజకీయాల నియంత్రణ దాని చేతుల్లోకి వెళ్లడంతో, అది ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుంది. ఎన్నికల బాండ్లకు, భారతదేశంలో రాజకీయాలు నిర్వహించబడే తీరుకు రవ్వంత తేడా కూడా లేదు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు పెద్ద మొత్తంలో ఖర్చు చేసే అక్రమ నిధులతోనే ఎన్నికల పోరాటం కొనసాగుతుంది.
అనుభవం చాలా స్పష్టంగా ఉంది. ఒకవేళ రాజకీయాల్లో అసలు విషయం అప్రజాస్వామికంగా ఉంటే, ఎన్నికల బాండ్ల లాంటి మరమ్మతులు దానిని ప్రజాస్వామికంగా మార్చలేవు. భారత రాజకీయాల్లో అసలు విషయంలో లోటు ఏర్పాటు లాంఛనంగా మారడం వల్ల డబ్బు అవసరం పెద్ద మొత్తంలో ఏర్పడుతుంది. ముఖ్యంగా తాము ఎన్నిక కావడానికి నిధులను సమకూర్చిన వారి ప్రయోజనాల కోసం పాటుపడే ఎన్నికైన నాయకులు వారి స్వంత నియోజకవర్గ ప్రయోజనాల కోసం ప్రాతినిధ్యం వహించరు. స్వార్ధప్రయోజనాల కోసం పాటుపడే వారే ఎన్నికవుతున్నారు.వారు చెప్పే దానికి, ఆచరించే దానికి తేడా స్పష్టంగా ఉంది.
ప్రభుత్వం ఇంక ఎంత మాత్రం ప్రజలచేత,ప్రజల కోసం ఎన్నుకోబడే, ప్రజల ప్రభుత్వం కాదు, కాబట్టి చెప్పే దానికి, ఆచరించే దానికి మధ్య ఉన్న తేడా ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుంది. ప్రభుత్వ విధానాల నుండి ప్రజలు ప్రయోజనాలు పొందక పోవడం, అభివద్ధి నుండి కలిగే లాభాలపై స్వార్ధ ప్రయోజనాలకు అదుపు సాధించడాన్ని అశేష ప్రజానీకం చూస్తున్నారు. ఇది విధానాల రూపకల్పనలోనే ఉంది. విధానాలను, చాలా తెలివిగా జాతీయ ప్రయోజనాలకు సంబంధించినవిగా కనిపించేట్లు రూపొందిస్తారు. వాస్తవానికి, వారు స్వార్ధ ప్రయోజనాల్ని,జాతీయ ప్రయోజనాలుగా నిర్వచిస్తారు. అణగారిన వర్గాల ప్రయోజనాల కంటే కూడా వారు స్వార్ధ ప్రయోజనాలకే ప్రాధాన్యతనిస్తారు.
ఉదాహరణకు, పేదరికం, నిరుద్యోగం, అనారోగ్యం, హీనమైన విద్యా ప్రమాణాలు కొనసాగితే, అవి సహజమైనవిగా పరిగణించి మార్కెట్ శక్తులకు వదిలి వేస్తారు. మార్కెట్ ద్వారా ఈ సేవలను సమకూర్చే వ్యాపారులకు రాయితీలు మంజూరు చేస్తారు. దీని ఫలితంగా వాటిని సమకూర్చుకోలేని పేదల అసమర్థత అంతరాల పెరుగుదలకు దారితీస్తుంది. ఆ రాయితీలు కూడా ప్రభుత్వ రంగంలో వనరుల లభ్యతను తగ్గిస్తుంది. దానివల్ల అది ఈ సేవలను అవసరమైన స్థాయిలో సమకూర్చలేక పోతుంది. సరిపోని ప్రభుత్వరంగ సేవలు అణగారిన వర్గాల ప్రయోజనాల్ని దెబ్బతీస్తాయి.ఉదాహరణకు, 14 నుండి 18 ఏండ్ల మధ్య వయస్సులో ఉన్న పిల్లల్లో 40 శాతం మంది చదవలేని, రాయలేని, రెండవ తరగతి స్థాయి లెక్కల్ని చేయలేని స్థితిలో ఉన్నారని ఆన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ (ఏఎస్‌ఈఆర్) తాజా నివేదిక చెబుతోంది. వారి పేదరికాన్ని అంతం చేసే ఉన్నత నైపుణ్యాలను వారు సాధించలేక పోతున్నారు. కాబట్టి, విద్య ఉన్నత ప్రాధాన్యతను ఎందుకు పొందలేకపోతున్నది? ఎందుకంటే, పైనుంచి కిందకి జరిగే అభివద్ధి క్రమంలో వనరులను, ఉన్నత వర్గాల వారే ఆక్రమించుకుంటారు. చట్టబద్ధంగా పొందే లాభాలతో సంతప్తి చెందని వ్యాపారాలు, అప్రకటిత ఆదాయాలను ఉపయోగించి అక్రమ సంపాదనను ఆశ్రయిస్తాయి. అది నల్ల ఆర్థిక వ్యవస్థ నేర్పరుస్తుంది. ఈ చట్టవిరుద్ధత క్రమబద్ధమైనది, వ్యవస్థీకృతమైనది. అయితే విధాన నిర్ణేత, కార్యనిర్వహకుడు వ్యవస్థల్ని ధ్వంసం చేసే దానిలో భాగంగా ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఇది నల్ల ఆదాయ సష్టికి ఆధారమయ్యే త్రయం.
దీనికి ప్రభుత్వ సిబ్బంది బలహీనమైన జవాబుదారీతనం తోడై భారతదేశంలో ప్రజాస్వామ్యానికి లోటుకు కారణమవుతున్నది. సమాజంలో ప్రబలంగా ఉన్న విశాల భూస్వామ్య మనస్తత్వంతో ఇది బలపడుతుంది. అధికారం ముందు వ్యక్తులు సాష్టాంగపడటానికి దారితీస్తుంది. ప్రజాస్వామ్యాన్ని సమర్థిస్తాయని అనుకుంటున్న సంస్థల్లో ఇది స్పష్టంగా కనిపిస్తుంది.
ఎన్నికల్లో డబ్బు పాత్ర
ఓటింగ్ సాధారణంగా అభ్యర్థి పని విధానం పై ఆధారపడి ఉండదు కానీ కులం, మతం, ప్రాంతంపై ఆధారపడి ఉంటుంది. వీటి ప్రాతిపదికనే, ఎన్నికల్లో విజయం సాధించడానికి ప్రజల్లో విభజన తీసుకొని వస్తారు. ఎన్నికల ముందు ఓటు బ్యాంకుల్ని పెంచి పోషించి, ఓటర్లకు డబ్బులు పంచుతారు. కొంతమందికి డబ్బు ఇచ్చి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు. ప్రదర్శనలకు, మీటింగ్‌లకు హాజరయ్యేందుకు డబ్బులిచ్చి ప్రజా సమూహాలకు భోజనాలు, రవాణా సౌకర్యాలు కల్పించి సమీకరణలు చేస్తారు. ఓటర్లలో జోష్ తెచ్చేందుకు పెద్ద పెద్ద ర్యాలీలు నిర్వహిస్తారు. వాటి కోసం పోస్టర్లు, కటౌట్లు అవసరం. పహిల్వాన్లను కిరాయికి తెచ్చుకుంటారు, మీడియాను సంతోషపెడతారు. ఇలాంటి వాటికి పెద్ద మొత్తంలో డబ్బు అవసరం ఉంటుంది. ఒక పెద్ద పార్లమెంటరీ నియోజకవర్గానికి ఖర్చుల నిమిత్తం అనుమతించబడిన 95 లక్షల కంటే మించిన డబ్బు అవసరం. దీని గురించి తెలిసిన వారు 50 కోట్ల రూపాయలు అవసరం ఉంటుందని చెబుతున్నారు. ఆ విధంగా ఒక అభ్యర్థి 49 కోట్ల రూపాయల నిధులను అక్రమంగా సమీకరించుకోవాల్సి ఉంటుంది. ఈ మొత్తానికి మించి తన రాజకీయాలకు, తన పార్టీ కార్యాలయాల నిర్వహణకు, జన సమీకరణకు ఒక పార్టీ మళ్లీ అక్రమ నిధుల ద్వారానే ఖర్చు చేస్తుంది.
ఈ నేపథ్యంలో ఎన్నికల బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం, రాజకీయ పార్టీలు చట్టబద్ధంగా నిధులను సమ కూర్చుకునే అవకాశం కల్పిస్తుందనీ, అక్రమ పద్ధతుల్లో వచ్చే నిధులపై వారు ఆధారపడడం తగ్గుతుందనే వాదన ఉండేది. అయితే, ఒక రాజకీయ పార్టీకి ఎవరు, ఎందుకు (చట్టబద్ధంగా కానీ,చట్టవిరుద్ధంగా కానీ) నిధులు సమకూర్చుతున్నారో ఓటర్లకు తెలియక పోవడం వల్ల ఈ పథకం అమల్లోకి వచ్చిన మొదటి రోజు నుండి, ఇది పారదర్శకంగా లేదనే విమర్శలను ఎదుర్కొంటున్నది. పొందిన సహాయానికి ప్రతిఫలంగా తెల్ల డబ్బు రూపంలో లంచం ఇచ్చే అవకాశాన్ని ఈ పథకం కల్పిస్తుంది. డబ్బును పెద్ద మొత్తంలో వ్యాపారులు, ధనికులు మాత్రమే ఇవ్వగలుగుతారు కాబట్టి, వారి పలుకుబడి, వారు అవకతవకలకు పాల్పడే అవకాశాలు బాగా పెరుగుతాయనే అంచనా కూడా ఉంది. బాండ్లను కేవలం ఒక రాజకీయ పార్టీకి మాత్రమే ఇవ్వవచ్చు కానీ వ్యక్తులకు ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి, వ్యక్తికి అక్రమ నిధులు అవసరమవడం కొనసాగింది. నిధులను పొందిన పార్టీ కేవలం ఎన్నికల కోసం మాత్రమే కాక అన్ని రకాలుగా అంటే కార్యాలయాల ఏర్పాటుకు, ప్రతిపక్ష పార్టీల నేతత్వంలోని ప్రభుత్వాలను అస్థిరపరచడానికి కూడా ఆ నిధులను ఉపయోగించవచ్చు. అందువల్ల, ఎన్నికల బాండ్లు అనే పేరు అసంబద్ధంగా ఉంది. లాభాల్లో 7.5 శాతాన్ని మాత్రమే ఇవ్వాలనే పరిమితిని ఎత్తివేశారు కాబట్టి ఎంత డబ్బునైనా లంచంగా ఇవ్వవచ్చు. నష్టాలలో ఉన్న కంపెనీలు కూడా విరాళాలను ఇవ్వవచ్చు. విదేశీ కంపెనీలు కూడా విరాళాలు ఇవ్వడానికి వీలుగా తలుపులు తెరుస్తూ, ఉనికిలోలేని షెల్ కంపెనీలను ఉపయోగించుకోవచ్చు.
బయటపడిన ఆశ్రిత వాదం
రాజకీయ పార్టీలకు అవసరమైన మొత్తం నిధుల్లో ఎన్నికల బాండ్లు కొద్ది భాగమే అయినప్పటికీ కూడా అందుబాటులో ఉన్న వివరాలు భారత రాజకీయాలు, ఎన్నికల లక్షణాల గుట్టు విప్పుతున్నాయి. విధాన నిర్ణేతల నుండి అనుకూల విధానాల కోసం, తప్పులు చేసినందుకు విచారణ చేయకుండా తప్పించుకోవడానికి, భవిష్యత్తు కోసం పెట్టుబడిగా రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చు తున్నట్టు వివరాలు చెబుతున్నాయి. చివరి కేటగిరీ కింద అధికారం లేని రాజకీయ పార్టీలు కూడా నిధులను పొందుతున్నాయి. విధా నాలను తారుమారు చేయడం లేదా విధానాల అమలులో ప్రాధాన్యతలు పొందేలా, వ్యాపారానికి మొదటి కేటగిరీ (అనుకూల విధానాలు) అవకాశం కల్పిస్తుంది. ఉదాహరణకు, పర్యావరణం క్లియరెన్స్ లేదా కాంట్రాక్ట్ పొందడం లాంటివి. రెండో కేటగిరీ ఒత్తిడితో, బలవంతంగా ఒప్పించే విధానం. దీనిలో నియమనిబంధనలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్‌్ డైరెక్టొరేట్ లాంటి ఏజెన్సీలు నియమాల ఉల్లంఘనను గుర్తించి, విచారణ చేపట్టవచ్చు. ఈ విచారణ ప్రక్రియ శిక్షగా మారేలా కేసును సాగదీయవచ్చు. నియమాలను ఉల్లంఘించి, దగ్గర మార్గాల్లో తమ పనుల్ని చేయించుకునే కొన్ని వ్యాపారాలపై ఒత్తిడి తేవడం చాలా తేలిక. వేధింపుల నుండి తప్పించుకోడానికి డబ్బులు ముట్టజెప్పే కొన్ని వ్యాపారాలు కూడా ఉన్నాయి. కొన్ని పనులు చేయించుకున్న దానికి ప్రతిఫలంగా (క్విడ్ ప్రో ఖో) కొందరు విరాళాలు అందజేశారని స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా ఇచ్చిన వివరాలు తెలియజేస్తున్నాయి. డబ్బు వచ్చిన మార్గం, విధానాల్ని తారుమారు చేసే దానితో ఉన్న సంబంధాన్ని, పూర్తి విశ్లేషణ బట్టబయలు చేస్తుంది. ఇది కూడా నేరాన్ని బహిర్గతం చేస్తుంది.
రాజకీయ నాయకత్వం జవాబుదారీతనంతో పనిచేసే ఒక ప్రజాస్వామ్యంలో ఎన్నికల పోరాటం చేయడానికి పెద్ద మొత్తంలో నిధుల అవసరం గానీ, ఎన్నికల బాండ్లను రహస్యంగా కొనాల్సిన అవసరం గానీ లేదు. నిర్దేశించబడిన వ్యయ పరిమితికి మించి ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎన్నికల బాండ్ల పథకం కేవలం భారత ప్రజాస్వామ్యం యొక్క పెరుగుతున్న బలహీనతను మాత్రమే నొక్కి చెపుతుంది.ఇది ఒక ఆదర్శవంతమైన పరిస్థితుల్లో పనిచేసి ఉండెడిది అయితే అప్పుడు దాని అవసరం ఉండేది కాదు. ప్రతిపక్షాలను, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేందుకే దీనిని రూపొం దించినట్టు కనపడుతుంది.
(”ద హిందూ” సౌజన్యంతో)
(వ్యాస రచయిత జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో రిటైర్డ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్)
అనువాదం: బోడపట్ల రవీందర్, 9848412451
ప్రొ. అరుణ్‌కుమార్