
– నిబంధనలతో తప్పని ఇబ్బందులు
– నగదు చెల్లింపుపై ఆంక్షలు
– పంక్షన్ హాళ్లు…వాహనాల కొరత
– బంగారం, వస్ర్తాల కొనుగోళ్లకు అడ్డంకులు
నవ తెలంగాణ- మల్హర్ రావు: శుభకార్యాలయాలు చేసేవారికి ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారి కష్టాలను తెచ్చి పెట్టింది. దీని ప్రభావం ప్రదానంగా పెళ్లిళ్లపై పడుతోంది. నవంబర్ 16 నుంచి వరుసగా శుభ ముహుర్తాలు ఉన్నాయి. వివాహాలకు అన్ని సిద్ధం చేసుకున్నావ్తరుణంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. పెళ్లింటివారు దుస్తులు, బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు, నగదు లావాదేవీలు చెల్లింపులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చెక్ పోస్టుల వద్ద పట్టు బడటంతో…
ఎన్నికల కోడ్ నేపథ్యంలో కోడ్ అమల్లో ఉండటంతో పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు.రూ.50 వేలకు మించి డబ్బులు తీసుకెళ్ళితే సీజ్ చేస్తున్నారు. సాధారణంగా పెళ్లిళ్లు, శుభకార్యాలకు లిక్విడ్ క్యాష్ అవసరం ఉంటుంది. పంక్షన్ హాల్ బుక్ చేయడం, వంట వాళ్లకు టెంట్లకు, దుస్తులు, బంగారం కొనుగోలు వంటి వాటికి నగదు అవసరం. ఎంత లేదన్న రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు వెంటా తీసుకెళ్ళాల్సి ఉంటుంది. బంగారం సైతం కొనుగోలు చేసి తీసుకెళ్తారు. అయితే డబ్బు తీసుకెళ్లే క్రమంలో పోలీసులకు పట్టు బడుతున్నారు. శుభ కార్యాల కోసం తీసుకెళ్తున్నామని ఆధారాలు చూపించిన పోలీసులు వినిపించుకోవడం లేదు. డబ్బు పట్టు బడితే దాన్ని విడిపించుకోవడం కోసం పోలీస్ స్టేషన్, ఎన్నికల అధికారులు చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వస్తుంది.
వాహనాలు లేవు…
పెళ్లిళ్లలో అతిథులను తీసుకెళ్లడానికి వాహనాలు అవసరం. సొంత వాహనాలు ఉన్నవారికి పెద్ద సమస్య లేదు. కానీ లేనివారి పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. పెళ్లి కోసం కార్లు,బస్సులు దొరకడం లేదు.ఎన్నికల షెడ్యూల్ జారి అయిన మరుసటి రోజే అభ్యర్థులు వీటిని బుక్ చేసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో వాడుకోవడానికి ఒక్కొక్క అభ్యర్థి అధికారికంగా మూడు, నాలుగు అనాదికారికంగ నాలుగైదు వాహనాలు బుక్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దింతో పెళ్లిళ్లకు వాహనాలు దొరకని పరిస్థితి.
పంక్షన్ హాళ్ల కొరత…
పక్షన్ హాళ్లను వివిధ పార్టీల అభ్యర్థులు ప్రచార వేదికలుగా మార్చుకోవడంతో పెళ్లిళ్ల నిర్వహణ ప్రధాన సమస్యగా మారనుంది. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో భాగంగా అలాగే ప్రచారంలో పాల్గొనే కార్యకర్తలకు భోజనాలు రాత్రుపూటకు బసకు వీటిని ముందే బుక్ చేసుకున్నారు. టెంట్లు, వంట సామాగ్రి కూడా పెళ్లిళ్లకు దొరికే పరిస్థితి లేదు.